పోలవరం పూర్తవ్వడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుంది?

Polavaram: అసలే పోలవరం నిర్మాణం ఆలస్యమవుతున్న కొద్దీ ఖర్చు పెరుగుతోంది.

పోలవరం పూర్తయ్యేది ఎప్పుడు..? ఇది సమాధానం లేని.. తెలియని ప్రశ్న. దశాబ్దాలగా తీరని కలగా ఉన్న పోలవరం జాతీయ హోదా పొందిన పదేళ్ల తర్వాత కూడా ఇంకా నిర్మాణం దశలోనే ఉండడం బాధాకరం. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావించే పోలవరం పూర్తవ్వడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుంది..? అసలు పోలవరంతో కలిగే ప్రయోజనాలేంటి..? 2014-2019 మధ్య 2019-2024 మధ్య పోలవరం పనులు ఎంతెంతమేర సాగాయి..? పోలవరం నిర్మాణాన్ని టీడీపీ ప్రభుత్వం పరుగులు పెట్టించే పరిస్థితులున్నాయా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో పోలవరానికి జాతీయ హోదా హామీ ఇచ్చినప్పుడు….విభజిత ఏపీ ప్రజలు…..అపారనష్టంలో కొంత లాభం జరిగిందని సంబరపడ్డారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచీ ప్రతిపాదనలో ఉన్న పోలవరం నిర్మాణం ఇక వీలయినంత వేగంగా పూర్తయిపోతుందని, తాగు, సాగునీటి అవసరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారిపోతుందని ఆశపడ్డారు.

ప్రజలు ఆకాంక్షలకు తగ్గట్టుగానే అప్పటి టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో కలిసి పోలవరం నిర్మాణం వడివడిగా సాగించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోలవారంగా ప్రకటించి మరీ పనుల పర్యవేక్షణ జరిపారు. 2019లో టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయేనాటికి 72శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి.

టీడీపీ రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టడంతో పోలవరాన్ని అమిత ప్రాధాన్య అంశంగా భావించి నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు సిద్ధమయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి క్షేత్రస్థాయి పర్యటనకు పోలవరాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి తమ లక్ష్యమన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపి కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నారు. అయితే పోలవరానికి అనేక సాంకేతిక సమస్యలున్నాయి. వాటన్నింటినీ కొలిక్కి తెచ్చి ప్రాజెక్టు నిర్మాణ పనులు గాడిలో పెట్టడం కొత్త ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్‌గా మారింది.

ప్రధానంగా మూడు భాగాలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా మూడు భాగాలున్నాయి. ఒకటి రిజర్వాయర్ కాగా రెండోది స్పిల్ వే. మూడోది విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. రిజర్వాయర్‌లో నీటిని నిల్వచేస్తారు. రిజర్వాయర్ నుంచి స్పిల్ వే ద్వారా నీటిని విడుదల చేస్తారు. రిజర్వాయర్‌కు కుడివైపు, ఎడమ వైపు రెండు కాల్వలు ఉంటాయి.

రిజర్వాయర్ ఆనకట్టలో డయాఫ్రం వాల్ ఓ భాగం. నది మధ్యలో 300 అడుగుల లోతులో కట్టిన ఈ కాంక్రీట్ గోడ చుట్టూనే వివాదాలు ముసురుకున్నాయి. దీనికి కారణం 2020లో వచ్చిన గోదావరి వరదలకు డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడంతో పోలవరం ప్రాజెక్టు పనుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయింది.

ఎగుర కాఫర్ డ్యాంలో ఉన్న గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడం వల్లే డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయిందని, ఇది ప్రభుత్వ వైఫల్యమని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఆరోపించింది. 70 మీటర్ల లోతులో నిర్మించిన డయాఫ్రం వాల్ లో రెండు పెద్ద గుంతలు ఏర్పడడం, వాటిని పూడ్చలేకపోవడంతో పోలవరం నిర్మాణ పనులు అనుకున్నంత మేర ముందుకు సాగడం లేదు.

ఆలస్యమవుతున్న కొద్దీ ఖర్చు అధికం
జాతీయ జలవిద్యుత్ పరిశోధన కేంద్రం డయాఫ్రం వాల్ సామర్థ్యాన్ని పరిశీలించి కొన్ని సూచనలు చేసింది. దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతర డయాఫ్రం వాల్ నిర్మించి పాత వాల్‌కు యు ఆకారంలో అనుసంధానించడం, లేదా కొత్త డయాఫ్రం వాల్ నిర్మించం అనే ప్రతిపాదనలు చేసింది. కొత్త డయా ఫ్రం వాల్ నిర్మాణానికి 600 కోట్లు ఖర్చవుతాయని అంచనా. అసలే పోలవరం నిర్మాణం ఆలస్యమవుతున్న కొద్దీ ఖర్చు పెరుగుతోంది. ఇప్పుడు డయాఫ్రం వాల్ నిర్మాణం, మరమత్తుల ఖర్చుల భారం అదనంగా పడనుంది.

డయాఫ్రంవాల్ కొత్తగా నిర్మించాలనే ప్రతిపాదన ఇప్పటికే సిద్ధమయింది. ఇక ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల పరిస్థితీ అగమ్య గోచరంగా ఉంది. ప్రధాన డ్యాం నిర్మించేటప్పుడు నీరు అడ్డు తగలకుండా ఉండేందుకు నిర్మించే కాఫర్ డ్యాంలు పోలవరానికి ఎగువున, దిగువున నిర్మించారు. ఈ రెండింటి నుంచీ నీరు లీకవుతోంది. దీంతో వరదల సమయంలో ప్రధాన డ్యామ్ మొత్తం నీటితో నిండిపోయింది. ఇలా రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా జాతీయ హోదా ఉన్నప్పటికీ పోలవరం నిర్మాణం ఓ అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందాన సాగుతోంది.

Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై రాళ్ల దాడి

ట్రెండింగ్ వార్తలు