Typhus Vaccine : పేన్లతో ఏ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసారో తెలుసా??

అత్యంత పురాతన వైరస్ టైఫస్ కు వ్యాక్సిన్ కనిపెట్టిన ద గ్రేట్ సైంటిస్ట్ పోలాండ్‌కు చెందిన ‘రుడాల్ఫ్‌ వెయిగ్ల్‌’138వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ డూడుల్ ద్వారా నివాళి అర్పించింది.

Google Doodle Typhus vaccine Creator Rudolf Weigl : ఈ మానవజాతి ఆవిర్భవించాక ఎన్నో రకాల వ్యాధులు..మరెన్నో రకాల వైరస్ లు మానవజాతిని హడలెత్తించాయి. కానీ మనిషి ఎన్నో రకాల భయంకరమైన వైరస్ లపై పైచేయి సాధిస్తునే ఉన్నాడు. తన విజ్ఞానంతో వ్యాక్సిన్లు కనిపెట్టి ఎన్నో వైరస్ లను నియంత్రించాడు.మరెన్నో వైరస్ లను ఖతం చేయగలిగాడు. ఇప్పుడు మనం కొత్తగా కరోనా వైరస్ తో పోరాడుతున్నాం. దానికి కూడా వ్యాక్సిన్ కనిపెట్టారు.

వ్యాక్సిన్‌లు అనేవి రకరకాల జబ్బుల నుంచి మనిషికి రక్షణ అందించే కవచాలు. కరోనా తర్వాత మనుషుల్లో వైరస్ లు..వ్యాక్సిన్ల పట్ల అవగామన పెరుగుతోందని చెప్పవచ్చు.గతంలో ఎలాంటి ఎలాంటి వ్యాక్సిన్‌లు ఉండేవి, వాటిని ఎలా తయారు చేస్తున్నారు? వాటికి ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్ వస్తాయి? వాక్సిన్‌లతో రక్షణ పొందగలం? వంటి వివరాలు తెలుసుకుంటున్నారు. కానీ ఏ వైరస్ కు ఏ వ్యాక్సిన వేస్తారనే విషయం తెలుస్తోంది గానీ ఏ వైరస్‌ అయితే ఇబ్బంది పెడుతోందో..అదే వైరస్ బ్యాక్టీరియాల నుంచే వ్యాక్సిన్లను అభివృద్ధి చెందిస్తారనే విషయం తెలియకపోవచ్చు. నిజమే వైరస్ బ్యాక్టీరియా నుంచే వ్యాక్సిన్ల అభివృద్ది అనేది ఉంటుంది. దానికి ఆద్యుడు..ఓ పోలాండ్‌ సైంటిస్ట్‌. ఆయన చేసిన ప్రయోగాలే మూలమని చాలామందికి తెలియదు. అతనే ద గ్రేట్ సైంటిస్ట్ పోలాండ్‌కు చెందిన ‘రుడాల్ఫ్‌ వెయిగ్ల్‌’. ఆయన పూర్తి పేరు ‘రుడాల్ఫ్ స్టీఫన్ జాన్ వీగ్ల్’. సెప్టెంబర్ 2 అంటే ఈరోజు ఆయన పుట్టిన రోజు. అంత గొప్ప శాస్త్రవేత్తకు గూగుల్‌లో డూడుల్‌ ద్వారా నివాళి అర్పిస్తోంది.

పోలాండ్‌కు చెందిన రుడాల్ఫ్‌ వెయిగ్ల్‌.. అత్యంత పురాతనమైన, ప్రమాదకరమైన టైఫస్‌ అంటువ్యాధికి సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను తయారు చేసిన మొదటి సైంటిస్ట్‌. ఈయన తయారు చేసిన వ్యాక్సిన్‌ను దేంతో చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కాస్త వాంతి కూడా వస్తుంది.కానీ అదే వ్యాక్సిన్ ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. రుడాల్ఫ్ టైఫస్ అంటువ్యాధికి (పేన్లను దంచి.. ఆ పేస్ట్‌తో వ్యాక్సిన్ తయారు చేశారు. వినటానికి వాంతి వచ్చేలా ఉన్నా ఇది నిజం. పచ్చి నిజం. ఆయన చేసిన ఈ వినూత్న ప్రయోగమే ఆ తర్వాతి కాలంలో చాలా వ్యాక్సిన్‌ల తయారీకి ఒక మార్గదర్శకంగా మారిందంటే అతిశయోక్తికాదు.

రుడాల్ఫ్ వెయిగ్ల్ అత్యంత భయంకరమైన అంటువ్యాధి అయిన టైఫస్ కు వ్యాక్సిన్ తయారు చేయటమే కాదు..యూదులకు ఆశ్రయం కల్పించడం..నాజీల ద్వారా మరణశిక్ష నుండి వారిని రక్షించడంలో అతను చురుకైన పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి.రుడాల్ఫ్‌ స్టెఫాన్‌ జన్‌ వెయిగ్ల్‌ 1883, సెప్టెంబర్‌ 2న ఆస్స్ర్టో హంగేరియన్‌ టౌన్‌ ప్రెరవు(మోరావియా రీజియన్‌)లో ఆస్ట్రియన్-జర్మన్ దంపతులకు జన్మించాడు. తండ్రి టీచర్‌.. తల్లి ఎలిసబెత్ క్రోసెల్ గృహిణి. పుట్టింది జర్మనీలోనే అయినప్పటికీ పోలాండ్‌లో స్థిరపడింది ఆ కుటుంబం. తండ్రి ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

రుడాల్ఫ్ పోలాండ్‌ ఎల్‌వీవ్‌లోని యూనివర్సిటీలో బయోలాజికల్‌ సైన్స్‌ చదివాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అస్ట్రో-హంగేరియన్‌ ఆర్మీ కోసం 1914 నుంచి పారాసిటాలజిస్ట్‌గా పని చేశాడు.పోలాండ్‌ను జర్మనీ ఆక్రమించుకున్నాక లెంబర్గ్‌ ఇనిస్టిట్యూట్‌లో రీసెర్చర్‌గా కొంతకాలం పని చేశాడు రుడాల్ఫ్. ఆ సమయంలో తూర్పు యూరప్‌లో లక్షల మంది టైఫస్‌ బారిన పడ్డారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రుడాల్ఫ్ ఎలాగైనా ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టాలనుకున్నాడు. అలా ఎల్‌వీవ్‌లో తన పేరు మీద ఒక ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేసి అక్కడే టైఫస్‌ మీద, వైరల్‌ ఫీవర్‌ మీద పలు పరిశోధనలు ప్రారంభమయ్యాయి.

ప్రారంభంలో ఫలితాలు మంచిగా రాకపోవచ్చు. కానీ ప్రయత్నిస్తే అసాధ్యం మాత్రం కాదు. అదే నమ్మిన రుడాల్ఫ్ జబ్బును తగ్గించే ఫలితం సరిగా రాకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడలేదు. కానీ ముందుగా తయారు చేసిన వ్యాక్సిన మాత్రం వ్యాధి లక్షణాల్ని తగ్గించి ఉపశమనం కలిగించింది. దీంతో ఆయన మరింత ఉత్సాహంతో పరిశోధనల్ని కొనసాగించారు. ఆ తర్వాత రాకీ మౌంటెన్‌ స్పాటెడ్‌ ఫీవర్‌కు సైతం వ్యాక్సిన్‌ తయారు చేశారు రుడాల్ఫ్.ఈక్రమంలో 1909లో ఛార్లెస్‌ నికోలె.. లైస్ (Lice)‌(పేను)వల్ల టైఫస్‌ అంటువ్యాధి వ్యాప్తి చెందుతోందని గుర్తించాడు. దానికి రికెట్ట్‌సియాప్రోవాజెకి బ్యాక్టీరియా కారణమని గుర్తించాడు. ఆ తర్వాత టైఫస్‌ వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

పేనులతో వ్యాక్సిన్ కు శ్రీకారం..
టైఫస్‌ వ్యాక్సిన్‌ కోసం అప్పటిదాకా ఎవరూ చేయని వినూత్న ప్రయోగానికి నాంది పలికాడు రుడాల్ఫ్ వెయిగ్ల్‌.టైఫస్ వ్యాధికి కారణమైన పేను కడుపులోనే దానికి నివారణ కూడా ఉందని గుర్తించాడు తన పరిశోధనల్లో. రికెట్ట్‌సియా ప్రోవాజెకిని ప్రవేశపెట్టి వాటిని పెంచి.. ఆ పేన్లను దంచి వ్యాక్సిన్‌ పేస్ట్‌ తయారు చేశాడు. దీని కోసం ఆరోగ్యవంతమైన పేన్లను 12 రోజులపాటు పెంచాడు. ఆ పేనులకు టైఫస్‌ బ్యాక్టీరియాను ఇంజెక్ట్‌ చేశాడు. ఆతరువాత వాటిని మరో 5 రోజులపాటు పెంచాడు. ఆ తరువాత ఆ పేనులను మెత్తగా దంచి ఆ పేస్ట్‌ను వ్యాక్సిన్‌గా ఉపయోగించాడు.

పేలు పరాన్న జీవులు అనే విషయం తెలిసిందే. పేన్లు పెరగాలంటే రక్తం కావాలి. వాటిని పెంచడానికి మనుషుల రక్తం కావాలి. కానీ వాటిని తలలో వేసుకుని పెంచి ఇవ్వటానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరుగా..అందుకే రుడాల్ఫ్ ఒక ప్రత్యేక పద్దతిద్వారా పేనులను పెంచాడు. ఓ ప్రత్యేకమైన తెర ద్వారా వాటిని మనుషుల రక్తం పీల్చుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వందల మంది జబ్బు పడగా.. వాళ్లను చికిత్స ద్వారా మామూలు తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చాడు. అలా వ్యాక్సిన్ ను ఎట్టకేలకు తయారు చేసిన వ్యాక్సిన్ ను 1918లో గినియా పందుల మీద ఉపయోగించారు. అవి మంచి ఫలితాలు వచ్చాక మనుషుల మీద ట్రయల్స్ చేయగా మంచి ఫలితాలు వచ్చాయి.

1930లో వ్యాక్సిన్‌ అధికారికంగా మార్కెట్‌లోకి రిలీజ్‌ అయ్యింది. ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. రుడాల్ఫ్ చేసిన వినూత్న యత్నంతో ఎంతోమంది ప్రాణాలు నిలిచాయి. కానీ దేశ విద్రోహ కార్యాకలాపాలకు నెలవైందన్న ఆరోపణలతో 1944లో సోవియట్‌యూనియన్‌ ఆయన ఇనిస్టిట్యూట్‌ను మూసేసింది. అంతేమరి మంచి పనులు చేసే చర్యలకు ఆటంకాలు తగులుతునే ఉంటుంది అలాగే రుడాల్ఫ్ ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్‌ను సోవియట్ రష్యా మూసి వేసింది.

ఆ తరువాత రుడాల్ఫ్ 1957 ఆగష్టు 11న 73 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఆయన మరణానంతరం నోబెల్‌ బహుమతికి వెయిగ్ల్‌ పేరు నామినేట​అయ్యింది. కానీ..అవార్డు మాత్రం దక్కలేదు. రుడాల్ఫ్ ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులతో పనిచేశాడనే ఆరోపణలు ఆయనకు అవార్డు దక్కకుండాపోయింది. కానీ అవార్డుల కోసం ఏ సైంటిస్టు పనిచేయడనే విషయం రుడాల్ఫ్ విషయంలో నిరూపించబడింది. ఆయన ఏదీ ఆశించి పనిచేయలేదు. టైఫస్ వ్యాధి నివారణ కోసం ఆయన పడిన కష్టం మాత్రం ఫలించింది. ఆయన పరిశోధనలు భవిష్యత్తుల్లో ఎన్నో రకాల వ్యాక్సిన్లు తయారీకి మూలంగా నిలిచింది.

కానీ ఓ మంచి కోసం పడిన కష్టం ఎప్పటికీ పోదనే రుడాల్ఫ్ విషయంలో మరోసారి నిరూపించబడింది. 2003లో ప్రపంచం రుడాల్ఫ్ పరిశోధనల్ని ‘రైటస్‌ ఎమాంగ్‌ ది నేషన్స్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ గౌరవంతో స్మరించుకుంది. కాగా ఆయన మరణించి ఇన్ని సంవ్సరాలు గడిచినా రుడాల్ఫ్‌ వెయిగ్ల్‌ 138వ పుట్టినరోజు సందర్భంగా.. గూగుల్‌ డూడుల్‌ ద్వారా ఆయన్ని గుర్తు చేస్తోంది గూగుల్‌.

రెండో ప్రపంచ యుద్ద సమయంలో పోలాండ్‌ను జర్మనీ ఆక్రమించుకున్నాక.. వెయిగ్ల్‌ను బలవంతంగా వ్యాక్సిన్‌ తయారీ ప్లాంట్‌లో ఉపయోగించుకుంది పోలాండ్. దీంతో వెయిగ్ల్ కూడా చక్కటి తెలివితేటల్ని ఉపయోగించి పనివాళ్లను తన ప్రయోగాలకు ఉపయోగించుకున్నాడు. వారి అనుమతితోనే. అంతేకాదు తనకు తాను లైస్‌ (పేలు) ద్వారా టైఫస్‌ను అంటిచుకుని తన ప్రాణాన్ని పణ్ణంగా పెట్టి మరీ పరిశోధనలు చేశాడు. ఫలితాలు సాధించాడు. తన పరిశోధనలు, ప్రయోగాలతో వ్యాక్సిన్‌ను రూపొందించి.. వేల మంది ప్రాణాలు కాపాడాడిన వెయిగ్ల్‌ను ఒక సైంటిస్ట్‌గా మాత్రమే కాదు..రియల్ హీరో అని అనటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదనే చెప్పాలి.

ట్రెండింగ్ వార్తలు