Satirical Video: ఒక్క శాతం ఆదాయపన్ను కూడా కట్టకుండా చట్టబద్ధంగా ఎలా తప్పించుకోవచ్చో చెప్పిన యువకుడు

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో వేతన జీవులకు ఊరట ఇవ్వలేదని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే జీతం అప్పులకు, ఇంటి అద్దెలకు, రవాణా చార్జీలకే పోతుంటే వాటికి తోడు ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుందని ఉద్యోగులు బాధపడుతున్నారు.

ఇటువంటి సమయంలో ఓ యువకుడు ఆదాయ పన్ను ఒక్క శాతం కూడా కట్టకుండా ఎలా తప్పించుకోవచ్చో చమత్కారంగా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని ఉడిపికి చెందిన శ్రీనిధి అనే కంటెంట్ క్రియేటర్ వీడియో రూపంలో 100 శాతం ట్యాక్స్ సేవ్ చేసుకోవడం ఎలాగో వివరించాడు.

‘ఆదాయపన్ను 100 శాతం ఎలా సేవ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను చెబుతాను. ఇది చాలా సులభం, చట్టబద్ధం. ఉద్యోగులు మొదట వారి ఇంట్లో బాల్కనీలో లేదా ఇంటిపై గడ్డిని పెంచాలి. ఇది చట్టబద్ధమే కదా.. ఆ తర్వాత ఉద్యోగులు వారి హెచ్ఆర్ వద్దకు వెళ్లి తమకు వేతనం వద్దని చెప్పాలి. ఇలా చెబితే కంపెనీ వారు హ్యాపీ కూడా అవుతారు. అయితే, జీతానికి బదులు ఉద్యోగులు తాము పెంచిన గడ్డిని కొనాలని కంపెనీకి చెప్పాలి.

ఉదాహరణకు మీ జీతం రూ.50 వేలయితే, 50 గడ్డిపోగులను కొనాలని చెప్పాలి. ఒక్కో గడ్డిపోగును రూ.1,000కి అమ్మాలి. మీకు రూ.50 వేలు వస్తాయి. ఇది పూర్తిగా చట్టబద్ధమైన ప్రక్రియ. ఇప్పుడు మీ వేతనం జీరో కాబట్టి ట్యాక్స్ పడదు. వ్యవసాయ ఉత్పత్తులకు మన దేశంలో ట్యాక్స్ ఉండదు కాబట్టి గడ్డిపోగులు అమ్మగా మీకు వచ్చిన రూ.50 వేలపై ట్యాక్స్ పడదు. టీడీఎస్, ఇన్వెస్ట్‌మెంట్ గురించి కూడా భయపడే అవసరం లేదు’ అని సెటైరికల్‌గా చెప్పాడు.

Also Read: అణు రహస్యాలను దొంగిలించేందుకు ఉత్తర కొరియా హ్యాకర్ల ప్రయత్నాలు : అమెరికా, బ్రిటన్ హెచ్చరిక

ట్రెండింగ్ వార్తలు