బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్.. భారత్, బ్రిటన్ మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి..!

యూకే - భారత్ సంబంధాలను బలోపేతం చేయడం తన విదేశాంగ విధానం ఎజెండాలో కీలక అంశమని గతంలో..

Britain Election Result 2024 : బ్రిటన్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కు భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి ప్రజలు బిగ్ షాకిచ్చారు. లేబర్ పార్టీ అఖండ విజయాన్ని అందించారు. యూకేలో అధికార పీఠం ఎక్కాలంటే మొత్తం 650 సీట్లకుగాను ఏ పార్టీకైనా 326 సీట్లు రావాల్సి ఉంటుంది. పూర్తి ఫలితాలు రాకముందే లేబర్ పార్టీ 400 సీట్లకు పైగా మార్క్ ను దాటేసింది. దీంతో కీర్ స్టార్మర్ బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం లాంఛనంగా మారింది. ఈ క్రమంలో బ్రిటన్ – భారతదేశం మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : రిషి సునాక్‌కు బిగ్‌షాక్‌.. బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలుపు.. నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్!

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగాయి. రిషి సునాక్ భారత్ సంతతికి చెందిన వ్యక్తి కావటంతో భారతీయులుసైతం రిషి సునాక్ ను భారతీయ వ్యక్తిగా భావిస్తూ వచ్చారు. ప్రస్తుతం కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్ బాధ్యతలు చేపట్టనుండటంతో విదేశాంగ విధానంలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో లేబర్ పార్టీ తొలుత భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించింది. కాశ్మీర్ అనేది భారత్ – పాకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక అంశమన్న బ్రిటన్ ప్రభుత్వ దృక్పథానికి విరుద్ధంగా వ్యవహరించింది. కశ్మీర్ కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం పట్ల భారత్ పై లేబర్ పార్టీ అప్పట్లో విమర్శలు చేసింది. అయితే, ఇప్పుడు స్టార్మర్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది.

ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో స్టార్మర్ లండన్‌లోని ప్రముఖ హిందూ దేవాలయమైన శ్రీ స్వామినారాయణ్ మందిర్ కింగ్స్‌బరీని సందర్శించారు. అతని నుదుటిపై తిలకం, మెడలో పూలదండను ధరించాడు. ఈ క్రమంలో ఇన్నాళ్లు లేబర్ పార్టీపై కోపంగాఉన్న భారతీయ ప్రవాస ఓటర్లను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. భారతీయ ప్రవాస ఓటర్లు ఎక్కువ మంది కన్జర్వేటివ్ పార్టీకి అనుకూలంగా ఉంటారని భావిస్తుంటారు. ఆలయ సందర్శన తరువాత స్టార్మర్ తనవైపుకు తిప్పుకోగలిగాడు. దీనికితోడు భారతదేశంతో స్నేహానికి బలమైన సంకేతాన్ని పంపడానికి కూడా స్టార్మర్ హిందూ ఆలయ సందర్శనను ఉద్దేశించబడింది.

Also Read : సీఎం అయ్యాక తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబు.. టీటీడీపీ నేతలకు కీలక సూచన.. అదేమిటంటే?

యూకే – భారత్ సంబంధాలను బలోపేతం చేయడం తన విదేశాంగ విధానం ఎజెండాలో కీలక అంశమని గతంలో స్టార్మర్ పేర్కొన్నాడు. కాశ్మీర్ పై గతంలో ఆ పార్టీ వైఖరి ప్రస్తుతం మారింది. కాశ్మీర్ అంశం భారత్, పాకిస్థాన్ దేశాల సమస్య. ఇరు దేశాలు ఆ సమస్యను పరిష్కరించుకుంటాయని లేబర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాతో జరిగిన సమావేశంలో స్టార్మర్ చెప్పారు. స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం, సాంకేతికత, భద్రత, విద్య, వాతావరణ మార్పులలో మెరుగైన ద్వైపాక్షిక సహకారానికి కట్టుబడి ఉన్నామని, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్ తో సంబంధాలను పెంచుకోవాలనే ఆశయంతో ఉన్నట్లు కీరా స్టార్మర్ నొక్కి చెప్పారు. భారత్ తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలనే నిబద్ధతతో ఉన్నట్లు వారి మేనిఫెస్టోలో సైతం పొందుపర్చారు. గత రెండేళ్లుగా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) పై భారత్, బ్రిటన్ దేశాల మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, బ్రిటన్ కాబోయే ప్రధాని స్టార్మర్ తో భారత్ సంబంధాలు ఏ మేరకు ముందుకు సాగుతాయి.. స్టార్మర్ చెప్పినట్లు భారత్ తో బలమైన సంబంధాలు నెలకొనేలా ప్రయత్నాలు జరుగుతాయా అనేది వేచి చూడాల్సిందే.

 

ట్రెండింగ్ వార్తలు