Insomnia Pregnant Women : గర్బిణీలు నిద్రలేమి సమస్యను అధిగమించేదెలా!

నిద్రకు ఉపక్రమించిన క్రమంలో శ్వాసకు అసౌకర్యంగా అనిపిస్తే తలను కాస్త ఎత్తుగా పెట్టుకుని పడుకోవాలి. అదే విధంగా కాళ్ల వద్ద కూడా ఎత్తుగా ఉండేలా దిండును ఏర్పాటు చేసుకోవటం వల్ల శ్వాసకు ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు.

Insomnia Pregnant Women : గర్భంతో ఉన్నవారికి నెలలు నిండుతున్న కొద్దీ నిద్ర లేమి సమస్య ఉత్పన్నం అవుతుంది. ఇటీవలి కాలంలో గర్భిణీ స్త్రీలలో సగం కంటే ఎక్కువ మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఆరోగ్యకరమైన గర్భధారణకు రాత్రిసమయంలో మంచి నిద్ర చాలా అవసరం. నిద్ర మెదడును రీసెట్ చేయడానికి, రక్త సరఫరా సరిగా జరిగేలా చూడటానికి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి , రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి సహాయపడుతుంది. అందుకే రాత్రికి కనీసం ఏడు గంటల నాణ్యమైన నిద్ర పోవలన్న లక్ష్యంగా పెట్టుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

గర్భిణీలు నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు తగిన దినచర్యను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. నిద్రకు కనీసం గంట ముందుగా సెల్ ఫోన్, కంప్యూటర్, టీవి వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రశాంతమైన నిద్ర కోసం కుదిరితే పుస్తకం చదవాలి. ఇలా చేస్తే త్వరగా నిద్రలోకి జారుకునే అవకాశాలు ఉంటాయి. గర్భిణులు వెల్లకిలా పడుకోవటం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా కడుపులో ఉన్న శిశువుకు ప్రాణవాయువు సరిగా అందదు. తల్లి వెన్నుకముకపై భారం పడుతుంది. వీలైనంతవరకు పక్కకు తిరిగి పడుకోవటం మంచిది. ఇలా పడుకోవటం అసౌకర్యం అనిపిస్తే పొట్టకు పక్కనే దిండ్లను పెట్టుకోవటం వల్ల సౌకర్యవంతంగా ఉంటుంది. నిద్ర కూడా పడుతుంది.

నిద్రకు ఉపక్రమించిన క్రమంలో శ్వాసకు అసౌకర్యంగా అనిపిస్తే తలను కాస్త ఎత్తుగా పెట్టుకుని పడుకోవాలి. అదే విధంగా కాళ్ల వద్ద కూడా ఎత్తుగా ఉండేలా దిండును ఏర్పాటు చేసుకోవటం వల్ల శ్వాసకు ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు. గర్భంతో ఉన్నవారు భోజనం చేసిన తరువాత కొద్ది సమయం అటుఇటు నడవటం చేయాలి. వైద్యుల సూచనలు, సలహాలు తీసుకుని అవసరమనుకుంటే చిన్నచిన్న వ్యాయామాలు , యోగాసనాలు చేయటం మంచిది. ఇలా చేయటం వల్ల రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్రపడుతుంది.

రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. అయితే నిద్రవేళకు దగ్గరగా ఉన్నప్పుడు నీరు తాగటం తగ్గించటం మంచిది. నిద్రకు ముందు నీరు తాగటం వల్ల మూత్ర విసర్జనకు ఎక్కువసార్లు మేల్కోవాల్సి వస్తుంది. దీంతో నిద్రపోవటం కష్టతరంగా మారుతుంది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అయిల్ ఫుడ్, స్పైసీ ఫుడ్ లకు దూరంగా ఉండటం మంచిది. ఇలాంటి ఆహారాలు గుండెల్లో మంటను కలిగిస్తాయి. దీని వల్ల రాత్రి సమయంలో నిద్రలేమి సమస్య ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకోని తీసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు