Madhyapradesh: బుల్డోజర్‌తో కూల్చేశారు.. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడి ఇల్లు కూల్చివేత

సిద్ధి జిల్లాలోని కుబ్రి గ్రామంలో శుక్లా ఇల్లు ఉంది. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలతో స్థానిక అధికారులు బుల్డోజర్ తో శుక్లా నివాసం వద్దకు వెళ్లి ఆ ఇంటిని నేలమట్టం చేశారు.

Madhya Pradesh

Urinating On Tribal man Face: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా పెద్దదుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. నిందితుడు ప్రవేశ్ శుక్లాను బుధవారం తెల్లవారు జామున పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా అతని నివాసాన్ని బుల్డోజర్‌తో కూల్చివేశారు.

గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లడంతో సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకొని కేసు నమోదు సహా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. దీంతో నిందితులు ప్రవేశ్ శుక్లాపై పోలీసులు పలు సెక్షన్ల కింద అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Viral Video: అత్యంత దుర్మార్గపు చర్యకు పాల్పడ్డ బీజేపీ నేత.. పబ్లిక్‭గా గిరిజన వ్యక్తి ముఖంపై మూత్రం పోస్తూ పైశాచిక ఆనందం

గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన పర్వేజ్ శుక్లా బీజేపీ వ్యక్తిగా ప్రచారం జరుగుతుంది. దీనిని బీజేపీ ఖండించింది. నిజనిర్దారణ కోసం నలుగురు సభ్యులతో కమిటీని వేసింది. సిద్ధి జిల్లాలో జరిగిన అమానుష ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. నిందితుడు బీజేపీ వ్యక్తి అని, ఆ పార్టీ పాలనలో ఈ వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ మాజీ సీఎం మాయావతి స్పందిస్తూ.. అత్యంత అవమానకరమైన చర్యకు పాల్పడ్డ నిందితుడి ఇంటిని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం శుక్లాను రేవా సెంట్రల్ జైలులో ఉంచారు.

 

సిద్ధి జిల్లాలోని కుబ్రి గ్రామంలో శుక్లా ఇల్లు ఉంది. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలతో స్థానిక అధికారులు బుల్డోజర్ తో శుక్లా నివాసం వద్దకు వెళ్లి ఆ ఇంటిని నేలమట్టం చేశారు. ఇల్లు కూల్చేందుకు అధికారులు వెళ్లగా నిందితుడి కుటుంబ సభ్యులు వారిని వేడుకున్నారు. తమకు ఉన్నది చిన్న ఇల్లు, అదికూడా కూల్చేస్తే తాము ఎక్కడ ఉండాలని ప్రాదేయ పడ్డారు. అయితే, ఈ కేసులో తమ కుమారుడిని అనవసరంగా ఇరికిస్తున్నారని, నిందితుడు శుక్లా తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ వీడియో పాతదని వారు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ దీన్ని వైరల్ గా మార్చారని శుక్లా సోదరి వాపోయింది.

ట్రెండింగ్ వార్తలు