Covid New Variant : ఇజ్రాయెల్ లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు

దక్షిణాఫ్రికాలో తాజాగా బయటపడ్డ కోవిడ్ కొత్త వేరియంట్ బి.1.1.529 ఇప్పుడు ప్రపంచదేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించబడిన పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలతో

Covid New Variant  దక్షిణాఫ్రికాలో తాజాగా బయటపడ్డ కోవిడ్ కొత్త వేరియంట్ బి.1.1.529 ఇప్పుడు ప్రపంచదేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించబడిన పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలతో కూడిన కోవిడ్ -19 వేరియంట్ తాజాగా ఇజ్రాయెల్ కి పాకింది. ఆఫ్రికా దేశమైన “మలావీ”నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ కొత్త కోవిడ్ వేరియంట్ ను గుర్తించినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. విదేశాల నుండి తిరిగి వచ్చిన వ్యక్తులలో” మరో రెండు కేసులు కనుగొనబడ్డాయి”అని తెలిపింది. వీరందరినీ క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపింది. ఈ ముగ్గురు వ్యాక్సిన్ తీసుకున్నవారేనని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కోవిడ్ కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ఆఫ్రికా దేశాలైన బోట్స్వానా, ఎస్వాటిని, లెసోతో, మొజాంబిక్, నమీబియా, దక్షిణాఫ్రికా మరియు జింబాబ్వేలను..గురువారం సాయంత్రం “రెడ్ లిస్ట్”లో చేర్చింది ఇజ్రాయెల్. ఈ దేశాల నుంచి విమాన రాకపోకలను నిలిపివేసింది. ఇక,ఇజ్రాయెల్ లో కరోనా పరిస్థితిపై ఇవాళ ఉదయం ప్రజారోగ్య అధికారులతో ప్రధాని నఫ్తాలి బెన్నెట్ ఓ సమావేశం నిర్వహించారు. ఇక,ఇజ్రాయెల్ లో మొత్తం 92లక్షల మంది జనాభాకు గాను 57లక్షల మందికి పైగా రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.

ఇక, దక్షిణాప్రికాలో తాజాగా బయటపడిన బి.1.1.529 వేరియంట్ ఇప్పటివరకు ఉన్న అన్ని వేరియంట్ ల కంటే భిన్నమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిలో మొత్తం 50 వరకు మ్యుటేషన్లు ఉండగా..ఒక్క స్పైక్ ప్రొటీన్ లోనే 30కి పైగా ఉత్పరివర్తనాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మనిషి శరీరంలోకి వైరస్ ప్రవేశించడంలో స్పైక్ ప్రొటీనే కీలకంగా పనిచేస్తుంది. అక్కడే అధిక మ్యుటేషన్లు ఉండటంతో ఈ వేరియంట్ డెల్డా రకం కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని సైంటిస్టులు భావిస్తున్నారు.

ఎయిడ్స్ రోగి నుంచేనా

అయితే ఈ వేరియంట్ ఎలా ఉత్పన్నమన్నమైందన్నదానిపై ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఎయిడ్స్ రోగిలో ఈ వేరియంట్ ఉత్పన్నమై ఉంటుందని లండన్ లోని యూసీఎల్ జెనెటిక్స్ ఇనిస్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. దక్షిణాఫ్రికాలో 80లక్షలకు పైగా ఎయిడ్స్ బాధితులున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఎయిడ్స్ రోగులున్న దేశం దక్షిణాఫ్రికానే. గతంలో దక్షిణాఫ్రికాలో బయటపడిన బీటా కోవిడ్ వేరియంట్ కూడా ఎయిడ్స్ రోగి నుంచే ఉత్పన్నమైనట్లు కొద్ది నెలల క్రితం నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే.

కొత్త వేరియంట్ కు సంబంధించి దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 100కి పైగా కేసులు బయటపడ్డాయి. దేశంలో కొత్తగా వైరస్ బారినపడుతున్నవారిలో చాలామందిలో ఇదే రకాన్ని గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ వేరియంట్ ఇన్ఫెక్షన్లు,పాజిటివిటీ రేటు క్రమేపీ పెరుగుతుందని తెలిపారు. ఇక,ఇతర దేశాలకు కూడా ఈ వేరియంట్ పాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. హాంకాంగ్,బోట్స్వానా దేశాల్లో కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి.

భారత్ అలర్ట్

ఇక,పలు దేశాలతో పాటు భారత్ కూడా కోవిడ్ కొత్త వేరియంట్ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు చేపడుతోంది. కొత్త వేరియంట్ పై ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. కొత్త వేరియంట్‌ ప్రజారోగ్యానికి సవాలు విసిరే ప్రమాదం ఉందని, అందువల్ల దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్‌, బోత్స్​వానా నుంచి వచ్చే ప్రయాణికులందరినీ ముప్పు ఉన్నవారిగానే పరిగణించి వారికి కఠినమైన స్క్రీనింగ్‌ జరిపి, పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు గురువారం రాసిన లేఖలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణ కోసం పంపాలని సూచించారు.

ALSO READ Stock Markets: కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు..!

ట్రెండింగ్ వార్తలు