బీఆర్ఎస్ పనైపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు కూడా ఉండేలా లేదు- కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. నిజమైన ప్రతిపక్షంగా ప్రజల కోసం బీజేపీ పోరాటం చేస్తుంది.

Kishan Reddy : అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీల మాటను కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మాటలు అటు ప్రజలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు నమ్మడం లేదు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ తేలిపోయిందన్న కిషన్ రెడ్డి.. ఐదేళ్లు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. బీజేపీ కార్యకర్తలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన ఓటర్లు కూడా బీజేపీకే ఓటు వేశారని కిషన్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడుకుందని ఆయన మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యువమోర్చా సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

”కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు, అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు మరిచిపోయారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి హామీలను అమలు చేయడం లేదు. నిరుద్యోగులకు 4వేల నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పుడేమో మేము అలాంటి హామీలు ఇవ్వలేదు అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేదు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారు. రేవంత్ అసత్య ప్రచారాలను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్మలేదు. రేవంత్ రెడ్డి ప్రచారం చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నవ్వుకున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి 5 సంవత్సరాలు కూడా పట్టేలా లేదు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్దఎత్తున BJYM నేతలు పోరాటం చేయాలి. రాష్ట్రంలో బీజేపీకే భవిష్యత్ ఉంటుంది. బీఆర్ఎస్ పనైపోయింది. పాలక పార్టీకి బీఆర్ఎస్ కొమ్ముకాస్తుంది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. నిజమైన ప్రతిపక్షంగా ప్రజల కోసం బీజేపీ పోరాటం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేయడానికి యువత సిద్ధంగా ఉండాలి. బీఆర్ఎస్ కు ఓటు వేసినా కాంగ్రెస్ కు వేసినట్లే. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమల చేసే వరకు ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం” అని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read : ఈసారి మోసపోతే తప్పు మనదే, ఆలోచించి ఓటు వేయండి- కేటీఆర్