High Rise: భాగ్యనగరంలో ఆకాశహర్మ్యాలు.. 59 అంతస్తుల వరకు భారీ స్కైస్క్రాపర్స్

హైదరాబాద్లో ఎక్కువగా వెస్ట్ ప్రాంతంలోనే ఆకాశహర్మ్యాలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. కనీసం 25 ఫ్లోర్స్ నుంచి మొదలు 45 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు.

high rise apartments surgre in hyderabad

high rise apartments: హైదరాబాద్ (Hyderabad) నగర రూపురేఖలు మారిపోతున్నాయి. సిటీలో వెలుస్తున్న నిర్మాణాలను చూస్తుంటే ఏ సింగపూర్లోనో న్యూయార్క్లోనో ఉన్న అనుభూతి కలుగుతోంది. భాగ్యనగరం నలువైపులా ఆకాశాన్ని తాకేలా భారీ నివాస, వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు. దేశంలో ముంబై తరువాత అత్యధికంగా హైరైజ్ భనవాలు ఉన్నది హైదరాబాద్లోనే. ఇంతకీ భాగ్యనగరంలో అత్యంత ఎత్తైన భవనాల నిర్మాణాలు ఏయే ప్రాంతాల్లో జరుగుతున్నాయో తెలుసా?

ఆకాశం అంచులకు భాగ్యనగరం
హైదరాబాద్ నిర్మాణ రంగంలో తనదైన మార్కును చూపుతోంది. మరీ ముఖ్యంగా గత ఐదారేళ్లుగా నగర నిర్మాణ రంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నిర్మాణ పరంగా సిటీ రూపురేఖలు మార్చే పలు భారీ ప్రాజెక్ట్‌లు నగరం నలువైపులా వస్తున్నాయి. గతంలో కనీసం పది ఫ్లోర్స్ భవనాలు కూడా లేని ప్రాంతాల్లో ఇప్పుడు 25 అంతకు మించి అంతస్తుల నిర్మాణాలు వస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కనీసం 25 నుంచి 40 అంతస్తుల నివాస, వాణిజ్య భవనాలే నిర్మాణం అవుతున్నాయి. నగరంలో గరిష్టంగా 59 అంతస్తుల వరకు భారీ స్కైస్క్రాపర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు అనుమతులు పొంది పనులు ప్రారంభించగా, మరికొన్ని నిర్మాణ సంస్థలు అనుమతులు పొందే దశలో ఉన్నాయి.

రెండో స్థానంలో హైదరాబాద్
దేశంలో ముంబై తర్వాత మన హైదరాబాద్లోనే అత్యధికంగా స్కైస్క్రాపర్స్ ఉన్నాయని సీబీఆర్ఈ నివేదిక చేబుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తయిన భవనాలు అత్యధికంగా ఉన్న నగరాల జాబితాలో హాంకాంగ్‌ మొదటి స్థానంలో నిలవగా, షెన్‌ఝెన్‌, న్యూయార్క్‌, దుబాయ్‌ ఇలా అనేక నగరాలు జాబితాలో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే మన దేశానికి సంబంధించి మొదటి స్థానంలో ముంబై నిలవగా, ఆ తరువాత రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఉన్న ఎత్తయిన భవనాల్లో సుమారు 77 శాతం ఎత్తయిన భవనాలు ముంబైలో ఉండగా, తర్వాతి స్థానంలో 8 శాతం భవనాలు హైదరాబాద్లో ఉన్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. ముంబై, హైదరాబాద్ తరువాత ఎత్తైన భవనాలు 7 శాతం కోల్కత్తా, 5 శాతం నోయిడాలో ఉండగా, ఒక్క శాతం చొప్పున గుర్గావ్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో సౌత్ ఇండియాలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉండగా బెంగళూరు, చెన్నై వంటి నగరాలు దరిదాపుల్లో కూడా లేవు.

నగరం నలువైపులా ఆకాశహర్మ్యాలు
హైదరాబాద్లో ఎక్కువగా వెస్ట్ ప్రాంతంలోనే ఆకాశహర్మ్యాలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. కనీసం 25 ఫ్లోర్స్ నుంచి మొదలు 45 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్లోని కోకాపేట, శేరిలింగంపల్లి, ఖాజాగూడ, పుప్పాలగూడ, మియాపూర్, నార్సింగి వంటి ప్రాంతాల్లో 30కి పైగానే ఈ తరహా భారీ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్, ఎల్బీనగర్, బాచుపల్లి, పటాన్చెరు వంటి ప్రాంతాల్లోను భారీ నివాస భవనాలు వెలుస్తున్నాయి. హైదరాబాద్‌ దక్షిణ ప్రాంతంగా చెప్పే అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ వైపు ఆకాశహర్మ్యాల నిర్మాణాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నగరంలో అతి ఎత్తయిన భవనం 59 అంతస్తులతో కోకాపేటలో నిర్మాణ దశలో ఉంది. సిటీలో 48 ఫ్లోర్స్ నుంచి 59 ఫ్లోర్స్ వరకు మొత్తం పది ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు.

Also Read: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఇంటి అద్దెలు.. హైదరాబాద్‌లో ఎంత పెరిగాయంటే?

ఇక ఇప్పటికే నగరంలో 45 అంతస్తుల వరకు మూడు, 42 అంతస్తుల ఎత్తున మరో మూడు స్కై స్క్రాపర్స్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. 25 అంతస్తులు మొదలు 36 అంతస్తులు వరకు ఎత్తులో సుమారు 57 భవనాల ఇప్పటికే నగరంలో నిర్మాణమై అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణ దశలో ఇలాంటి భవనాలు మరో 50కి పైగానే ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇక హైదరాబాద్లో 40 నుంచి 55 అంతస్తుల కోసం దాదాపు 30కి పైగా నిర్మాణ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. టీఎస్‌ బీపాస్లో ఇప్పటి వరకు 80 ఆకాశహర్మ్యాలు అనుమతులు పొందాయి. వీటిలో 60 అపార్ట్మెంట్లు, 22 వరకు వాణిజ్య భవనాలు ఉన్నాయి. ఇలా అనుమతి పొందిన గృహ నిర్మాణాల్లో 14 ప్రాజెక్ట్‌లు 30 నుంచి 45 అంతస్తులపైన నిర్మించబోతున్నవేనని లెక్కలు చెబుతున్నాయి.

Also Read: రియల్ ఫ్యూచర్.. 2030 నాటికి ఊహకందని రేంజ్ కి రియల్ ఎస్టేట్ మార్కెట్!

హైదరాబాద్లో నిర్మాణం అవుతున్న భారీ భవనాలు ఆయా ప్రాంతాలకు ల్యాండ్‌మార్క్‌గా నిలవనున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న ఇటువంటి భారీ ప్రాజెక్టుల్లో ఇంటి కొనుగోలుతో సమాజంలో తమ స్టేటస్ పెరుగుతుందని, అలాంటి భవనాల్లో నివాసం ఉంటే అందరిలోను ప్రత్యేకతను చాటుకోవచ్చని కొనుగోలుదారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే చాలా మంది బిల్డర్లు ఆకాశహర్మ్యాల నిర్మాణం వైపు మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా పెరిగిన భూముల ధరలు, స్థల యజమానులతో డెవలప్‌మెంట్‌ ఒప్పందాల కారణంగా కూడా ఎక్కువ అంతస్తులు నిర్మిస్తే తప్ప ఆర్థికంగా ప్రాజెక్ట్‌ లాభసాటి కాదని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు