Sunil Gavaskar: టీమిండియాలో ఎవరు ఉండాలో, ఉండొద్దో చెప్పడానికి మీరెవరండీ?: సునీల్ గవాస్కర్

వారు చేస్తున్న వ్యాఖ్యలకు మన మీడియా ప్రాధాన్యం ఇస్తూ.. ప్రసారం చేస్తుండడం విచారకరమని చెప్పారు.

Sunil Gavaskar

Sunil Gavaskar – World Cup 2023: ఓ వైపు ఆసియా కప్-2023 (Asia Cup 2023) జరుగుతుండగా మరోవైపు వన్డే ప్రపంచ కప్-2023కు తమ జట్లను పలు దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. భారత జట్టు కూర్పుపై పాకిస్థాన్, ఆస్ట్రేలియా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు పలు వ్యాఖ్యలు చేశారు. కూర్పు బాగోలేదని కొందరు అన్నారు. దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు.

‘వారు చేస్తున్న వ్యాఖ్యలకు మన మీడియా ప్రాధాన్యం ఇస్తూ ప్రసారం చేస్తుండడం విచారకరం. పాకిస్థాన్, ఆస్ట్రేలియా క్రికెటర్లు కొందరు మన జట్టులో ఎవరు ఉంటే బాగుంటుందో చెబుతున్నారు. దీని గురించి వారికి ఎందుకు? ఇది వారి పని కాదు కదా? అయినప్పటికీ మన మీడియాలో వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్టులో ఎవరెవరు ఉండాలో భారత ఆటగాళ్లు ఏమీ చెప్పడం లేదు కదా? పాకిస్థాన్ దృష్టిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంటే బాబర్ అజాం ఎప్పటికీ గొప్ప ఆటగాడే. అలాగే, పాక్ దృష్టిలో చాలా మంది కంటే షాహీన్ అఫ్రిదీ గొప్ప ప్లేయర్. సచిన్ టెండూల్కర్ కంటే ఇంజమామ్ ఉల్ హక్ బెటర్.

మనకంటే వారి ఆటగాళ్లే వారికి ఎల్లప్పటికీ గొప్ప. వారి ప్రేక్షకులకు ఇదే విధంగా పాక్ మీడియా చెప్పాల్సి ఉంటుంది. అటువంటి వారి వార్తలకు మీ పేపర్లలో చోటు ఇవ్వకండి. ఇతర దేశాల సూచనలు మనకు అవసరం లేదు’ అని సునీల్ గవాస్కర్ అన్నారు.

TeamIndia Players Indoor Nets Session: పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్స్.. ఫొటోలు వైరల్

ట్రెండింగ్ వార్తలు