RCB vs RR Eliminator : ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం.. బెంగళూరు ఇంటికి..!

RCB vs RR Eliminator : ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీ నుంచి ఆర్సీబీ నిష్ర్కమించగా.. ఫైనల్ బెర్త్ కోసం హైదరాబాద్ జట్టుతో రాజస్థాన్ పోటీ పడనుంది.

RCB vs RR Eliminator : ఐపీఎల్ 2024లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 173 పరుగుల విజయ లక్ష్యాన్ని రాజస్థాన్ అద్భుతమైన ప్రదర్శనతో ఛేదించింది. ఆర్ఆర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45), రియాన్ పరాగ్ (36) పరుగులతో రాణించగా, మిగతా ఆటగాళ్లలో షిమ్రాన్ హెట్మెయర్ (26), రోవ్మాన్ పావెల్ (16 నాటౌట్), టామ్ కోహ్లర్ కాడ్మోర్ (20), సంజు శాంసన్ (17) పరుగులు చేశారు.


ధృవ్ జురెల్ (8) సింగిల్ డిజిట్ కే పరిమితయ్యాడు. ఫలితంగా బెంగళూరు నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేదించింది. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులతో విజయాన్ని అందుకుంది. తద్వారా ఫైనల్ బెర్త్ కోసం హైదరాబాద్ జట్టుతో రాజస్థాన్ పోటీ పడనుంది.

ఎలిమినేటర్ మ్యాచ్‌‌లో పరాజయం పాలైన ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీయగా, లాకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, కామెరాన్ గ్రీన్ తలో వికెట్ తీసుకున్నారు. బెంగళూరు పతనాన్ని శాసించిన రవిచంద్రన్ అశ్విన్ (2/19)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

రజత్ పాటిదర్ టాప్ స్కోరర్ :
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు రాజస్థాన్‌కు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ (33), రజత్ పాటిదార్ (34), మహిపాల్ లోమ్రోర్ (32) పరుగులతో రాణించారు.

మిగతా ఆటగాళ్లలో కామెరాన్ గ్రీన్ (27), కెప్టెన్ డుప్లెసిస్ (17), దినేష్ కార్తీక్ (11) పరుగులు చేశారు. కర్ణ్ శర్మ (5) పరుగులకే చేతులేత్తేయగా, స్వప్నిల్ సింగ్ (9 నాటౌట్) అజేయంగా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు