అసెంబ్లీ సమావేశాలకు రావడానికి బీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీశ్ రావు తప్ప ఎవరూ మిగలరు: ఎమ్మెల్యే యెన్నెం

Yennam Srinivas: తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత అప్రోవల్‌గా మారబోతున్నారని తెలుస్తోందని చెప్పారు

బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ సీఎల్పీ మీడియా హాల్లో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఫామ్ హౌస్‌కి పిలిస్తే ఒక్కరు కూడా పోవట్లేదని అన్నారు.

అందరూ ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు కేటీఆర్, హరీశ్ రావు తప్ప ఎవరూ మిగలరని అన్నారు. తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత అప్రోవల్‌గా మారబోతున్నారని తెలుస్తోందని చెప్పారు. ఈ కారణం వల్లే హరీశ్ రావు, కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

దేశంలో మొదటిసారి జ్యూడిషియల్ విచారణ చేయమన్నదే కేసీఆర్ అని, ఇప్పుడే విచారణకు వెళ్లకుండా తప్పించుకున్నారని చెప్పారు. తెలంగాణలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని అన్నారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుకుంటూ ప్రతి నెలా సమయానికి వేతనాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ధరణిని అడ్డు పెట్టుకుని కేసీఆర్ కుటుంబం వేలకోట్ల రూపాయల భూములను కబ్జా చేసిందని ఆరోపించారు. ప్రధాని మోదీ కళ్లలో కళ్లు పెట్టి చూసే ధైర్యం కూడా కేసీఆర్‌కు లేదని చెప్పారు.

 Also Read: నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్న బాధ అందుకే పోయింది: బుద్ధా వెంకన్న

ట్రెండింగ్ వార్తలు