Chilli Varieties : తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటలలో మిరప ప్రధానమైనది. మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు ఉన్న నేపధ్యంలో రైతులు దీని సాగుకు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతంలో మిరపను సాగు చేస్తున్నారు. నల్ల నేలలు,నీటి ఆధారపు పైరుకు నల్ల నేలలు,చల్కా నేలలు,లంక భూములు ,ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. మిరపసాగు చేయాలనుకునే రైతులు ముందుగా విత్తన ఎంపిక చేసుకోవాలి. మిరపసాగుకు సంబంధించి అనేక విత్తన వెరైటీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం…
మిరపసాగులో అనువైన రకాలు ;
జి-౩: ఈ రకం పొడవు కాయలు కాస్తాయి. వర్షాధారపు పైరుకు అనుకూలం. దిగుబడి వర్షాధారంగా ఎకరాకు 6-7.2 క్వి౦టాళ్ళు,నీటి వసతి క్రింద 10-12క్వి౦టాళ్ళు వస్తుంది.
జి-4: ఈ రకం కాయలు సన్నగా,పొడవుగా ఉంటాయి. పచ్చికాయకు,ఎండుకాయకు అనుకూలం. వైరస్ ను తట్టుకొంటుంది. దిగుబడి ఎకరాకు 16-18 క్వింటాళ్ళు వస్తుంది.
జి-5: ఈ రకం కాయలు పొట్టిగా,లావుగా ఉంటాయి. నెల్లూరు,చిత్తూరు,శ్రీకాకుళ౦,విశాఖపట్టణ౦ జిల్లాల్లో నీటి వసతి కింద వేయదగిన రకం.త్వరగా కాపు కొస్తుంది. కారం తక్కువగా ఉంటుంది. వేసవి పైరుకు అనుకూలమైన రకం. దిగుబడి ఎకరాకు 20-22 క్వింటాళ్ళు వస్తుంది.
సింధూర్(సి.ఎ.960): ఈ రకం కాయలు పొడవుగా ,లావుగా ఉంటాయి. పచ్చిమిర్చికి,ఎండుమిర్చికి అనుకూల నీటి వసతి కింద అనుకూలంగా చెప్పవచ్చు. త్వరగా కాపుకొస్తుంది. కారం తక్కువగా ఉండి వేసవి పైరుకు అనుకూలమైన రకం. దిగుబడి ఎకరాకు 20-22 క్వింటాళ్ళు వస్తుంది.
కిరణ్(ఎల్.సి.ఎ-200): ఈ రకంలో పొడవైన కాయలు కాస్తాయి. తెలంగాణా ప్రాంతంలో నీటి ఆధారపు పైరుగా ఇది సాగుకు అనుకూలం. దిగుబడి ఎకరాకు 16-18 క్వింటాళ్ళు వస్తుంది.
అపర్ణ(సి.ఎ-1068): ఇది లావైన, పొడవైన కాయలు కాస్తాయి. తూర్పు గోదావరి ,శ్రీకాకుళం జిల్లాల్లో నీటి వసతి క్రిందపచ్చి మిర్చి,ఎండుమిర్చిలకు అనుకూలం. దిగుబడి ఎకరాకు 14-16క్వింటాళ్ళు వస్తుంది.
భాస్కర్(యల్.సి.ఎ-235): కాయలు పొడవు తక్కువ. కారం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో వర్షాదారంగానూ మరియు నీటి వసతి కింద సాగుకు అనుకూలంగా ఉంటుంది. వైరస్ ను బాగా తట్టుకొంటుంది. అన్ని జిల్లాలకు అనుకూలం. దిగుబడి ఎకరాకు 22-24 క్వి౦టాళ్ళు వస్తుంది.
ప్రకాష్(యల్.సి.ఎ-206): ఈ రకం పొడవైన కాయలు గల రకం. పచ్చి మిర్చికి ,ఎండుమిర్చికి అనుకూలం. వర్షాదారం క్రింద,నీటి వసతి క్రింద సాగుకు అనుకూలమైన జాతీయం రకం. దిగుబడి ఎకరాకు 18-20క్వింటాళ్ళు వస్తుంది.
లాం-305 (యల్.సి.ఎ-305): ఈ రకం పొడవైన ,లావైన కాయలు కలిగిఉంటుంది. పచ్చి మిర్చికి ,ఎండుమిర్చికి ,నీటి ఆధారపు పైరుకు అనుకూలం. దిగుబడి ఎకరాకు 20-22 క్వింటాళ్ళు వస్తుంది.
లాం-334(యల్.సి.ఎ-334): ఈరకం కాయలు పొడవు కలిగి కారం ఎక్కువగా ఉన్న రకం. అన్ని రకాల కంటే దిగుబడి ఎక్కువ. దిగుబడి ఎకరాకు 24-26క్వింటాళ్ళు వస్తుంది.
యల్.సి.ఎ-353: మొక్కల గుబురుగా ,ఒక మాదిరి ఎత్తుగా పెరుగుతాయి .కాయలు 7-9సెం.మీ పొడవుండి, సన్నగా ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి ఉంటాయి. పచ్చి మరియు ఎండుకాయలకు అనుకూలంగా ఉంటుంది.
యల్.సి.ఎ-424: కాయలు 10-12సెం.మీ పొడవుంటాయి. లావు పొడవు తో కూడిన కాయలు. కారం తక్కువ. త్వరగా కోతకు కొస్తాయి.