PM Modi In US Congress:ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు భారత్ నిలయం..యూఎస్ కాంగ్రెస్ సమావేశంలో మోదీ వ్యాఖ్యలు

అమెరికా పర్యటనలో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం రాత్రి యూఎస్ కాంగ్రెస్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించారు.ఈ చారిత్రాత్మక ప్రసంగంలో మోదీ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్థావించారు....

PM Modi In US Congress: అమెరికా పర్యటనలో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం రాత్రి యూఎస్ కాంగ్రెస్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించారు.(India Is Home To All Faiths In world) ఈ చారిత్రాత్మక ప్రసంగంలో మోదీ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్థావించారు. ‘‘మా దేశంలో 2500 రాజకీయ పార్టీలు ఉన్నాయి.. దాదాపు 20 వేర్వేరు పార్టీలు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను పరిపాలిస్తున్నాయి. మాకు 22 అధికారిక భాషలు, వేలాది మాండలికాలు ఉన్నాయి, అయినప్పటికీ మేం ఒకే స్వరంలో మాట్లాడుతాం. ప్రతి 100 మైళ్లకు మా వంటకాలు దోస నుంచి ఆలూ పరాటా వరకు మారుతున్నాయి’’ అని మోదీ భారతీయ వైవిధ్యం గురించి చెప్పారు.

రెండు సార్లు ప్రసంగించడం గొప్ప గౌరవం

అమెరికా ప్రతినిధుల సభకు చేరుకున్న మోదీ కొద్దిసేపటికే అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు.అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించడం ఎల్లప్పుడూ గొప్ప గౌరవమని ప్రధాని మోదీ అన్నారు.‘‘రెండుసార్లు అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగించడం నాకు కలిగిన అసాధారణమైన అదృష్టం. ఈ గౌరవం కోసం భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు నేను నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2016వ సంవత్సరంలో మీలో దాదాపు సగం మంది ఇక్కడే ఉండటం నేను చూస్తున్నాను. పాత స్నేహితుల ఉత్సాహాన్ని కూడా నేను చూడగలను. మిగిలిన సగంలో కొత్త స్నేహితులు’’అని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు.

భారత్, అమెరికాల మధ్య దృఢమైన బంధం

గత కొన్ని సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పురోగతి ఉందని, అదే సమయంలో అమెరికా, భారతదేశంలో మరింత అభివృద్ధి ఉందని మోదీ చెప్పారు.‘‘రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య బంధాన్ని పెంచుకోవడానికి మీరు కలిసి రావడం చూసి నేను సంతోషిస్తున్నాను’’ అని ప్రధాని అన్నారు.

కమలా హారిస్ చరిత్ర సృష్టించారు…

యూఎస్ రాజకీయాల్లో భారతీయ-అమెరికన్లు చురుకుగా పాల్గొనడం గురించి మోదీ మాట్లాడుతూ, యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు.భారతదేశం మూలాలు ఉన్న లక్షలాది మంది అమెరికాలో ఉన్నారని, వారిలో కమలా హారిస్ చరిత్ర సృష్టించారని మోదీ చెప్పారు.అమెరికా అత్యంత పురాతనమైనదని, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.తమ భాగస్వామ్యం ప్రజాస్వామ్య భవిష్యత్తుకు శుభసూచకమన్నారు. కలిసి ప్రపంచానికి మంచి భవిష్యత్తును మెరుగైన ప్రపంచాన్ని అందిస్తామని మోదీ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు