ఇక గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్ అనే తేడా కనిపించదు.. ఎందుకంటే?

  • Publish Date - June 8, 2020 / 05:51 AM IST

గవర్నమెంట్ స్కూళ్లంటే చులకనగా చూసేవాళ్లందరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అదేంటంటే.. రాష్ట్రంలో ఇప్పటివరకు గవర్నమెంట్ స్కూళ్లకు, ప్రైవేట్‌ స్కూళ్లకు ఉన్న ప్రధాన తేడాలు వసతులు, ఆంగ్లంలో బోధన. అయితే ఇక అలాంటి తేడాలు ఉండవు. ఇప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అనే తేడా లేకుండా అమ్మఒడి లాంటి పథకాల ద్వారా గవర్నమెంట్ స్కూళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఒకేఒక్క సంవత్సరంలో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లను విడిచిపెట్టి గవర్నమెంట్ స్కూళ్లలో చేరడం దీనికి నిదర్శనం.  

అంతేకాదు గవర్నమెంట్ స్కూళ్లలో లక్ష్యాన్ని మించి అడ్మీషన్లు నమోదవుతున్నాయి. గతేడాది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన అమ్మఒడి  పథకంతో ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మీషన్లు భారీగా పెరిగాయి. 2020 నుంచి 2021 విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో రూ.10వేల కోట్లతో విద్యార్ధులకు మంచి సదుపాయాలు కల్పించి, ఇంగ్లిష్‌ మీడియం అందుబాటులోకి తెచ్చారు.

కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా పిల్లలకు చదువు నేర్పించడానికి ప్రభుత్వం ఏడాదిలోనే పలు చర్యలు చేపట్టింది. శరవేగంగా స్కూళ్ల అభివృద్ధి పనులు ప్రారంభం చేశారు. రాష్ట్రంలోని 44వేల 515 ప్రభుత్వ స్కూళ్లలో రూ.10 వేల కోట్లతో సదుపాయాలు కల్పించేందుకు మనబడి “నాడు నేడు” అనే పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మొదటిగా 15వేల715 స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు రూ.3వేల 832 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందులో ఇప్పటికే రూ.3వేల333 కోట్ల నిధులు మంజూరు చేశారు. స్కూళ్లలో టాయిలెట్లు, కరెంట్, మంచినీరు, టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నీచర్, పెయింటింగ్, బ్లాక్‌ బోర్డులు. ఇంగ్లీషు ల్యాబ్స్ లాంటి 9 రకాల సదుపాయాలను కల్పిస్తారు. ప్రభుత్వం ఇప్పటికే పనులకు అన్ని అనుమతులు ఇవ్వడంతో శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఇకపోతే జగనన్న గోరుముద్ద ద్వారా 36,58,553 మంది పిల్లలకు రుచికరమైన ఆహారాన్ని రోజుకో రకమైన మెనూతో ప్రభుత్వం అందిస్తోంది. గోరుముద్ద ద్వారా రాష్ట్రంలోని 45,723 ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలోని చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని సమకూరుస్తోంది. ఇక వంట చేసేవారికి రూ.1000 నుంచి ప్రభుత్వం రూ.3 వేలకు పెంచింది. ముఖ్యమంత్రి జగన్‌ సూచనల మేరకు కొత్త మెనూను ప్రకటించి రోజూ వేర్వేరు రకాల పదార్థాలతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. దీనికోసం అదనంగా రూ.1,048.57 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది.

అంతేకాదు జగనన్న విద్యాకానుక పథకం కింద 2020 నుంచి 21 విద్యా సంవత్సరం వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు 3 జతల దుస్తులు, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, పుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్‌ అందిస్తారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వీరిలో అత్యధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులే ఉన్నారు.

ఇంగ్లీషు మీడియాం:
ఇకపోతే తెలుగు మీడియం వద్దు, ఇంగ్లీష్ మీడియం ముద్దు అంటారు తల్లీదండ్రులు. మరైతే.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులందరికీ ఇంగ్లీష్ బోధన ద్వారా అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను కల్పించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా 2020–21 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇక తదుపరి హైకోర్టు సూచన మేరకు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. మొత్తం 17,97,168 మంది నుంచి ఆప్షన్లు రాగా 96.17 శాతం మంది ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకున్నారు. 

గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యార్థులకు అమ్మ ఒడితో కొండంత అండ ఇచ్చింది. డబ్బులు లేని పేద పిల్లలకు చదువు దూరం అవ్వకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకూ ఈ పథకాన్ని వర్తింపచేసింది. ఏడాదిలో 2.50 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలోకి చేరడం గమనాహారం. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్‌ స్కూళ్లలో చేరేవారి సంఖ్య అధికంగా ఉండగా.. ఇప్పుడు రివర్స్ అయింది.

Read:నవశకం : ఇంటింటికి నాణ్యమైన బియ్యం

 

ట్రెండింగ్ వార్తలు