BRS party: ప్రధాని మోదీపై బీఆర్‌ఎస్ సరికొత్త అస్త్రం.. బీజేపీని కార్నర్ చేసేందుకు గులాబీ పార్టీ రెడీ!

బీఆర్‌ఎస్ పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీ కౌంటర్ ఇస్తారా? లేదంటే ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించి కేసీఆర్ సర్కారును డిఫెన్స్‌లోకి నెడతారా?

BRS party ready to attack against PM Modi during elections in Telangana over Palamuru Project

BRS party ready to attack against PM Modi : తెలంగాణలో ఎన్నికల వేళ ప్రధాని మోదీపై సరికొత్త అస్త్రం ప్రయోగించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైందా? రాష్ట్రంలో మోదీ పర్యటన ఖరారైన నేపథ్యంలో పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదాను తెరపైకి తీసుకువచ్చి ఆయన్ను కార్నర్ చేసేందుకు సిద్ధమైందా? తొమ్మిదేళ్లుగా కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదన్న అంశాన్ని మోదీ పర్యటన సందర్భంగా మరోసారి తెరపైకి తీసుకువచ్చి ఒత్తిడి పెంచేందుకు వ్యూహం సిద్ధం చేసుకుందా?

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 1న రాష్ట్రానికి రానున్న మోదీ.. పాలమూరు జిల్లా వేదికగా ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు. దీంతో అలర్ట్ అయిన అధికార బీఆర్‌ఎస్.. మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అస్త్రాలను సిద్ధం చేసుకుంది. తెలంగాణపై కేంద్రం అవలంభిస్తున్న విధానాలను ఎండగడుతూ రాజకీయంగా బీజేపీని కార్నర్ చేసేందుకు రెడీ అయ్యింది కేసీఆర్ సర్కారు.

పాల‌మూరు జిల్లాకు వ‌స్తున్న ప్రధాని మోదీని.. అదే జిల్లాకు చెందిన ప్రధాన అంశంతో అటాక్ చేసేందుకు సిద్ధమైంది బీఆర్‌ఎస్. మహబూబ్‌నగర్ జిల్లా బతుకు చిత్రాన్ని మార్చి ఆ జిల్లాకు పచ్చతోరణం కట్టేందుకు సంకల్పించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టునే ఆయుధంగా చేసుకుంటోంది గులాబీ పార్టీ. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి.. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా ఇవ్వకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నిస్తోంది బీఆర్‌ఎస్.

గోదావరిపై కాళేశ్వరం, కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలలో ఏదో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని చాలా కాలంగా కోరుతోంది బీఆర్‌ఎస్. తొమ్మిదేళ్లుగా కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొద‌టి ద‌శ కంప్లీట్ చేసి.. ఈనెల 16న ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఇప్పుడు రెండో ద‌శ ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు అంచ‌నా వ్యయం రూ.55,080 కోట్లు కాగా.. ఇప్పటి వరకు 26,262 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికైనా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్నది తెలంగాణ సర్కారు డిమాండ్.

Also Read: హైదరాబాద్ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని.. చంద్రబాబు అరెస్ట్‌‌పై కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

మరోవైపు.. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వంతో కొనసాగుతున్న నీటి పంచాయితీని కూడా పరిష్కరించడం లేదు కేంద్ర ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగినట్లుగానే కృష్ణాలోని 811 టీఎంసీల్లో ఏపీ 512 టీఎంసీలు వాడుకుంటుండగా.. తెలంగాణకు కేటాయిస్తున్నది 299 టీఎంసీలు మాత్రమే. విభజన తర్వాత నీటి వాటా తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుతో పాటు, సీడబ్ల్యూసీ, సుప్రీం కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కృష్ణా నీటిలో 90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీన్ని వ్యతిరేకించిన ఏపీ వాదనను ట్రిబ్యునల్ కొట్టివేసింది. ఆ తర్వాత ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించేందుకు సీడబ్ల్యూసీ అంగీకరించడం వంటి అడ్డంకులు తొలగిపోయాయి. అయినా సరే.. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదన్నది కేసీఆర్ సర్కారు ప్రశ్న.

Also Read: గోడ దూకేస్తారా? తెలంగాణ బీజేపీలో దుమారం, పార్టీని హడలెత్తిస్తున్న ఆ నలుగురు సీనియర్లు

ఇప్పటికే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవాన్ని రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు దానికి జాతీయ హోదాను అస్త్రంగా చేసుకొని మోదీని టార్గెట్ చేసేందుకు సిద్ధమైంది. మరి దీనికి ప్రధాని మోదీ కౌంటర్ ఇస్తారా? లేదంటే ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించి కేసీఆర్ సర్కారును డిఫెన్స్‌లోకి నెడతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు