Telangana Politics : తెలంగాణ అడ్డాలో బీఆర్‌ఎస్ పార్టీని ఢీకొట్టే మొనగాడు ఎవరు.. అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్.. కొత్త టీంతో బీజేపీ?

రాజకీయంగా ఎత్తుగడలు వేయడంలో దిట్టగా చెప్పే కేసీఆర్.. ప్రభుత్వపరంగా కూడా వేగం పెంచారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమయ్యేలా సీనియర్లు అడుగులు వేస్తున్నారు. బీజేపీ కూడా నాయకత్వాన్ని మార్చి కొత్త టీంతో ఎన్నికలను ఎదుర్కోవాలనే ఆలోచన చేస్తోంది.

telangana elections 2023 parties strategies

Telangana Politics –  Elections 2023 : తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెమ్మదిగా హీటెక్కుతోంది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమైతే మరో ఆర్నెల్లు.. ఆలస్యమైతే వచ్చే జనవరిలో తెలంగాణలో ఎన్నికల కురుక్షేత్రం జరగనుంది. అంటే మరో 200 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. ఈ రణక్షేత్రంలో గెలిచి అధికారం కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీలన్నీ వ్యూహరచన చేస్తున్నాయి. ఉద్యమపార్టీగా గెలిచి అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ (BRS Party) జాతీయ పార్టీగా మారింది. మూడోసారి గెలిచి తెలంగాణ అడ్డాలో తనను ఢీకొట్టే మొనగాడు ఎవరూ లేరని నిరూపించుకోవాలని చూస్తోంది బీఆర్‌ఎస్. ఇక అధికార బీఆర్‌ఎస్‌ను ఈ సారి ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్, బీజేపీ ఎత్తులు వేస్తున్నాయి. ఈ బ్యాటిల్ ఫీల్డ్‌లో ఎవరు ఏ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారో ఇప్పుడు చూద్దాం..

వ్యూహాలకు పదునుపెడుతున్న ప్రధాన పార్టీలు
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల రణరంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ వ్యూహాలను పసిగట్టిన కాంగ్రెస్ కూడా ఆపరేషన్ ఆకర్ష్‌తో ఎన్నికలకు రెడీ అవుతోంది.

కర్ణాటక ఫలితాలు ఇచ్చిన జోష్‌తో అనూహ్యంగా పుంజుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడా అదే జోరు చూపించాలని ఉబలాటపడుతోంది. ఇక కమలదళం ఎన్నికలకు కొత్త బృందం రెడీ చేస్తోంది. బీఆర్‌ఎస్ వ్యూహాలను ఎరిగిన సీనియర్ నేత ఈటలను పూర్తిస్థాయిలో రంగం దింపాలని ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ లోతు ఎరిగిన డీకే అరుణకు కొత్త బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ స్పీడ్‌కు హ్యాండ్ బ్రేక్ వేయాలని అనుకుంటోంది. ఇలా మూడు పార్టీలూ ఎన్నికల దిశగానే వ్యూహాలు పన్నుతూ.. పావులు కదుపుతుండటంతో కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది.

అభివృద్ధి నినాదంతో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ ప్లాన్
తెలంగాణ అభివృద్ధి నినాదంతో హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తోంది. మూడోసారి గెలిచి తెలంగాణలో తిరుగులేదని నిరూపించుకోవాలని సర్వశక్తులూ వాడుతోంది. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉండటంతో సహజంగా కనిపించే ప్రజావ్యతిరేకతను అదుపు చేసి.. ప్రజాకర్షక పథకాలకు శ్రీకారం చుట్టాలని బీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. జిల్లాల వారీగా రాజకీయ ఎత్తుగడులు వేస్తూ ఎక్కడెక్కడ ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో క్యాడర్‌కు నిర్దేశిస్తూ జోరు చూపిస్తున్నారు కేసీఆర్.

Also Read: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ అసంతృప్తి నేత శ్రీహరి రావు?

ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను గుర్తించిన కేసీఆర్.. వారికి ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను కూడా రెడీ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో కనీసం 30 మందికి మళ్లీ టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదని బీఆర్‌ఎస్ పార్టీ వర్గాల సమాచారం. గతంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇందుకు ప్రధాన ఆధారంగా చూపుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఆర్నెల్లు సమయం ఉన్నందున ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న శాసనసభ్యులు ప్రజల్లోకి వెళ్లి.. సానుకూలత పెంచుకోవాలని సీఎం అలా చెప్పివుంటారని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికల సన్నాహాల్లో భాగంగానే సీఎం ఈ కీలక వ్యాఖ్యలు చేయడంతో బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనేది స్పష్టమవుతోంది.

వేగం పెంచిన కేసీఆర్
రాజకీయంగా ఎత్తుగడలు వేయడంలో దిట్టగా చెప్పే కేసీఆర్.. ప్రభుత్వపరంగా కూడా వేగం పెంచారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. వచ్చే ఎన్నికల్లో నెగ్గేందుకు ఇప్పటికే ఉన్న పథకాలకు తోడుగా కొత్త పథకాలను ప్రకటిస్తోంది. బీసీలు, చేతివృత్తుల వారికి లక్ష ఆర్థిక సాయం చేయడంతో పాటు దివ్యాంగుల పింఛన్‌ను వెయ్యి రూపాయలు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను ప్రభావితం చేసేలా ట్రిపుల్‌వన్ జీవో ఎత్తివేతకు గత క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. వరుసగా జిల్లాల పర్యటలు చేసి అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇప్పటికే విద్య, వైద్యం, విద్యుత్ రంగాల్లో గణనీయ అభివృద్ధి చేశామని లెక్కలు చెబుతూ.. భవిష్యత్‌లో చేయబోయే పథకాలను ప్రకటిస్తూ జనాకర్షక మంత్రం జపిస్తున్నారు ముఖ్యమంత్రి.

Also Read: జగిత్యాలలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీకి దిగుతున్నారు.. పార్టీలు వేస్తున్న లెక్కలేంటి

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న హామీలు.. చేస్తున్న ప్రకటనలతో బీఆర్‌ఎస్ క్యాడర్ హుషారుగా కనిపిస్తోంది. గత ఎన్నికల సందర్భంగా సిట్టింగులు అందరికీ టిక్కెట్లు ఇచ్చిన సీఎం.. ఈ సారి కొత్తవారికి చాన్స్ ఇవ్వనున్నట్లు చూచాయగా చెప్పడంతో చాలా మంది నాయకుల్లో ఆశలు చిగురించాయి. ఇలా కొత్తగా టిక్కెట్లు ఆశిస్తున్నవారు.. ఇప్పటికే ఉన్న సిట్టింగులు క్షేత్రస్థాయిలో పర్యటనలకు శ్రీకారం చుడుతూ ఎన్నికల వాతావరణాన్ని గ్రామస్థాయికి తీసుకుపోతున్నారు. సీఎం ప్రకటనలు, పర్యటనలతో బీఆర్ఎస్ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోగా.. అటు కాంగ్రెస్ కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఇతర సీనియర్లు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమయ్యేలా అడుగులు వేస్తున్నారు. బీజేపీ కూడా నాయకత్వాన్ని మార్చి కొత్త టీంతో ఎన్నికలను ఎదుర్కోవాలనే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఈ దిశగా మంతనాలు మొదలయ్యాయి.

ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్న ప్రధాన పార్టీలు.. వివరాలకు ఈ వీడియో చూడండి..

ట్రెండింగ్ వార్తలు