ఒకే ఊరు.. 47 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు.. ప్రతి ఇంట్లో ఒక ఆఫీసర్.. ఇది ఇండియా ‘UPSC విలేజ్’ కథ.. ఎలా సాధ్యమైందంటే?

మాధోపట్టి గ్రామస్థుల ప్రతిభ కేవలం సివిల్ సర్వీసెస్‌కే పరిమితం కాలేదు. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ జ్ఞాను మిశ్రా ఇస్రో శాస్త్రవేత్తగా, జన్మేజయ్ సింగ్ ప్రపంచ బ్యాంకులో ఉన్నత అధికారిగా సేవలందించారు.

ఒకే ఊరు.. 47 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు.. ప్రతి ఇంట్లో ఒక ఆఫీసర్.. ఇది ఇండియా ‘UPSC విలేజ్’ కథ.. ఎలా సాధ్యమైందంటే?

Updated On : August 4, 2025 / 4:45 PM IST

దేశానికి సేవ చేయాలన్న తపనతో ప్రతి ఏటా లక్షలాది మంది యువత యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతారు. ఐఏఎస్, ఐపీఎస్ కావాలనేది వారి కల. ఉత్తరప్రదేశ్‌లో కేవలం 75 ఇళ్లున్న ఓ చిన్న గ్రామం దేశానికి ఏకంగా 47 మంది సివిల్ సర్వెంట్లను అందించి, ‘ఆఫీసర్ల ఫ్యాక్టరీ’గా పేరుగాంచిందంటే మీరు నమ్ముతారా?

‘UPSC విలేజ్’
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో ఉన్న మాధోపట్టి అనే ఈ చిన్న గ్రామం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. జనాభా కేవలం 4,000 లోపే ఉన్నప్పటికీ, ఈ గ్రామంలోని దాదాపు ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ప్రభుత్వ ఉన్నత పదవిలో ఉన్నారు. ఇప్పటివరకు ఇక్కడి నుంచి 47 మంది IAS, PCS, IPS అధికారులుగా దేశానికి సేవలందించారు.

విజయ పరంపర ఎలా మొదలైంది?
మాధోపట్టి విజయ గాధ 1952లో ప్రారంభమైంది. ఈ గ్రామానికి చెందిన ఇందు ప్రకాశ్ సింగ్ యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించి IFS అధికారిగా ఎంపికైన తొలి వ్యక్తి. ఆయన స్ఫూర్తితో, 1955లో వినయ్ కుమార్ సింగ్ IAS అయ్యారు. ఆయన బిహార్ చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. వారి విజయం గ్రామ యువతకు కొత్త బాట వేసింది.

ఇక్కడి విద్యార్థులు పాఠశాల విద్య పూర్తైన వెంటనే సివిల్ సర్వీసెస్‌ను లక్ష్యంగా చేసుకుని సాధన ప్రారంభిస్తారు. తమ కళ్లముందే ఎందరో సీనియర్లు అధికారులుగా మారడం చూసి, యువతలో పట్టుదల పెరుగుతుంది.

ఒకే కుటుంబం నుంచి నలుగురు సోదరులు (ఇద్దరు IAS, ఇద్దరు IPS) యూపీఎస్సీలో విజయం సాధించడం ఈ గ్రామ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఇది మిగతావారికి గొప్ప ప్రేరణగా నిలిచింది. ఒకరికొకరు సాయం చేసుకుంటూ, మార్గనిర్దేశం చేసుకుంటూ పరీక్షలకు సిద్ధమవడం ఇక్కడి ప్రత్యేకత.

సివిల్స్ మాత్రమే కాదు.. అంతకు మించి!
మాధోపట్టి ప్రతిభ కేవలం సివిల్ సర్వీసెస్‌కే పరిమితం కాలేదు. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ జ్ఞాను మిశ్రా ఇస్రో శాస్త్రవేత్తగా, జన్మేజయ్ సింగ్ ప్రపంచ బ్యాంకులో ఉన్నత అధికారిగా సేవలందించారు. వీరితో పాటు అనేక మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కీలక శాఖల్లో పనిచేస్తూ గ్రామ కీర్తిని దశదిశలా చాటుతున్నారు.