ODI World Cup 2023 Prize Money : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌కు రూ.33 కోట్లు.. ర‌న్న‌ర‌ప్‌కు ఎంతిస్తారంటే..?

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఈ మెగాటోర్నీలో విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు ఎంత మొత్తం ప్రైజ్‌మ‌నీగా ల‌భించ‌నుంది..? ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు ఎంత ఇస్తారు..?

ODI World Cup 2023 prize money detalis

ODI World Cup 2023 : భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) 2023 జ‌ర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీలో విజ‌యం సాధించేందుకు అన్ని జ‌ట్లు త‌మ అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకున్నాయి. మ‌రీ ఈ మెగాటోర్నీలో విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు ఎంత మొత్తం ప్రైజ్‌మ‌నీగా ల‌భించ‌నుంది..? ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు ఎంత ఇస్తారు..? సెమీఫైన‌ల్‌లో ఓడిన జ‌ట్ల‌కు, గ్రూపు స్టేజీలోనే నిష్ర్క‌మించిన జ‌ట్ల‌కు ఏమ‌న్నా న‌గ‌దును ఇస్తారా..? అనే ప్ర‌శ్న‌లు స‌గ‌టు క్రీడాభిమాని మ‌దిలో మెదులుతూనే ఉంటాయి.

వీటికి సమాధానాలు దొరికేశాయి. అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ప్రైజ్‌మ‌నీ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. మొత్తం ప్రైజ్‌మ‌నీ ఈ సారి రికార్డు స్థాయిలో 10 మిలియ‌న్ల యూఎస్ డాల‌ర్లుగా నిర్ణ‌యించింది. భార‌త క‌రెన్సీలో సుమారు రూ.83 కోట్లు. ఈ ప్రైజ్‌మ‌నీ నుంచి విజేత‌కు, ర‌న్న‌ర‌ప్‌కు, సెమీస్‌కు చేరుకున్న జ‌ట్ల‌కు, గ్రూపు స్టేజీల్లోనే ఇంటి ముఖం ప‌ట్టిన జ‌ట్ల‌కు ఎంతిస్తారో ఇప్పుడు చూద్దాం.

విజేత‌కు రూ.33 కోట్లు

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు 4 మిలియ‌న్ యూఎస్ డాల‌ర్లు అంటే భార‌త క‌రెన్సీలో సుమారు రూ.33 కోట్ల 17ల‌క్ష‌లు ప్రైజ్‌మ‌నీగా ద‌క్క‌నుంది. ఇక ర‌న్న‌ర‌ప్‌కు 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.16 కోట్లు) ల‌భించ‌నుంది. సెమీ ఫైన‌ల్‌లో ఓడిన రెండు జ‌ట్ల‌కు ఒక్కొ జ‌ట్టుకు 8ల‌క్ష‌ల యూఎస్ డాల‌ర్లు (సుమారు రూ.6కోట్ల 63 ల‌క్ష‌లు), ఇక గ్రూపు స్టేజీలోనే ఇంటి ముఖం ప‌ట్టిన జట్ల‌కు ఒక్కొ జ‌ట్టుకు ల‌క్ష యూఎస్ డాల‌ర్లు (సుమారు రూ.82ల‌క్ష‌ల 92 వేలు). గ్రూపు స్టేజీలో మ్యాచ్‌లో విజయం సాధించిన జ‌ట్టుకు 40 వేల యూఎస్ డాల‌ర్లు (సుమారు రూ.33లక్ష‌ల 17వేలు) ప్రోత్సాహ‌కంగా అందుతుంది.

మొత్తం 48 మ్యాచులు..

అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఇంగ్లాండ్‌, గ‌త ర‌న్న‌ర‌ప్ న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మొద‌టి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. 45 లీగ్ మ్యాచులు, మూడు నాకౌట్ మ్యాచ్‌లు క‌లిపి మొత్తం 48 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 10 జ‌ట్లు (టీమ్ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్) క‌ప్పు కోసం పోటీ ప‌డ‌నున్నాయి.

Suryakumar Yadav : బంతి రంగు ఒకేలా ఉంది.. జట్లు ఒకేలా ఉన్నాయి.. బౌల‌ర్లు వారే.. అయితే..

ట్రెండింగ్ వార్తలు