Telangana Congress : సీఎం పదవి కన్నా ఆ పోస్టుకే ఎక్కువ డిమాండ్.. కాంగ్రెస్‌లో పదవుల పంచాయితీ, హైకమాండ్‌కు కొత్త తలనొప్పి

సీఎం పదవిని ఆశించిన చాలామంది.. అది కుదిరే పని కాదని తేలిపోవడంతో కనీసం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.

రేవంతే సీఎం. డిప్యూటీ సీఎంగా భట్టి. ఇది ఫైనల్ అయిపోయింది. సీఎంగా రేవంత్ రెడ్డి పేరు తప్ప మరో పేరే వినిపించలేదు. దీంతో ముఖ్యమంత్రి అవుదామన్న కోరిక ఉన్న నేతలంతా కనీసం ఉపముఖ్యమంత్రిగానైనా సరిపెట్టుకుందామని ఉబలాటపడుతున్నారు. మాకంటే మాకంటూ డిప్యూటీ సీఎం పోస్టు కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో తెలంగాణ సీఎం పోస్టు కన్నా డిప్యూటీ సీఎం పోస్టుకే పోటీ ఎక్కువగా కనిపిస్తోంది.

రేవంత్ మంత్రివర్గంలో డిప్యూటీలు ఎందరు? భట్టితో పాటు డిప్యూటీ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరు? తెలంగాణ మంత్రివర్గంపై సస్పెన్స్ నెలకొంది. క్యాబినెట్ లోకి ఎవరెవరిని తీసుకుంటారు? ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్ మంత్రివర్గ సహచరులపై ఉత్కంఠి కొనసాగుతోంది. ముగ్గురు నలుగురు నేతలు డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు. సీఎం పదవిని ఆశించిన చాలామంది.. అది కుదిరే పని కాదని తేలిపోవడంతో కనీసం డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : జడ్పీటీసీ మెంబర్ నుంచి చీఫ్ మినిస్టర్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ ప్రస్థానం

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన పలువురు నేతలు ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్కతో పాటు బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ డిప్యూటీ సీఎం పదవులను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు కీలకమైన పోర్ట్ ఫోలియోతో పాటు ఉపముఖ్యమంత్రి పదవి కావాలని సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఎస్సీ కోటాలో దామోదర రాజనర్సింహ, ఎస్టీ కోటాలో సీతక్కను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. సీతక్కకు మంత్రి పదవి ఖాయమైనప్పటికీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లను అధికంగా గెలుచుకున్నందుకు తమ వర్గానికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని గిరిజన ఆదివాసీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. కాబోయే సీఎం రేవంత్ రెడ్డి కూడా సీతక్క విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ మంత్రివర్గంలో తన ఒక్కడికే డిప్యూటీ సీఎం హోదా ఉండాలని భట్టి విక్రమార్క పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ పెద్దలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. అయితే సీతక్కను డిప్యూటీ సీఎంగా నియమించాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

Also Read : రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఇదే? కాబోయే మంత్రులు వీరేనా?

మరోవైపు సీనియర్ నేత దామోదర రాజనర్సింహ కూడా డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తుండటంతో ఆయనను ఎలా ఒప్పించాలో తెలియక సతమతం అవుతోంది కాంగ్రెస్ హైకమాండ్. ఉమ్మడి రాష్ట్రంలోనే డిప్యూటీగా పనిచేసిన రాజనర్సింహ తెలంగాణలో బలమైన మాదిగ సామాజికవర్గ నేత కావడంతో ఏం చేయాలన్న దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందట. మంత్రులుగా వీరిని నియమించడంలో మరో ఆలోచన లేకపోయినప్పటికీ.. డిప్యూటీ సీఎం పదవులను కేటాయించడంలోనే చిక్కంతా వచ్చి పడిందనే చర్చ సాగుతోంది.

ఇప్పటికే భట్టిని డిసైడ్ చేయడంతో దామోదర రాజనర్సింహను ఒప్పించడమే తలకు మించిన భారంగా మారిందని చెబుతున్నారు. ఇక మైనారిటీ, బీసీ వర్గాల నుంచి ఉపముఖ్యమంత్రి డిమాండ్లు వినిపిస్తున్నాయి. 64మంది ఎమ్మెల్యేలలో ఒక్కరూ మైనారిటీ లేకపోవడం మంత్రివర్గ కూర్పులో ఆ వర్గాన్ని విస్మరించలేని పరిస్థితి ఉండటంతో మైనార్టీ కోటాలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుంది అనే చర్చ జరుగుతోంది. సీనియర్ లీడర్ అయిన షబ్బీర్ అలీని మంత్రిగా నియమించే అవకాశాలను పరిశీలిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. తాను కామారెడ్డిలో పోటీ చేస్తానని అన్నా అధిష్టానం సూచనతో సీటు మారాల్సి వచ్చిందని, లేదంటే లోకల్ నినాదంతో తానే గెలిచే వాడని అంటున్నారు షబ్బీర్ అలీ. దీంతో మైనారిటీ కోటాలో ఉపముఖ్యమంత్రి పదవికి తన పేరును పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు షబ్బీర్ అలీ.

ఇదే విధంగా బీసీల నుంచి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న నేతలు ఎక్కువగానే ఉన్నారు. బీసీల్లో నలుగురు ఐదుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండటంతో అందులో తమను ఉప ముఖ్యమంత్రిని చేయాలని ఒకరిద్దరు అధిష్టానికి విన్నవించారట. మొత్తానికి కాంగ్రెస్ లో సీఎం పదవి కన్నా ఉప ముఖ్యమంత్రి పదవి కోసమే ఎక్కువగా పోటీ నెలకొనడం ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్న నేతలు అందరూ సీనియర్లే కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఈ అంశాన్ని ఎలా డీల్ చేయనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

 

ట్రెండింగ్ వార్తలు