ప్రమాదమా? కుట్రపూరిత హత్యా? ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణంపై అనేక అనుమానాలు

మరణ శిక్షలు ఎక్కువగా అమలు చేయటంతో రైసీని డెవిల్ అని విమర్శకులు పిలిచేవారు. అయితే అంతర్జాతీయ ఆంక్షల నడుమ ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరకుండా చక్కదిద్దడం ఆయనకు ప్రజాదరణను పెంచింది.

Iran President Ebrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహిం రైసీని దుర్మరణం చెందారు. ఇరాన్ విదేశాంగ మంత్రితో పాటు మరికొందరితో కలిసి రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఆయన హెలికాప్టర్ తో పాటు బయలుదేరిన మరో రెండు హెలికాప్టర్లు మాత్రం సురక్షితంగా గమ్య స్థానానికి చేరుకున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన 60 ఇరాన్ రెస్క్యూ బృందాలు.. 12 గంటల తర్వాత అధ్యక్షుడి హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించాయి. ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించినా.. ఇరాన్ వార్తా సంస్థ ఐఆర్ఎన్ ఏ తర్వాత అధ్యక్షుడి మరణాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఇరాన్‌లో రైసీకి తిరుగులేని ప్రజాదరణ.. అదే సమయంలో డెవిల్ అని పేరు..
అధ్యక్షుడితో సహా హెలికాప్టర్ లో ఉన్న మొత్తం 9మంది మరణించినట్లు తెలిపింది. ఇరాన్ లో రైసీకి తిరుగులేని ప్రజాదరణ ఉంది. అదే సమయంలో దేశాన్ని మతచాందసవాదంవైపు నడిపించారన్న విమర్శలూ ఉన్నాయి. మరణ శిక్షలు ఎక్కువగా అమలు చేయటంతో రైసీని డెవిల్ అని విమర్శకులు పిలిచేవారు. అయితే అంతర్జాతీయ ఆంక్షల నడుమ ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరకుండా చక్కదిద్దడం ఆయనకు ప్రజాదరణను పెంచింది.

ప్రమాదమా? కుట్రపూరిత హత్యా?
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం అనుకోని ప్రమాదమా? లేక కుట్రపూరిత హత్యా? రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించకుండా పోయిందన్న విషయం తెలిసినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కలుగుతున్న సందేహాలివి. రైసీ మరణించారని తెలిసిన తర్వాత ఈ అనుమానాలు మరింతగా పెరిగాయి. తమ మాట వినని, తమ ప్రయోజనాలకు భంగం కలిగించే వారిని, తమ పెత్తనాన్ని సహించని వారిని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ సీఐఏ ముందస్తు ప్రణాళికతో అంతమొందిస్తుందని దశాబ్దాలుగా ఆరోపణలు ఉన్నాయి. 1960ల నుంచి అమెరికాపై ఈ ఆరోపణలు ఉన్నాయి.

రైసీని అంతమొందించే ఆపరేషన్ ను అమెరికా విజయవంతంగా అమలు చేసిందా?
ఇప్పుడు ఇజ్రాయల్ తో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ కు ఈ సంక్షోభం ఏర్పడటం, ఇరాన్ పైకి అమెరికా మిస్సైళ్లు ప్రయోగించటం వంటివి జరిగాయి. ఇజ్రాయల్, ఇరాన్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది. ఇజ్రాయల్ తో పోరాటం చేస్తున్న హమాస్ కు ఇరాన్ అండదండలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఈ తరుణంలో మిత్ర దేశం ఇజ్రాయల్ తో కలిసి రైసీని అంతమొందించే ఆపరేషన్ ను అమెరికా విజయవంతంగా అమలు చేసిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : బెల్ 212 హెలికాప్టర్.. ఇందులో భద్రత కరువేనా? ఇప్పటివరకు ఎన్ని ప్రమాదాలు జరిగాయి?

 

ట్రెండింగ్ వార్తలు