అందుకోసమే.. చంద్రబాబు విదేశాలకు వెళ్లారు- మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు

నేర చరిత్ర కలిగిన వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టాలని టీడీపీ చూస్తోందన్నారు. ఇది చట్ట విరుద్ధం అని చెప్పారు.

Malladu Vishnu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ దేశం వెళ్తున్నారో చెప్పకుండా వెళ్ళారంటే.. అక్కడ కుట్రదారులు అందరినీ కలవడానికి వెళ్ళారనేది మా ప్రధాన ఆరోపణ అని మల్లాది విష్ణు అన్నారు. తన పీఏ శ్రీనివాసమూర్తి, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ముద్దాయిలుగా ఉన్న వారిని కలవడానికి చంద్రబాబు విదేశాలకు వెళ్ళారని మల్లాది విష్ణు ఆరోపించారు. ఎన్నికల ముందు దేశంలో, ఎన్నికల తర్వాత విదేశాల్లో చంద్రబాబు కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారాయన. జగన్ మాత్రం చంద్రబాబులా కాదని.. తాను ఎక్కడికి వెళ్తున్నది చెప్పి వెళ్లిన వ్యక్తి అని మల్లాది విష్ణు అన్నారు.

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని కొత్తపేటలో పోలింగ్ రోజున క్యూలో ఉన్న ఓటర్లకు టీడీపీ నేతలు డబ్బులు పంచారని, స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళను పట్టుకుని ఆర్వోకు అప్పగించి ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేవని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు పంచుతున్న విజువల్స్ ఉన్న వీడియోను ఆధారంగా ఇచ్చినా అధికారులు స్పందించని పరిస్థితి ఉందన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరామన్నారాయన.

రాష్ట్రంలో టీడీపీ చేయని కుట్ర లేదన్నారు. అనేక సభల్లో సీఎం జగన్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని అన్నారు. విదేశాల నుండి NRI ల ద్వారా డబ్బులు తెచ్చి ఓటర్లకు టీడీపీ పంపిణీ చేసిందని మల్లాది విష్ణు ఆరోపించారు. గతంలో ఒక NRI మాట్లాడిన వీడియో బయటకు వచ్చిందని, ఆ వీడియోలో NRI మాట్లాడిన విధానాన్నే టీడీపీ అమలు చేసిందని చెప్పారు.

పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద, జిల్లా యంత్రాంగం మీద, పోలీసు వ్యవస్థ మీద ఉందన్నారు. నేర చరిత్ర కలిగిన వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టాలని టీడీపీ చూస్తోందన్నారు. ఇది చట్ట విరుద్ధం అని చెప్పారు. దీని వలన కౌంటింగ్ సమయంలో కూడా గొడవలు జరిగే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లుగా నేర చరిత్ర కలిగిన వాళ్లని నియమించాలని టీడీపీ ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ తిరస్కరించాలని మల్లాది విష్ణు కోరారు.

Also Read : చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు? ఏమైపోయారు? రాష్ట్ర ప్రజలకు తెలియాలి- మంత్రి జోగి రమేశ్

ట్రెండింగ్ వార్తలు