BRS MLA Sayanna: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత.. కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం

బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇవాళ కన్నుమూశారు. ఆయన స్వస్థలం హైదరాబాద్ లోని చిక్కడపల్లి.

BRS MLA Sayanna: బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (72) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. ఈ నెల 16న గుండె సంబంధిత సమస్యలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇవాళ కన్నుమూశారు. సాయన్న భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి నుంచి ఇంటికి తరలించారు. ఆయన స్వస్థలం హైదరాబాద్ లోని చిక్కడపల్లి. 1951, మార్చి 5న సాయన్న జన్మించారు.

ఓయూ నుంచి ఆయన బీఎస్సీ, తర్వాత ఎల్ఎల్బీ పూర్తి చేశారు. సాయన్నకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదట సాయన్న టీడీపీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన 1994-2009 మధ్య 3 సార్లు ఆ పార్టీ తరఫున కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2009లో ఓడిపోయిన ఆయన 2014 మళ్లీ గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. ఆయన 6 సార్లు హుడా డైరెక్టర్‌ గానూ గతంలో పనిచేశారు.

సాయన్న మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అరుదైన ఘనత సాధించారని అన్నారు. పలు పదవుల ద్వారా సాయన్న చేసిన సేవ చిరస్మరణీయమని చెప్పారు. సాయన్న మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

సాయన్న మృతి పట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. సాయన్న కుటుంబ సభ్యులకు హరీశ్ రావు, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల ఆ పార్టీ ఇతర నేతలు సంతాపం తెలిపారు.

సాయన్న మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. సాయన్న అందరితో ఆత్మీయంగా మాట్లాడేవారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు.

సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని టీపీసీీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. “సౌమ్యుడు, సుదీర్ఘ రాజకీయ జీవితంలో నగర ప్రజలకు ఎనలేని సేవలు అందించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాలమరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని రేవంత్ రెడ్డి చెప్పారు.

 

Mayil Samy : పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి..

ట్రెండింగ్ వార్తలు