ఊరికోసం ఒకే ఒక్కడు..30 ఏళ్లు శ్రమించి కాలువ తవ్విన అపర భగీరథుడు

  • Publish Date - September 14, 2020 / 11:17 AM IST

‘పొరుడు వాడు చల్లగా ఉంటే పొయ్యిలోకి ఊక అయినా దొరుకుతుంది..పక్కవాడు పచ్చగా ఉంటే పచ్చడి మెతుకులైనా దొరుకుతాయి’ అన్నారు పెద్దలు. కానీ నేటి కాలంలో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా ఉంటున్నారు. నేను బాగుండాలి..నా కుటుంబం బాగుండాలి అంతే చాలు ఎవరు ఎలా ఉంటే నాకేమిటి? అన్నట్లుగానే ఉన్నాయి రోజులు. కానీ..నేను..నా ఇల్లే కాదు..ఊరుకూడా పచ్చగా ఉండాలి..ఊరు పొలాలన్నీ పంటలతో కళకళలాడాలి..ఊళ్లో ఉండే జంతువుల్నీ కడుపునిండా పచ్చని మేత తిని..కడుపునిండా నీళ్లు తాగాలి..చక్కగా పాలు ఇవ్వాలి..అప్పుడే ఊరంతా సంతోషంగా ఉంటుంది..అలా ఊరంతా సంతోషంగా ఉండాలనుకున్నాడు ఓ వయో వృద్ధుడు. అపర భగీరథుడిగా మారాడు. ఊరు రూపురేఖల్నే మార్చివేశాడు. పలుగు పార పట్టుకుని ‘ఊరు కోసం ఒకే ఒక్కడు’కలియుగ భగీరథుడిగా మారి కాలువ తవ్వాడు. గ్రామాలే దేశానికి వెన్నెముకలు అని గాంధీజీ చెప్పిన మాట. ఆ మాటనే నిజం చేశాడు బీహార్ రాష్ట్రంలోని ఓ వృద్ధుడు. ఒంటిచేతులతో కాలువ తవ్వాడు.


అది బిహార్‌లోని గయా జిల్లాలోని లథువా ప్రాంతానికి చెందిన మారుమూల గ్రామం కోథిలావా. గయా జిల్లాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది కోథిలావా గ్రామం. నీటి సౌకర్యం లేని గ్రామం. దీంతో ఊరిలో వ్యవసాయ భూములు ఉన్నాయిగానీ..సరిపడా నీరు లేక బీళ్లుగానే ఉన్నాయి. దీంతో గ్రామంలోని పశువులకు కూడా తిండి సరిపడా లేదు. దీంతో పంటలు పెద్దగా లేక పాడి లేక ఊరంతా ఆర్థిక ఇబ్బందులు..గ్రామం పక్కనే నీటి వనరులు ఉన్నా..కోథిలావా గ్రామానికి మాత్రం పెద్దగా నీటి సదుపాయం లేదు. కానీ తమ ఊరుకూడా పాడి పంటలతో కళకళలాడాలని ఆశపడ్డాడు ‘లాంగి భూయాన్’ అనే వృద్ధుడు. అతను ఊరిలో పశువుల్ని కాస్తుంటాడు. పశువుల్ని ఊరి చివరిలో ఉండే ఓ కొండ ప్రాంతానికి ప్రతీరోజు తోలుకెళ్లి…సాయంత్రానికి పశువులన్నీ తిండి తిని నీరు తాగా తిరిగి తోలుకొస్తుంటాడు.


అలా మనఊరిలోనే పశువులకు సరిపడా తిండి నీరు ఉంటే బాగుటుంటుంది కదా..నీరు ఉంటే ఊళ్లో బీడువారిన భూములు కూడా పంటలతో కళకళలాడతాయి కదానే ఆలోచన వచ్చింది. కొండమీద కురిసే నీరంతా పక్క గ్రామాలకు పారుతోంది. ఆ నీరంతా వృథా అవుతోంది. ఆనీటిని తమ గ్రామం అయిన కోథివాలాకు మళ్లించుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది. అలా నీరు మళ్లాలి అంటే ఆ ఊరికి కాలువ రావాలి. ఆ పని ప్రభుత్వం చేయాలి. కానీ అది జరిగే పని కాదు..కానీ ప్రయత్నిస్తే పోయేదేముంది..నేనే కాలువ తవ్వితే పోలా..అనుకున్నాడా లాంగి భూయాన్.


అనుకున్నదే తడవుగా పలుగు పార పట్టుకుని రంగంలోకి దిగాడు. ప్రతీ పశువుల్ని తోలుకెళ్లటం..అవి మేత మేస్తుంటే సాయంత్రం వరకూ తాను కాలువ తవ్వటం ప్రారంభించాడు. అదిచూసినవారంతా ‘ఏంటీ లాంగి భూయాన్..ఏం చేస్తున్నావ్? అని అడిగేవారు..‘మన ఊరికి కాలువ తవ్వుతున్నా’ అని చెప్పేవాడు..అది విన్నవారంతా నవ్వుకునేవారు..‘ఏంటీ ఈ వయస్సులో నువ్వొక్కడివే ఊరి కోసం కాలువ తవ్వేస్తావా? హ్హాహ్హా’’ అని ఎగతాళిగా నవ్వేవారు. కానీ భూయాన్ ఏమాత్రం పట్టించుకునేవాడుకాదు..తన పని మానేవాడు కాదు.


అలా 30 ఏళ్ల పాటు నిర్వరామంగా శ్రమించాడు..3 కిలోమీటర్ల దూరం కాలువ తవ్వేశాడు. చివరకు గ్రామానికి సాగునీరు అందించే కాలువను పూర్తిచేశాడు. లాంగి భూయాన్ సంకల్పం నెరవేరింది. అతన్ని చూసి నవ్వినవారంతా సిగ్గుతో తల వంచుకున్నారు. నవ్వినవారంతా శెభాష్ అంటూ మెచ్చుకున్నారు. కానీ లాంగి భూయాన్ మాత్రం చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. కొండమీది నీటిని కాలువలోకి మళ్లించి ఆ కాలువ ద్వారా తమ ఊరిలోకి ఆ నీరు చేరేలా మూడు కిలోమీటర్ల కాలువ తవ్వాడు. ఆ కాలువను కోథివాలా గ్రామంలోని చెరువులోకి మళ్లించాడు. ఇప్పుడు ఆ చెరువు నీటితో కళకళలాడుతోంది. ఆ నీటితో పశువులు దాహం తీరుతోంది.

ఆ చెరువు నీటితో పంటపొలాలకు కూడా నీరు పెట్టుకుని వ్యవసాయం చేయ్యొచ్చు అని ఆశపడుతున్నారు గ్రామస్తులు. చెవురు నీటితో నిండి కళకళలాడటంతో లాంగి భూయాన్ ను గ్రామస్థులంతా ప్రశంసిస్తున్నారు. గతంతో వానలు కురిసినా..ఆ చెరువు నిండేది కాదు. సరిపడా నీరు లేక పంటలు పండేవి కావు. దీంతో ఎంతోమంది గ్రామస్తులు పొట్ట చేతపట్టుకుని పట్టణాలకు వలస పోయారు. పట్టణాలకు వలస పోయేవారిని చూసి లాంగి భూయాన్ బాధపడేవాడు. మన ఊరికి నీరు ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదుకదాని ఆవేదన చెందేవాడు..అలా ఆ ఆలోచన నుంచి వచ్చిందే కాలువ తవ్వాలనే ఆలోచన..కాలువ తవ్వాడు..ఊరికల నెరవేర్చాడు ఒంటి చేత్తో.


ఊరి చెరువు నీటితో నిండిన ఆనందంతో లాంగి భూయాన్ మాట్లాడుతూ..కష్టమొచ్చిందని ఊరు వదిలి నేను వెళ్లాలనుకోలేదు…ఇక్కడ ఉండే నీటి సమస్య పరిష్కరించాలనుకున్నారు..గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నిత్యం పశువులను కాసేందుకు వెళ్తూ 30 ఏళ్లు శ్రమించి..3 కిలోమీటర్ల పొడువైన కాలువను తవ్వగలిగాను. కానీ చాలా సమయం పట్టింది. దానికి నా వయస్సు కూడా కారణం కావచ్చు..వర్షపునీరు గ్రామ చెరువులోకి రావడంతో పంటలు పండించుకునే పరిస్థితికి వచ్చాం..



https://10tv.in/reasons-to-drink-water-first-thing-in-the-morning/
చుక్క నీరు వృథా అయినా నా మనస్సు ఒప్పదు..అలా నీటిని ఒడిసిపట్టి..వ్యవసాయం చేస్తున్నా..నా వ్యవసాయాన్ని చూసి మరికొందరు పట్టణాల నుంచి గ్రామాలకు తిరిగి వస్తున్నారు. వారు కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇదే నేను కోరుకున్నది..పంటలతో ఊరంతా కళకళలాడాలి..ఊరిలో ప్రజలంతా పాడి పంటలతో సంతోషంగా ఉండాలి..ఇది నాకెంతో సంతోషం కలిగిస్తుంది. ఒక్కడినే ఈ కాలువను తవ్వాను..నన్ను చూసి నవ్వినవారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అని లాంగి భూయాన్ ఎంతో సంతోషంగా చెప్పాడు.లాంగి భూయాన్ అపర భగీరథ ప్రయత్నానికి తగిన ఫలితం గురించి తెలిసినవారంతా లాంగి భూయాన్ ను ప్రశ్నంసల జల్లు కురిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో లాంగికి సెల్యూట్ చేస్తున్నారు. దేశాన్ని కాపాడే సైనికులు దేశానికి ఎంత అవసరమో..పంటలు పండించే రైతులు కూడా అంతే గొప్ప అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. . ఇటువంటి నిస్వార్థ సేవలను ప్రభుత్వాలు గుర్తించాలని..ఇటువంటివారికే కదా పద్మశ్రీలు, పద్మభూషణ్ లకు అర్హులు ఇటువంటివారిని అవార్డులు ఇచ్చి గౌరవించుకోవటం బాధ్యతగా తీసుకోవాలని అంటున్నాడు కోథిలావాలోని టీచర్ రాం విలాస్ సింగ్‌.

ట్రెండింగ్ వార్తలు