Eluru Constituency: ఏలూరులో వైసీపీ టికెట్ ఆయనకేనా.. జనసేనకు ఏలూరు పట్టం కడుతుందా.. టీడీపీ పరిస్థితేంటి?

చివరి నిమిషంలో పొత్తులు ఖరారైతే.. ఈక్వేషన్స్ మారిపోయే చాన్స్ ఉంది. ఎవరు పోటీలో ఉన్నా.. ఏ పార్టీ అభ్యర్థి అయినా.. ఏలూరులో ఈసారి విజయం అంత సులువు కాదనే చర్చ సాగుతోంది.

Eluru Assembly Constituency Ground Report

Eluru Assembly Constituency: ఏలూరు అంటేనే అంత. అక్కడి రాజకీయం ఎప్పుడూ ఉత్కంఠ రేపుతూనే ఉంటుంది. ఎన్నికలొచ్చే దాకా.. అక్కడ పోటీ చేసే అభ్యర్థులెవరో.. ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలో దిగుతారో.. అంచనా వేయడం కష్టం. కానీ.. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని.. వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ నాయకులు అంత సీన్ లేదని కొట్టిపారేస్తున్నారు. జనసేన నేతలు కూడా ఏలూరుపైనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు.. బీజేపీ(BJP) కూడా రేసులో ఉన్నామంటోంది. మరి.. వైసీపీ టికెట్.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నాని(Alla Nani)కే దక్కుతుందా? టీడీపీ నుంచి ఎవరు బరిలో దిగబోతున్నారు? జనసేన(Janasena)కు ఏలూరు పట్టం కడుతుందా? బీజేపీని ఆదరించే పరిస్థితులున్నాయా? ఓవరాల్‌గా.. ఏలూరులో ఈసారి కనిపించబోయే సీనేంటి?

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్.. తర్వాత కాంగ్రెస్‌కు అడ్డాగా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత.. ఏలూరులో సీన్ మారింది. ఎగిరే జెండా పసుపు రంగులోకి మారిపోయింది. ప్రస్తుతం.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల నాని.. ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థులు ఐదు సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆళ్ల నాని.. స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. గత రెండు దశాబ్దాలుగా ఏలూరులో ఆళ్ల నాని, బడేటి బుజ్జి మధ్యే రాజకీయం నడుస్తోంది. ఇక.. ఏలూరు నియోజకవర్గం పరిధిలో మొత్తం 2 లక్షల 39 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో.. కాపు, తూర్పు కాపు, వైశ్య సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. ఎవరు.. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. ఎక్కువగా కాపు సామాజికవర్గం నేతలే.. ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు.

ఆళ్ల నాని (photo: facebook)

ప్రస్తుతం.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల నాని.. వచ్చే ఎన్నికల్లోనూ తన గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు. కానీ.. వైసీపీలో ఉన్న గ్రూపు తగాదాలతో.. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి మేయర్ నూర్జహాన్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబు.. టికెట్ రేసులో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకనుగుణంగా వాళ్లు పావులు కదుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. దాంతో.. ఏలూరులో ఆళ్ల నాని వర్సెస్ పెదబాబు అన్నట్లుగా వర్గ పోరు నడుస్తోంది. కార్పొరేషన్‌లో అవినీతి పెరిగిపోయిందని.. ఎమ్మెల్యే నాని వర్గానికి చెందిన నాయకులు విమర్శలు చేయడం.. మేయర్ నూర్జహాన్‌ (Eluru Mayor Noorjahan)ని ఇరకాటంలో పడేశాయనే చర్చ జరుగుతోంది. మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే.. ఎమ్మెల్యే నానిని ఏలూరు పార్లమెంట్ బరిలో దించే ఆలోచనలో అధిష్టానం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే.. ఆళ్ల నాని మాత్రం.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు.

బడేటి చంటి (photo: facebook)

అధికార పార్టీలో ఉన్న వర్గపోరును.. టీడీపీ క్యాష్ చేసుకుంటోంది. అవినీతి ఆరోపణల్ని జనంలోకి తీసుకెళుతోంది. అన్న మరణంతో పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్న బడేటి చంటి(Badeti Chanti).. విస్తృతంగా పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కూడా ఆళ్ల నాని.. ఏలూరులో అభివృద్ధి చేయలేకపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. టీడీపీ టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై క్లారిటీ లేదు. బడేటి చంటి టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మరో వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి (Badeti Bujji).. సతీమణికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. కానీ.. వాళ్ల కుటుంబంలో ఎవరూ యాక్టివ్ పాలిటిక్స్‌లో లేరు. కానీ.. జనసేనతో గనక పొత్తు కుదిరితే.. ఏలూరు బరిలో టీడీపీ ఉంటుందా? జనసేనకు అవకాశం ఇస్తుందా? అనేది సస్పెన్స్‌గా మారింది.

Also Read: అంతుచిక్కని భీమవరం పాలిటిక్స్.. ఈసారి కనిపించబోయే సీనేంటి.. రఘురామ కృష్ణంరాజు బరిలో ఉంటారా?

రెడ్డి అప్పలనాయుడు (photo: facebook)

ఏలూరు జిల్లాలో జనసేనకు ఎంతో కొంత పట్టున్న సెగ్మెంట్.. ఏలూరు మాత్రమే. టీడీపీతో పొత్తు కుదిరితే.. జనసేన అభ్యర్థే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే.. అక్కడ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న రెడ్డి అప్పలనాయుడి (Reddy Appala Naidu)కి.. పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశం ఇస్తారా? లేదా? అన్న దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అల్లుడు పవన్ కల్యాణ్‌కు బంధువు కావడంతో.. ఆయన్నే పోటీలో ఉంచుతారనే టాక్ వినిపిస్తోంది. ఎవరిని బరిలో దించినా.. ఏలూరులో జనసేన జెండా ఎగరేస్తామని స్థానిక నాయకులు చెబుతున్నారు.

Also Read: గన్నవరంలో వంశీ బలమెంత.. పట్టాభి దూకుడు టీడీపీకి మైనస్‌గా మారనుందా?

ఇక.. బీజేపీ నేతలు కూడా తాము కూడా పోటీలో ఉంటామంటున్నారు. నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం.. జనసేనతో పొత్తు కొనసాగుతుండటంతో.. ఏలూరు నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. నియోజకవర్గంలో.. ఎవరు ఏ పార్టీ తరఫున పోటీ చేసినా.. అభ్యర్థి మాత్రం కాపు సామాజికవర్గానికి చెందిన వారుంటే గెలుపు సులువు అవుతుందనే వాదన ఉంది. పార్టీలు కూడా కాపు నేతలనే.. అభ్యర్థులుగా పోటీకి దించుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నాని వైపే వైసీపీ అధిష్టానం మొగ్గు చూపుతుందని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక.. చంద్రబాబు కూడా బడేటి చంటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో పొత్తులు ఖరారైతే.. ఈక్వేషన్స్ మారిపోయే చాన్స్ ఉంది. ఎవరు పోటీలో ఉన్నా.. ఏ పార్టీ అభ్యర్థి అయినా.. ఏలూరులో ఈసారి విజయం అంత సులువు కాదనే చర్చ సాగుతోంది. దాంతో.. ఈసారి అక్కడ ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు