Kakinada Kendriya Vidyalaya Incident : కాకినాడ కేంద్రీయ విద్యాలయ ఘటన.. ఆ స్ప్రే వల్లే ఇలా జరిగిందా?

కాకినాడ కేంద్రీయ విద్యాలయ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రధానంగా మూడు విషయాలపై తాము దృష్టి సారించినట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీర తెలిపారు.

Kakinada Kendriya Vidyalaya Incident : కాకినాడ కేంద్రీయ విద్యాలయ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రధానంగా మూడు విషయాలపై తాము దృష్టి సారించినట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీర తెలిపారు. తాగునీరు, చాక్లెట్స్ తో పాటు నిన్న క్లాస్ రూమ్ లో ఫోమ్ స్ప్రేలపైనా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికీ విద్యార్థుల క్లాస్ రూమ్ లో స్ప్రేకు సంబంధించిన కెమికల్స్ వాసనలు వస్తున్నాయన్నారు. విద్యార్థుల అస్వస్థతకు స్ప్రే కూడా కారణం కావొచ్చన్నారు. వాటర్, చాక్లెట్స్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపామని, రిపోర్ట్స్ రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.

మంగళవారం ఉదయం స్కూల్ కి వచ్చిన కాసేసేపటి తర్వాత 5, 6వ తరగతి విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రమేష్ బాబు ప్రకటించారు. కేంద్రీయ విద్యాలయంలో విద్యార్ధులకు నీటిని సరఫరా చేస్తున్న ఆర్వో ప్లాంట్ నుంచి వైద్య ఆరోగ్యశాఖాధికారులు శాంపిల్స్ సేకరించారు.

అంతేకాదు ఇవాళ స్కూల్ లోని ఓ విద్యార్ధి పుట్టిన రోజు. దీంతో అతడు సహచర విద్యార్ధులకు చాక్లెట్లు పంచాడు. ఈ చాక్లెట్ల శాంపిల్స్ ను కూడా అధికారులు తీసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్ధుల రక్తం, మూత్రం నమూనాలను కూడా వైద్యాధికారులు సేకరించారు. వీటన్నింటిని పరీక్షించిన తర్వాత విద్యార్ధులు అస్వస్థతకు గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని జిల్లా వైద్యశాఖాధికారి తెలిపారు.

ఫస్ట్ పీరియడ్ అయిన తర్వాత విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరగడం, ఊపిరి ఆడకపోవడం వంటి కారణాలను విద్యార్ధులు చెప్పారు. అయితే ఎలాంటి విషవాయువుల ఆనవాళ్లు లేవని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రెండు తరగతులకు చెందిన విద్యార్ధులే అస్వస్థతకు గురికావడం వెనుక కారణాలను అన్వేషించాలని విద్యార్ధుల పేరేంట్స్ కోరుతున్నారు. విద్యార్ధులు అస్వస్థతకు గురైన విషయమై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో మాట్లాడారు. విద్యార్ధులు అస్వస్థతకు గురి కావడానికి కారణం ఏంటి? అనేది ప్రస్తుతానికి పెద్ద మిస్టరీగా మారింది.

 

ట్రెండింగ్ వార్తలు