Ysrcp Star Campaigners : ఎన్నికల ప్రచారంలో కొత్త ట్రెండ్‌కు జగన్ శ్రీకారం.. ఇంతవరకు ఏ పార్టీ చేయని సాహసం

సింహం సింగిల్‌గానే వస్తుందంటూ పొత్తు రాజకీయాలకు దూరంగా ఉన్న సీఎం జగన్‌.. ప్రచారంలోనూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.

Ysrcp Star Campaigners : సామాన్యులే.. స్టార్ క్యాంపెయినర్లుగా ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది అధికార వైసీపీ. చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసానికి పూనుకుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తన పథకాల లబ్ధిదారులతో ప్రచార బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల కమిషన్‌కు కూడా స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను అందజేసి… అనుకున్నామంటే.. చేసేస్తాం… అంటూ దూసుకుపోతోంది.

ప్రచారంలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సీఎం జగన్‌..
ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లంటే రాజకీయాలు ఔపోసన పట్టిన నేతలు, రాజకీయ ఉద్ధండులు, పెద్ద కాన్వాయ్‌తో వచ్చి ప్రసంగాలతో ఊదరగొట్టే నేతలే కళ్ల ముందు కదలాడుతుంటారు. అయితే ఏపీ సీఎం జగన్‌ ఈ తరహా ఎన్నికల హంగామాకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ పొత్తు రాజకీయాలకు దూరంగా ఉన్న సీఎం జగన్‌.. ప్రచారంలోనూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లు జగన్‌ ఒక్కరే మొత్తం ప్రచారాన్ని తన భుజస్కందాలపై వేసుకుని నడుపుతుండగా, ఇప్పుడు తనకు తోడుగా కొందరు సామాన్యులను తెరపైకి తెచ్చారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా లబ్ధిపొందిన సామాన్యుల నుంచి 12 మందిని తనకు స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రకటించారు..

పథకాల లబ్ధిదారులతో ఎన్నికల ప్రచారం..
సంప్రదాయ రాజకీయ పార్టీల తరహాలో సీనియర్ నేతలతో స్టార్ క్యాంపెయినింగ్‌ చేయాలనే ఆలోచనకు దూరంగా ఉండాలని నిర్ణయించారు సీఎం జగన్‌. మంచి జరిగితేనే ఓట్లేయండి అని నిర్మొహమాటంగా చెబుతున్న సీఎం.. తన ప్రభుత్వంలో మంచి జరిగిందని చెబుతున్న సామాన్యులను స్టార్‌ క్యాంపెయినర్లుగా ఎంపిక చేసుకుని ప్రచారం చేయాలని నిర్ణయించడం ద్వారా రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి.. పలు పథకాల ద్వారా లబ్ధి పొందిన సామాన్యులతో ఎన్నికల్లో ప్రచారం చేయించనున్నారు.

ప్రయోగాత్మకంగా 12 మంది ఎంపిక..
తొలిసారి ప్రయోగాత్మకంగా 12 మందిని ఎంపిక చేశారు. ఈ 12 మంది పేర్లతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను తయారు చేసి ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది వైసీపీ అధిష్టానం. జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రచారం చేస్తారు. వీరితోపాటు ఆయా ప్రాంతాల్లో లబ్ధిదారులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది వైసీపీ. గత నెల 28వ తేది నుంచి సీఎం జగన్ చేపట్టిన మలివిడత ప్రచారంలోనే ఈ తరహా స్టార్ క్యాంపెయనర్లు అత్యధికంగా పాల్గొంటునున్నారు.

Also Read : ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌.. భూ యజమానులకు జరిగే మేలేంటి..? ప్రతిపక్షాల ప్రచారంలో నిజమెంత..?

 

ట్రెండింగ్ వార్తలు