Praja Bhavan Barricades : ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసులో ఊహించని ట్విస్ట్.. ఆసుపత్రిలో సీఐ

ప్రస్తుతం సోహెల్ పరారీలో ఉన్నట్టు సమాచారం. సోహెల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనలో పంజాగుట్ట పోలీసులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బారికేడ్లు ధ్వంసమైన ఘటన కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. కారుతో ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన భోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనలో ప్రమాదం చేసిన షకీల్ కొడుకు సోహెల్ ను తప్పించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి షకీల్ ఇంట్లో పని చేస్తున్న వ్యక్తిని పోలీసులు నిందితుడిగా చేర్చినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఘటన జరిగిన తర్వాత సోహెల్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కు తీసుకెళ్తుండగా పోలీసుల కళ్ళుగప్పి సోహెల్ పరారయ్యాడు. కాగా, తన కొడుకును తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రయత్నించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన రోజు సోహెల్ ను పోలీస్ స్టేషన్ నుంచి షకీల్ అనుచరులు తీసుకెళ్లినట్లు అనుమానాలు ఉన్నాయి.

Also Read : శామీర్‌పేటలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ.. నగలు దోపిడీచేస్తున్న వీడియో వైరల్

ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు సోహెల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఘటన జరిగిన రోజు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే పోలీసులు వాటిని బయటపెట్టడం లేదు. ఈ ఘటనలో పంజాగుట్ట పోలీసులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కొడుకుని తప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేస్తున్నట్లు సమాచారం.

కాగా.. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వ్యవహారంలో సీఐ పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఇన్ స్పెక్టర్ దుర్గారావు అస్వస్థకు గురైనట్లు సమాచారం. దీంతో ఆయనను కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
ప్రజాభవన్‌ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్‌ ముందున్న ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 23న అర్ధరాత్రి తర్వాత కారు వేగంగా దూసుకొచ్చి ప్రజాభవన్‌ ముందున్న బారికేడ్లను ఢీకొట్టింది.

Also Read : పల్లవి ప్రశాంత్ కేసు.. బిగ్‌బాస్ నిర్వాహకులకు పోలీసుల నోటీసులు

ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కారు ముందుభాగం దెబ్బతింది. ప్రమాదం తర్వాత కారులో ఉన్న ఓ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మరో యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. కారులో ముగ్గురు యువతులు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు