Cm Revanth Reddy : గొడవలు సృష్టించి హైదరాబాద్ పెట్టుబడులను గుజరాత్ తరలించే ప్రయత్నం చేస్తోంది- బీజేపీపై సీఎం రేవంత్ పైర్

ఎస్సీ, బీసీ, ముస్లిం రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయి. ఎంఐఎంని గెలిపించడం వల్ల హైదరాబాద్ కు ఎలాంటి ఉపయోగం లేదు.

Cm Revanth Reddy : మన మధ్య విభేదాలు సృష్టించే వారిని ఓడించండి అని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైరదాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అద్భుతమైన అభివృద్ధి చేసే బాధ్యత నాది అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 400 ఏళ్ల పాతబస్తీ  పేరు ప్రఖ్యాతలు పెరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి సమీర్ వలీవుల్లా గెలవాలన్నారు. మనుషులు, మతాల మధ్య విభేదాలు సృష్టించి గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఎస్సీ, బీసీ, ముస్లిం రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయన్నారు. ఎంఐఎంని గెలిపించడం వల్ల హైదరాబాద్ కు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. హైదరాబాద్ కు మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. మోదీ, ఓవైసీ పాతబస్తీకి మెట్రో తీసుకురాలేకపోయారని అన్నారు. గోషామహల్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

”పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ పాతబస్తీకి మెట్రో ఎందుకు తీసుకురాలేదు..? మూసీ ప్రక్షాళనకు మోదీ ఒక్కపైసా కూడా ఇవ్వలేదు. ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. 500 వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచాం. పాతబస్తీ ప్రజలు ఆలోచించాలి. మార్పు తీసుకురావాలి. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత నాది. 20ఏళ్లుగా హిందూ, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు లేవు. మత సామరస్యం వల్లనే హైదరాబాద్ లో ఐటీ సంస్థలు వచ్చాయి.

పాతబస్తీ ప్రజలు కర్ఫ్యూలు మరిచిపోయారు. వినాయక చవితి, రంజాన్ కలిసి మెలిసి జరుపుకుంటున్నాం. ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ విద్వేషాలు సృష్టిస్తోంది. గొడవలు సృష్టించి హైదరాబాద్ పెట్టుబడులను గుజరాత్ కు తరలించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ 400 సీట్లు కావాలంటోంది. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ ను గెలిపించాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది. విద్వేష ప్రసంగాలు వినొద్దు.. ఈ ప్రాంతం మనది. కలిసిమెలిసి ఉండాలి. కర్ఫ్యూలు వస్తే జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అనేకసార్లు బాంబు పేలుళ్లు జరిగాయి- ప్రధాని మోదీ

ట్రెండింగ్ వార్తలు