KTR : కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, మైగ్రేషన్, స్కామ్‌లు.. బీఆర్ఎస్ అంటే సాగునీళ్లు, ఇరిగేషన్, స్కీమ్‌లు- కేటీఆర్ సెటైర్లు

రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ కు అధికారం ఇవ్వాలి. కేంద్రంలో మన ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడొద్దు. KTR

KTR Satires On Congress (Photo : Twitter)

KTR Satires On Congress : వనపర్తి బహిరంగ సభలో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, మైగ్రేషన్ అన్న కేటీఆర్.. బీఆర్ఎస్ అంటే సాగునీళ్లు, ఇరిగేషన్ అని చెప్పారు. కాంగ్రెస్ చేసేవి స్కామ్ లు, బీఆర్ఎస్ చేసేవి స్కీమ్ లు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీవీ వ్యారంటీ లేని గ్యారెంటీలు అని విమర్శించారు. మరోసారి బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఎవరూ చేయని అభివృద్దిని సీఎం కేసీఆర్ చేశారని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు కేటీఆర్.

కాంగ్రెస్ ను నమ్ముకుంటే 3గంటల కరెంటు ఖాయం..
”కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉంది. కాంగ్రెస్ ను నమ్ముకుంటే 24 గంటల కరెంటు పోయి 3గంటల కరెంటు ఖాయం. నల్లా నీళ్లు బందై నీళ్ల కోసం ఎదురుచూడాలి. పాలమూరుకు వస్తున్న ప్రధాని మోదీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలి. కృష్ణా నీటిలో తెలంగాణ వాటా 575 టీఎంసీలు కేటాయించాలి. తెలంగాణ అంటే మోదీకి ఎందుకు కక్ష. వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా కోసం రెండు సార్లు తీర్మానం పంపినా పట్టించుకోలేదు.

నది పక్కన నేలలున్నా ఏ ప్రభుత్వం కూడా నీళ్లివ్వలేదు..
రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ కు అధికారం ఇవ్వాలి. కేంద్రంలో మన ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడొద్దు. గులాబీ జెండా ఎగిరేసే వరకు పాలమూరును పట్టించుకోలేదు. జిల్లాను దత్తత తీసుకున్నోళ్లు కూడా దగా చేశారు. జిల్లా నుండి 14 లక్షల మంది వలసపోతుంటే ఏ ముఖ్యమంత్రీ పట్టించుకోలేదు. నది పక్కన నేలలున్నా ఏ ప్రభుత్వం కూడా నీళ్లివ్వలేదు. ఆర్డీఎస్ తూములు పగులగొట్టి నీళ్లు తీసుకుపోతున్నా పట్టించుకోలేదు. అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే హారతులిచ్చి పంపారు దగుల్బాజీ కాంగ్రెస్ నేతలు.

Also Read..Bhatti Vikramarka: కేసీఆర్ గ్లోబెల్ ప్రచారానికి తెరలేపారు.. కేటీఆర్, హారీశ్ రావు, కవితనేమో..: భట్టి విక్రమార్క

కాంగ్రెస్ తీరు.. హంతకులు సానుభూతి చూపినట్లుంది..
నాడు మనిషి చనిపోతే స్నానాలు చేయడానికి నీళ్లు లేని పరిస్థితి. రైతులను ఆదుకుని రైతుబంధుతో అండగా నిలిచింది కేసీఆర్ ప్రభుత్వమే. ఇంటింటికి నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్ ది. ఆడపిల్లల పెళ్లికి లక్ష 116 రూపాయలు ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. రైతుభీమా పథకం కింద వనపర్తి జిల్లాలో 1400 మంది రైతులకు రూ.5లక్షల సాయం అందించారు. 11 సార్లు అధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టీ సమస్యల గురించి మాట్లాడటం హంతకులు సానుభూతి చూపినట్లుంది.

పదవి కోసం ఉద్యమాలు చేయలేదు..
వస్తదో రాదో తెలియని తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర మాది. పదవుల కోసం కాదు ప్రాంతం సమస్యలు తీరాలని కొట్లాడారు. మంత్రి పదవి ఆశించి వారు ఉద్యమం చేయలేదు. వనపర్తిలో లక్ష 25 వేల ఎకరాలకు నీళ్లొచ్చాయంటే అది నిరంజన్ రెడ్డి ఘనత, కేసీఆర్ ఆశీస్సుల వల్లే సాధ్యమైంది. డిగ్రీ కాలేజీ కోసం ధర్నాలు చేసిన స్థితి నుండి వనపర్తికి మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చాయని గర్వంగా గల్లా ఎగరేసి చెప్పొచ్చు.

65ఏళ్లలో చేయని పనిని ఐదేళ్లలో చేసి చూయించారు..
180 కోట్లతో నూతన ఆసుపత్రిని నిర్మించారు. వనపర్తిని జిల్లా చేసి కలెక్టరేట్ నిర్మించారు. పీర్ల గుట్ట డబల్ బెడ్రూం ఇళ్లు బంజారాహిల్స్ లోని ఇళ్లను తలపిస్తున్నాయి. 3వేల 280 డబల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారు. ఐటీఐ, కేజీబీవీ, వ్యవసాయ డిగ్రీ కళాశాలలు నిర్మించారు. ఇంటి పెద్దలా నిరంజన్ రెడ్డి వనపర్తిని అభివృద్ది చేస్తున్నారు. 65ఏళ్లలో చేయని పనిని ఐదేళ్లలో చేసి చూయించారు.

Also Read..Komatireddy Venkata Reddy : ప్రభుత్వం ఆ పని చేస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేసీఆర్ కుడి భుజంగా తెలంగాణ జెండా ఎత్తి గ్రామ గ్రామాన తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు అభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్నారు. సిరిసిల్ల, సిద్దిపేట మాదిరిగా అత్యధిక మెజారిటీతో నిరంజన్ రెడ్డి మళ్లీ గెలిపించాలి” అని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్.

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కామెంట్స్..
ప్రతి ఎకరాకు సాగునీళ్లు. రూ.22 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణం. సిరిసిల్ల, సిద్దిపేటతో పోటీపడి వనపర్తిని అభివృద్ది చేస్తా. మీరిచ్చిన విజయానికి కృతజ్ఞతగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేశా. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వనపర్తిలో అనూహ్యమైన అభివృద్ది. ఐటీ టవర్ నిర్మాణానికి జీఓ విడుదల చేసిన కేటీఆర్ కు ధన్యవాదాలు. 75వేల ఎకరాలకు నీళ్లిచ్చిన తర్వాతనే నామినేషన్ వేస్తానని మాటిచ్చి నిలబెట్టుకుని నామినేషన్ వేశా.
ఇప్పుడు లక్ష 25 వేల ఎకరాలకు సాగునీళ్లు తీసుకొచ్చాను. ప్రభుత్వ సహకారంతో అనేక విద్యాసంస్థలు తీసుకొచ్చా. మీ ఆశీస్సులతో మరింత అభివృద్ది చేస్తా.

వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభలో మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, వీఎం అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు, జడ్పీ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు