Huzurabad By Election : హుజూరాబాద్ బాద్ షా ఎవరు ? ఓటరు ఎటు వైపు ?

హుజూరాబాద్‌ బాద్‌ షా ఎవరు..? ఉప ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుంది? ఇప్పుడిదే టెన్షన్‌ అభ్యర్థుల్లోనే కాదు.. యావత్ తెలంగాణ అంతటా నెలకొంది.

Huzurabad By Election 2021 : హుజూరాబాద్‌ బాద్‌ షా ఎవరు..? ఉప ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుంది? ఇప్పుడిదే టెన్షన్‌ అభ్యర్థుల్లోనే కాదు.. యావత్ తెలంగాణ అంతటా నెలకొంది. ఉప ఎన్నిక ఫలితం అటు అభ్యర్థులు.. ఇటు రాజకీయ పార్టీల్లోనూ హీట్ పుట్టిస్తోంది. టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్‌పై పోటీచేసిన ఈటల రాజేందర్‌ గెలుస్తారా? విద్యార్థి నేతగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువకుడు, అధికార పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ గెలుస్తారా? కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బల్మూరి వెంకట్‌ ఆశలు ఎంతవరకు ఫలిస్తాయి? ఇదే ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. కాస్ట్లీ ఎన్నికలకు చెప్పుకుంటున్న విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండగా… ఓటరు ఎవరికి పట్టం కట్టారన్నది.. మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. పెరిగిన ఓటింగ్‌ తమకే లాభిస్తుందని టీఆర్‌ఎస్, బీజేపీ అంచనా వేస్తూ… హుజూరాబాద్‌లో ఎగిరేది తమ పార్టీ జెండానే అని ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read More : Telangana : కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వం, ప్రతి సభ్యుడికి రూ. 2 లక్షల ఇన్సూరెన్స్

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలకే మరోసారి హుజూరాబాద్ ఓటర్లు ఓటేశారా? సర్కార్‌ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఓటేశారా? కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్‌ ఇచ్చారా? ఫలితం కోసం చూడాలంటే మంగళవారం దాకా ఆగాల్సిందే. రికార్డు స్థాయిలో ఓటింగ్‌ జరగడంతో ఏ పార్టీని విజయం వరించనుందనేదానిపై జోరుగా అంచనాలున్నాయి. కౌంటింగ్‌కు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మంచి మెజార్టీతో గెలవబోతున్నారు.. విజయోత్సవం జరుపుకుందామంటూ హరీశ్‌రావు… పార్టీ క్యాడర్‌లో జోష్‌ నింపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కోసం కష్టపడ్డ వారందరికి ధన్యవాదాలు తెలిపారు.

Read More : PM Modi : గ్లాస్గోలో మోదీ, కాప్ 26 సదస్సులో ప్రసంగం

అటు.. ప్రలోభాలకు లొంగకుండా హుజూరాబాద్ ఓటర్లు ప్రజాస్వామ్యాన్నే గెలిపించబోతున్నారని, తన గెలుపు ఖాయమైపోయిందని ఈటల రాజేందర్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలే రక్షణగా నిలిచి తనను గెలిపించుకుంటున్నారన్నారు. మరోవైపు వీవీ ప్యాట్స్‌ తరలింపుపై రగడ కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌ ఆందోళనలు చేపట్టాయి. వీవీ ప్యాట్స్‌ను ప్రైవేటు వాహనంలో ఎందుకు తరలించారని.. దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే వీవీ ప్యాట్స్ తరలింపుపై వదంతులు నమ్మవద్దని కోరారు ఎన్నికల అధికారి రవీందర్‌రెడ్డి. పనిచేయని వీవీ ప్యాట్‌ను మాత్రమే తరలించామని స్పష్టం చేశారు. వీవీ ప్యాట్ల తరలింపుపై వివరణ ఇవ్వాలంటూ ఇప్పటికే కరీంనగర్ కలెక్టర్, హుజూరాబాద్ ఆర్వోను సీఈవో శశాంక్‌ గోయల్ ఆదేశించారు. సోమవారం అన్ని రాజకీయ పార్టీల నేతలతో శశాంక్‌ గోయల్‌ సమావేశం కానున్నారు. మరోవైపు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు