Jagtial Constituency: జగిత్యాలలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీకి దిగుతున్నారు.. పార్టీలు వేస్తున్న లెక్కలేంటి?

జగిత్యాలలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను చూసుకుంటే.. ఈసారి టఫ్ ఫైట్ ఖాయమనిపిస్తోంది. బీజేపీ రేసులో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

Jagtial assembly constituency ground report

Jagtial Assembly constituency: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. జగిత్యాల రాజకీయం రసవత్తరంగా మారింది. గత ఎన్నికలే తనకు చివరి ఎన్నికలంటూ తేల్చి చెప్పిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy).. ఈసారి బరిలోకి దిగుతారా? అనేదే ఆసక్తి రేపుతోంది. మరోవైపు.. ఓసారి ఓడి, మరోసారి గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay Kumar).. మళ్లీ విజయం సాధిస్తారా? కాస్త ఊపు మీదున్న బీజేపీ తరఫున ఈసారి జగిత్యాల బరిలో దిగేదెవరు? జగిత్యాల గడ్డపై గెలుపు జెండా ఎగరేసేందుకు పొలిటికల్ పార్టీలు వేస్తున్న లెక్కలేంటి? వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ పట్టు నిలుపుకుంటుందా? కంచుకోటను మళ్లీ చేజిక్కించుకునేందుకు.. కాంగ్రెస్ వ్యూహాలేంటి? ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలో నిలవబోతున్నారు? జగిత్యాల సీటులో ఈసారి కనిపించబోయే సీనేంటి?

రాజకీయ చైతన్యం ఉన్న నియెజకవర్గమే కాదు.. ఉద్యమాల పురిటిగడ్డ జగిత్యాల. హక్కుల కోసం నినదిస్తు నాడు సాగిన జగిత్యాల జైత్రయాత్ర.. అనేక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఒకప్పుడు కల్లోలిత ప్రాంతంగా కనిపించిన జగిత్యాల.. ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌గా మారిపోయింది. అయినప్పటికీ.. ఇక్కడ ఎప్పుడూ ఏదో ఓ అంశంపై ఆందోళనలు, నిరసనలు కొనసాగుతుంటాయి. ఇదే.. ఇక్కడి జన చైతన్యానికి నిదర్శనం. రైతాంగ చైతన్యమే కాదు.. రాజకీయ చైతన్యమూ ఇక్కడ ఎక్కువే. అయితే.. జగిత్యాల రాజకీయమంతా ముగ్గురు కీలక నేతల చుట్టే తిరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, జీవన్ రెడ్డి, ఎల్.రమణ (L Ramana) ఇద్దరూ.. ఇప్పుడు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో.. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో.. సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై.. డాక్టర్ సంజయ్ 61 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. తర్వాత.. జీవన్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇక.. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎల్.రమణ తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు జగిత్యాలకు ఎమ్మెల్యేతో పాటు.. అదే ప్రాంతం నుంచి ఇద్దరు కీలక నేతలు.. ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దశాబ్దకాలంగా.. జగిత్యాల పాలిటిక్స్ మొత్తం.. ఈ ముగ్గురు లీడర్ల చుట్టే తిరుగుతున్నాయ్.

జగిత్యాల సెగ్మెంట్‌లో జగిత్యాల మండలంతో పాటుగా రాయికల్, సారంగపూర్, భీర్పూర్ మండలాలున్నాయి. నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల 14 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో బీసీ ఓటర్లే అధికం. ముఖ్యంగా పద్మశాలిలు 26 వేలు, మున్నూరు కాపులు 23 వేలు, మైనారిటీలు 30 వేలు, ముదిరాజులు 18 వేలు, దళితులు… 28 వేలకు పైనే ఉన్నారు. వీళ్ల ఓట్లే.. ఇక్కడి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తుంటాయి. 2014 ఎన్నికల్లో మైనార్టీలు కాంగ్రెస్‌ని ఆదరించారు. తర్వాత టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడంతో.. గత ఎన్నికల్లో కారు పార్టీ అభ్యర్థి సంజయ్ కుమార్ 60 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. దాంతో.. ఈసారి మైనార్టీల ఓట్ల మీదే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫోకస్ చేశాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. మైనార్టీ ఓట్లను రాబట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కూడా ఓట్ బ్యాంక్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే.. జగిత్యాలలో భారీ సంఖ్యలో మైనారిటీ ఓట్లు ఉండటం.. బీజేపీకి మైనస్ అయ్యే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (Photo: Facebook)

బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. రెండోసారి కూడా గెలుపుపై ధీమాగా ఉన్న ఆయన.. ఈసారి గతంలో కంటే భారీ మెజారిటీతో విజయం సాధించాలని చూస్తున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ తప్ప మరో పార్టీకి అవకాశం లేని పరిస్థితుల్లో.. జగిత్యాలలో తొలిసారి గులాబీ జెండా ఎగరేశారు డాక్టర్ సంజయ్ కుమార్. ఇక.. టీడీపీని వీడి బీఆర్ఎస్‌లో చేరిన ఎల్.రమణ ఎమ్మెల్సీ అవడం, ఆయన సామాజికవర్గం నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉండటం.. సంజయ్‌కి రాబోయే ఎన్నికల్లో బాగా ప్లస్ కానుంది. పైగా.. రమణతో.. సంజయ్‌కి మొదట్నుంచి ఉన్న సాన్నిహిత్యం కూడా సంజయ్‌కి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. జగిత్యాలలో జరిగిన అభివృద్ధే.. తనను గెలిపిస్తుందనే ధీమా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Photo: Facebook)

మరోవైపు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈసారి జగిత్యాలలో కాంగ్రెస్ గెలుపుపై నమ్మకంగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో.. తనకవే చివరి ఎన్నికలంటూ ప్రచారం సాగించినా.. ఓటమి పాలయ్యారు. కానీ.. ఈసారి.. అప్పుడు చెప్పిన మాటను.. మూట గట్టి.. గోదావరిలోకి విసిరేసి.. ఈసారి మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా.. మైనార్టీల ఓట్ల మీదే జీవన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. తన కంచుకోటలో.. మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా జీవన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. హస్తం పార్టీ నుంచి టికెట్ రేసులో ఎక్కువ మంది నేతలు లేకపోవడంతో.. ఈసారి కూడా బరిలోకి దిగబోయేది జీవన్ రెడ్డేనని తేలిపోయింది. అయితే.. ఆయనే పోటీ చేస్తారా? రాజకీయ వారసుడిని రంగంలోకి దించుతారా? అనే చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని జీవన్ రెడ్డి చెబుతున్నారు. జగిత్యాలలో ఈసారి ఎగిరేది కాంగ్రెస్ జెండానే అంటూ ఫుల్ ధీమాగా ఉన్నారు ఈ సీనియర్ పొలిటీషియన్.

Also Read: బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఢీకొట్టేదెవరు.. ఈసారి హ్యాట్రిక్ కొడతారా?

ముదుగంటి రవీందర్ రెడ్డి (Photo: Facebook)

ఇక.. జగిత్యాలలో ఈసారి తన బలం చూపించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగే బీజేపీకి.. జగిత్యాలలో ఉన్న మైనార్టీల ఓట్ బ్యాంక్ మైనస్‌గా మారే అవకాశముంది. దాంతో.. బీసీ ఓటర్లందరినీ తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు కాషాయం పార్టీ నేతలు. ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనేందుకు.. కమలం పార్టీ నుంచి ఎవరూ బరిలోకి దిగుతారన్నదే ఆసక్తి రేపుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన ముదుగంటి రవీందర్ రెడ్డి (Muduganti Ravinder Reddy)తో పాటు బీఆర్ఎస్‌ని బీజేపీలో చేరిన మున్సిపల్ మాజీ ఛైర్మన్ భోగ శ్రావణి (Boga Shravani), రైతు సంఘం నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి, డాక్టర్ శైలేందర్ రెడ్డి, మదన్ మోహన్.. లాంటి వాళ్లంతా.. టికెట్ రేసులో ఉన్నారు. ఎవరికి వారు.. టికెట్ తమకే దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. జగిత్యాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని.. బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

Also Read: తనయుడి కోసం పోటీ నుంచి తప్పుకోనున్న సిట్టింగ్ ఎమ్మెల్యే.. జూనియర్ జువ్వాడి సైతం..

బోగ శ్రావణి (Photo: Facebook)

జగిత్యాలలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను చూసుకుంటే.. ఈసారి టఫ్ ఫైట్ ఖాయమనిపిస్తోంది. బీజేపీ రేసులో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇక.. జగిత్యాల ప్రజలు.. ఇదే ఫైనల్ చాన్స్ అంటున్న జీవన్ రెడ్డి వైపు నిలబడతారా? మరో చాన్స్ అంటున్న సంజయ్‌కి మద్దతుగా ఉంటారా? అన్నదే.. ఆసక్తి రేపుతోంది. జగిత్యాలను మళ్లీ కాంగ్రెస్ కంచుకోటగా మార్చేందుకు.. జీవన్ రెడ్డి ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి? పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ఎలాంటి ప్రణాళికలు అమలు చేయబోతున్నారు? ఓవరాల్‌గా జగిత్యాల సీటులో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు