ఈసీ నిర్ణయాల వెనుక కుట్ర ఉంది- సజ్జల సంచలన ఆరోపణలు

ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ అంతా టీడీపీ ఆఫీస్ నుండి జరిగాయి. పథకాలకు కాకుండా కాంట్రాక్టులకు డబ్బులు వేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Sajjala Ramakrishna Reddy : రాజకీయ కక్షతో ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ హింసాకాండను ప్రదర్శిస్తోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. టీడీపీ హింసాకాండ, అల్లర్లు సృష్టించినా.. ఈసీ ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు. అల్లర్లు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. వైసీపీ వాళ్లను హౌస్ అరెస్ట్ చేసి ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు.

ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈసీ తీరుపై ఆయన మండిపడ్డారు. రాజకీయ కక్షతో టీడీపీ హింసాకాండ ప్రదర్శిస్తోందన్న సజ్జల.. ఈసీ ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు. ఘర్షణ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల సంఘం ముసుగులో ఏకపక్షంగా ఎన్నికల నిర్వహణ జరిగిందన్నారు సజ్జల. ఎన్నికల సంఘం అధికార, ప్రతిపక్షాలను సమానంగా చూడాలి.. కానీ అలా జరగలేదని వాపోయారు.

టీడీపీ, బీజేపీ ఫిర్యాదు ఇవ్వడం.. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చెయ్యడం పథకం ప్రకారం జరిగిందన్నారు. పోలీసు అబ్జర్వర్ పేరుతో వచ్చిన దీపక్ మిశ్రా అధికారులను బెదిరించారని సజ్జల ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ అంతా టీడీపీ ఆఫీస్ నుండి జరిగాయని, వాటికి కావాల్సిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డి సామాజిక వర్గాల అధికారులను మార్చేశారని సజ్జల అన్నారు.

”మా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు, టీడీపీ వాళ్ళను బయట తిరగనిచ్చారు. షెడ్యూల్ విడుదల అయినప్పటి నుండి ఈసీ ఏకపక్షంగానే వ్యవహరించింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ ఈసీ తీరు ఉంది. పథకాలకు కాకుండా కాంట్రాక్టులకు డబ్బులు వేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వంలో రొటీన్ గా జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి.

ఎన్నికలు అయిపోయాక కూడా చంద్రబాబు అపార్థాలు మానలేదు. మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజలు సీఎం జగన్ కు ఆశీస్సులు ఇచ్చారు. 15 రోజుల్లో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ చూస్తోంది. అలాంటి వాటిని ఈసీ అడ్డుకోవాలి. కౌంటింగ్ అయ్యే వరకూ నిష్పక్షపాతంగా ఉండాలి. తప్పు చేసేది, దాడులు చేసేది వాళ్ళు. మళ్ళీ గవర్నర్ కి ఫిర్యాదు అంటున్నారు” అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

Also Read : ఏపీలో జగన్ గెలుస్తున్నారని సమాచారం..! కాంగ్రెస్‌కి వచ్చేది ఒక్కటే- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు