Noida Twin Towers Demolished : నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత వెనుక.. ఆ నలుగురు.. పదేళ్ల న్యాయపోరాటానికి దక్కిన ఫలితం

దేశంలోనే అత్యంత ఎత్తైన ఈ టవర్ల కూల్చివేత అంత సులువుగా జరగలేదు. అంతపెద్ద నిర్మాణ సంస్థ సూపర్ టెక్ తో కోర్టులో కొట్లాడటం వెనుక పర్యావరణవేత్తలతో పాటు నలుగురు వ్యక్తుల సుదీర్ఘ న్యాయ పోరాటం ఉంది.

Noida Twin Towers Demolished : దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన నోయిడాలో అక్రమ నిర్మాణం ట్విన్‌ టవర్స్ సెకన్ల వ్యవధిలోనే నేలమట్టమైపోయింది. దాదాపు 100 మీటర్ల ఎత్తయిన ఈ జంట భవనాలను ఉన్నచోటే అధికారులు కూల్చేశారు. నిబంధనలను అతిక్రమించి నిర్మించిన ట్విన్ టవర్స్ ను అధికారులు ఆదివారం కూల్చేశారు. దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి ఎడిఫిస్ సంస్థ ట్విన్ టవర్స్ ను పేల్చేసింది.

అక్రమంగా గ్రీన్ జోన్ లో నిర్మించిన అత్యంత ఎత్తైన టవర్స్ ను కూల్చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో నోయిడా అథారిటీ అధికారులు జంట భవంతులను నేలమట్టం చేశారు. అయితే దేశంలోనే అత్యంత ఎత్తైన ఈ టవర్ల కూల్చివేత అంత సులువుగా జరగలేదు. అంతపెద్ద నిర్మాణ సంస్థ సూపర్ టెక్ తో కోర్టులో కొట్లాడటం వెనుక పర్యావరణవేత్తలతో పాటు నలుగురు వ్యక్తుల సుదీర్ఘ న్యాయ పోరాటం ఉంది.

అక్రమంగా నిర్మించిన ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలంటూ నలుగురు సీనియర్‌ సిటిజన్లు అలహాబాద్‌ హైకోర్టు, సుప్రీంకోర్టులో దాదాపు పదేళ్ల పాటు అలుపెరుగని పోరాటం చేశారు. సూపర్‌ టెక్‌ నిర్మాణ సంస్థతో కొట్లాడేందుకు తమ స్థోమత సరిపోక విరాళాలు సేకరించి మరీ కోర్టుల చుట్టూ తిరిగారు. వారి 12ఏళ్ల అవిశ్రాంత న్యాయ పోరాటానికి ఫలితమే ట్విన్ టవర్స్‌ కూల్చివేత.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో గల సెక్టార్‌ 93 ప్రాంతంలో సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ 2009లో భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఈ భవనాల నిర్మాణ సమయంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డర్‌ పట్టించుకోలేదు. అంతేకాదు అధికారులతో కుమ్మక్కై నిబంధనలను గాలికొదిలేశారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు యూబీఎస్‌ టియోటియా (80), ఎస్‌కే శర్మ(74), రవి బజాజ్‌(65), ఎంకే జైన్ ‌(59).. ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌ సంస్థకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లారు.

తొలుత వీరు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ టవర్లను వెంటనే కూల్చివేయాలని 2014 ఏప్రిల్‌లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సూపర్‌టెక్‌ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్‌కో విధించారు. దాదాపు ఏడేళ్ల విచారణ అనంతరం అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. సుప్రీంకోర్టు గతేడాది(2021) ఆగస్టులో తుది తీర్పు వెలువరించింది. ఆ ట్విన్‌ టవర్లను బిల్డర్‌ సొంత ఖర్చులతోనే కూల్చేయాలని ఆదేశించింది.

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల తర్వాత కూడా ఈ కూల్చివేతకు చాలా సమయం తీసుకున్నారు. ఇప్పటివరకు నాలుగుగైదు సార్లు కూల్చివేతకు సంబంధించి షెడ్యూల్‌ తయారు చేసినా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఎట్టకేలకు ఆదివారం(ఆగస్టు 28) మధ్యాహ్నం 2.30 గంటలకు భారీగా పేలుడు పదార్థాలను వినియోగించి ట్విన్ టవర్లను నేలమట్టం చేశారు.

గతేడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సందర్భంలో తమకు ఈ 12ఏళ్ల పోరాటం ఓ కఠిన ప్రయాణమని నాటి రోజులను గుర్తుచేసుకున్నారు కమిటీలో ఒకరైన ఎస్‌కే శర్మ. ఒక్క సుప్రీంకోర్టులోనే ఏడేళ్లపాటు 30 సార్లు విచారణ జరిగిందన్నారు. దానికి ముందు అలహాబాద్‌ హైకోర్టుకు అనేకసార్లు వెళ్లామని అప్పుడు రైళ్లలో థర్డ్‌ క్లాస్‌లో ప్రయాణించామని చెప్పారు. ఇక సాక్ష్యాల కోసం స్థానిక, రాష్ట్ర సంస్థల నుంచి డాక్యుమెంట్లు సేకరించడం కూడా చాలా కష్టమైందన్నారు. ఈ న్యాయపోరాటం కోసం దాదాపు రూ.కోటికి పైనే ఖర్చయిందని, ఇందుకోసం ఇంటింటికీ వెళ్లి సొసైటీ సభ్యుల నుంచి విరాళాలు సేకరించామని టియోటియా చెప్పారు. న్యాయం తమవైపు ఉందని, కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకంతోనే పోరాటం చేశామన్నారు.

న్యాయపోరాటం చేసిన నలుగురిలో టియోటియా కీలక వ్యక్తి. ఆయన సీఆర్పీఎఫ్‌లో డీఐజీగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఈయన నేతృత్వంలోనే ఈ న్యాయపోరాటం సాగింది. ఎస్‌కే శర్మ టెలికాం విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. కమిటీ సభ్యుల్లో ఒకరైన ఎంకే జైన్‌ ఈ ఏడాది ఆరంభంలో కొవిడ్‌తో మరణించారు. మొత్తంగా ఆ నలుగురు చేసిన పోరాటం ఫలించింది. అక్రమంగా నిర్మించిన నోయిడా ట్విన్ టవర్లు నేలమట్టం అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు