ఈవీఎం ధ్వంసం కేసు.. ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌పై ఈసీకి డీజీపీ నివేదిక

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేశామని నివేదికలో పేర్కొన్నారు.

Evm Damage : ఏపీలో పోలింగ్ రోజు (మే 13) ఈవీఎం ధ్వంసం కేసులో కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నివేదిక అందించారు. సీఈవో ద్వారా సీఈసీకి నివేదిక పంపారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని నివేదికలో పేర్కొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశామని తెలిపారు. పిన్నెల్లి కోసం అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో 4 బృందాలు పని చేస్తున్నాయని డీజీపీ తెలిపారు.

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎలా బయటకి వచ్చిందని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీతో ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కయారని ఆయన ఆరోపించారు. ఈసీ రిలీజ్ చేయకుండానే టీడీపీ నేత నారా లోకేశ్ ఆ వీడియోను ఎక్స్ లో ఎలా పోస్ట్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారని అందుకే హింస చోటు చేసుకుందని వెల్లడించారు.

ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలని మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు డీజీపీని కలిశారు. మాచర్లలో పథకం ప్రకారమే పిన్నెల్లి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు డీజీపీకి వినతిపత్రం అందజేశారు.

మాచర్చ నియోజకవర్గం 202 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలో ఏ1-గా పిన్నెల్లిని చేర్చామని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంలు ధ్వంసం చేసి వ్యక్తులపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. పిన్నెల్లితో పాటు నిందితులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశామన్నారు.

Also Read : ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈసీ సీరియస్.. పిన్నెల్లి గెలిచినా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశం!

ట్రెండింగ్ వార్తలు