Home insurance: బీమాతో భరోసా.. ఇంటికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలి..?

హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌తో పాటు ఇంటికి ప్రతి ఒక్కరు బీమా చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. గృహ రుణ బీమాతో పాటు ఇంటికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలి? ఎన్ని రకాలు ఉన్నాయి?

Home insurance

house insurance: సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. అయితే కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో సొంతిల్లు కొనుక్కోవడమే కాదు.. ఆ ఇంటికి బీమాతో రక్షణ పొందాలని సూచిస్తున్నారు నిపుణులు. హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌ తీసుకోవడమే కాదు.. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వంటి వాటి నుంచి రక్షణ పొందాలంటే ఖచ్చితంగా మన కలల ఇంటికి బీమా చేయించాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో గృహ రుణ బీమాతో పాటు ఇంటికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలి? ఎన్ని రకాలు ఉన్నాయి?

హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌తో పాటు ఇంటికి బీమా
పైసా పైసా కూడబెట్టి, దానికి తోడు బ్యాంకు రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తారు చాలా మంది. మరి అలాంటి ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం. అయితే ఇంటిని కొనగానే సరిపోదు.. ఆ ఇంటికి పూర్తి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు రియల్ రంగ నిపుణులు. మన కలల ఇంటికి బీమాతో సెక్యూరిటి కల్పించవచ్చని చెబుతున్నారు. ఇంటి కోసం రుణాన్ని తీసుకున్న ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనాలు వంటిని సంభవించినప్పుడు ఆర్థికంగా ఇంటికి బీమా ఎంతో సహాయపడుతుంది. అందుకే హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌తో పాటు ఇంటికి ప్రతి ఒక్కరు బీమా చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ రకాల ప్రమాదాల నుంచి మన ఇంటిని రక్షించుకునేందుకు మార్కెట్‌లో అనేక రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మన అవసరం, పరిస్థితులను బట్టి మన ఇంటికి ఏది సరిపోతుందనుకుంటే దాన్ని ఎంచుకోవాలి.

బీమా భారం కాదు
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పాలసీల్లో హోమ్ లోన్ బీమా ముఖ్యమైంది. ఇంటి కొనుగోలు కోసం సాధ్యమైనంత వరకు అంతా బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు. అందుకే ఇంటి రుణానికి సంబంధించిన బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలసీ వల్ల గృహ రుణం తీసుకున్న ఇంటి యజమాని చనిపోయినా, ప్రమాదంలో అంగవైకల్యం కలిగినా సదరు బీమా ద్వారా మిగిలిన లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ చెల్లిస్తుంది. ఇప్పుడున్న హౌస్‌ లోన్ పాలసీల ప్రీమియం మొత్తం లోన్‌లో సుమారు ఒక శాతంగా ఉంది. దీని వల్ల ఇంటి రుణానికి బీమా చేయించడం పెద్ద భారం ఏమీకాదని నిపుణులంటున్నారు.

Also Read: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఇంటి అద్దెలు.. హైదరాబాద్‌లో ఎంత పెరిగాయంటే?

ఇంటితో పాటు గృహోపకరణాలకు బీమా
అలాగే సమగ్ర ఇంటి పాలసీ కూడా ఎంతో ముఖ్యమైంది. ఇంటికి ఈ బీమా తీసుకుంటే ఇల్లు, అందులో సామగ్రి, ఇంట్లో నివసించేవారికి రక్షణ లభిస్తుంది. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదం, దొంగతనం వంటివి జరిగినప్పుడు ఈ పాలసీ పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఇంటి విలువ, ప్రాంతం, బీమా మొత్తం వంటి అంశాల ఆధారంగా ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది. అయితే కావాలని చేసే నష్టానికి మాత్రం బీమా వర్తించదు. ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన వస్తువుల్లో ఏమైనా తయారీ లోపం ఉండి నష్టం జరిగినా బీమా రాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇన్సూరెన్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మరో పాలసీ హోమ్‌ కంటెంట్‌ ఇన్సూరెన్స్‌. ఇంట్లో ఉన్న సామగ్రి, ఉపకరణాలు, పరికరాలు పోయినా లేక దెబ్బతిన్నా ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. ఆభరణాలతో పాటు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి ఉపకరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా వాటి మార్కెట్‌ ధరను బట్టి బీమా వర్తిస్తుంది.

Also Read: అపార్ట్‌మెంట్‌లో ఏ ఫ్లోర్‌లో ఫ్లాట్ కొనాలి.. మిడిల్ అయితే బెటరా?

నియమ నిబంధనలు పరిశీలించాలి
ఇంటి నిర్మాణం దెబ్బతిన్న సందర్భాల్లో బీమా కావాలనుకుంటే స్ట్రక్చరల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవచ్చు. దొంగతనాలు, ఉగ్రదాడులు వంటి ప్రమాదాల సమయంలో ఇంటి నిర్మాణానికి ముప్పు వాటిల్లితే ఈ పాలసీ ద్వారా బీమా పొందవచ్చు. పైకప్పు, ఇంటి నేల, కిచెన్‌.. ఇలా ఎక్కడ నిర్మాణం దెబ్బతిన్నా పరిహారం మొత్తం బీమా రూపంలో ఇస్తారు. వాతావరణ మార్పులు, విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ లు సహా ఇతర అవాంఛనీయ సంఘటనల కారణంగా ఈ మధ్య అగ్నిప్రమాదాలు పెరిగిపోయాయి. అలాంటి ప్రమాదాల నుంచి రక్షించుకునేందుకు ప్రత్యేకంగా అగ్నిప్రమాద బీమా పాలసీ అందుబాటులో ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా దొంగతనాల నుంచి రక్షణ కల్పించే బీమా పాలసీలూ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో నుంచి దొంగతనానికి గురైన వస్తువులకు వాటి మార్కెట్‌ విలువ ప్రకారం బీమా అందజేస్తారు. అయితే ఇంటి కోసం ఏ పాలసీ తీసుకున్నా ముందుగా వాటి నియమ నిబంధనలు, ఫీచర్లు, ప్రీమియం వంటి వివరాలను పూర్తిగా పరిశీలించాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు