On Past Conflicts With Gautam Gambhir Virat Kohli Clear Message To BCCI
Virat Kohli – Gautam Gambhir : టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించగానే ఇక విరాట్ కోహ్లీ పని ఖతం అని చాలా మంది వ్యాఖ్యానించారు. కోహ్లీకి జట్టులో చోటు కష్టమేనని, ఒక్క మ్యాచ్‌లో విఫలమైనా గానీ ఇక అంతేనన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీకి, గౌతమ్ గంభీర్‌కు మధ్య చోటు చేసుకున్న సంఘటనలే ఇందుకు కారణం. అయితే.. అవన్నీ గతం అని, ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇద్దరూ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. అయినప్పటికీ అభిమానుల మదిలో ఏ మూలనో ఉన్న సందేహాలు మాత్రం పోలేదు.
వాస్తవానికి శ్రీలంక పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విశ్రాంతి తీసుకోవాలని భావించారు. అయితే.. గంభీర్ మాత్రం తన తొలి పర్యటన నేపథ్యంలో సీనియర్లు లేకుండా వెళ్లేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో గంభీర్ అడుగగానే రోహిత్‌తో పాటు కోహ్లీలు మరో మాట లేకుండానే అంగీకరించారు. దీంతో వారిద్దరిని వన్డే జట్టులోకి బీసీసీఐ తీసుకుంది. ఈ క్రమంలో బీసీసీఐ ఎదుట విరాట్ కోహ్లీ చెప్పిన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి.
గతంలో ఇద్దరి మధ్య జరిగిన విషయాల్లో ఆందోళన అవసరం లేదని బీసీసీఐకి కోహ్లీ చెప్పాడు. కోచ్‌గా ఉన్న గంభీర్‌కు ప్లేయర్‌గా ఉన్న తాను పూర్తి సహకారం అందిస్తానని తెలిపాడు. ఇక ఇద్దరి లక్ష్యం కూడా టీమ్ఇండియాను ముందుకు తీసుకువెళ్లడమేనన్నాడు. ఈ విషయంలో బీసీసీఐకి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, తాను పూర్తి బాధ్యత వహిస్తానని కోహ్లీ చెప్పినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఐపీఎల్ 2023లో లక్నోసూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్ ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ తరువాత ఐపీఎల్ 2024 సీజన్ సమయంలో ఇద్దరూ ఒకరినొకరు కౌగలించుకుని.. తమ మధ్య ఉన్న విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
Ishan Kishan : ఇషాన్ కిషన్ దారెటు..? టీమ్ఇండియాలో రీ ఎంట్రీ కష్టమేనా..? ఒక్కటే మార్గం..!