Devaragattu Bunny Fight: బన్నీ ఉత్సవం.. చితక్కొట్టుకున్నారు!

కళ్లలో భక్తి.. కర్రల్లో పౌరుషం.. వెరసి రక్తాభిషేకం.. అదే దేవరగట్టు బన్నీ ఉత్సవం. కర్రలతో దొరికిన వాళ్ళని దొరికినట్లు చితగ్గొడితే దేవుడు కరుణిస్తాడు. ఇదే ఇక్కడి సంప్రదాయం..

Devaragattu Bunny Fight: కళ్లలో భక్తి.. కర్రల్లో పౌరుషం.. వెరసి రక్తాభిషేకం.. అదే దేవరగట్టు బన్నీ ఉత్సవం. కర్రలతో దొరికిన వాళ్ళని దొరికినట్లు చితగ్గొడితే దేవుడు కరుణిస్తాడు. ఇదే ఇక్కడి సంప్రదాయం.. ఆనవాయితీ కూడా. క్షణ క్షణం ఉద్విగ్నభరితంగా సాగే కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం ఈ ఏడాది కూడా అంతే భక్తితో అంతే విశ్వాసంతో అంతే హింసతో నిర్వహించారు. భక్తి, విశ్వాసం ముసుగులో ఏపీలోని కర్నూలు జిల్లా హొలగుంద మండలం దేవరగట్టులో ఏటా కర్రల సమరం నిర్వహించటం ఆనవాయితీ. ఏటా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది.

ఓ వర్గం వారిని మరో వర్గం అడ్డుకోవడం, ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకోవటం వల్ల ఎంతో మందికి తీవ్రగాయాలై మరణించిన ఘటనలూ ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అధికారులు చేపట్టిన చర్యలు ఫలించలేదు. ప్రతీ ఏడాదీ ఈ పండుగ నాడు కనీసం వంద మందికి తగ్గకుండా ప్రతి ఏటా తలలు పగులుతున్నాయి. దీనిపై మానవ హక్కుల కమిషన్ తో పాటు లోకాయుక్త కూడా సీరియస్ అయి కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. అధికారులు, ప్రభుత్వం కళ్ళెదుటే హింస జరుగుతుంటే.. పోలీసులు నియంత్రించలేక పోయారు అంటూ నోటీసులో ప్రశ్నలు కురిపించింది.

అయినా ప్రతి ఏటా దేవరగట్టులో హింస జరుగుతూనే ఉంది. ఈసారి కూడా అదే జరిగింది. ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద కొండపై మాళ మల్లేశ్వర స్వామి ఆలయంలోని మాళమ్మ, మల్లేశ్వరునికి దసరా పర్వదినాన కల్యాణం జరిపించి.. దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. దీనినే ఇక్కడ బన్ని ఉత్సవం అని కూడా పిలుస్తారు. వారి విశ్వాసానికి ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఈ ఏడాది కూడా నిర్వహించారు.

ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలను అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఈ ఏడాది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా.. ఉత్సవంలో ప్రజలు మాత్రం కర్రలతో చితకొట్టుకున్నారు. ఈ సాంప్రదాయ హింసలో వంద మందికిపైగా గాయపడగా.. అందులో తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆదోనికి తరలించారు. సంబరం మాటున సాగే ఈ కర్రల సమరంలో ఏదొక గ్రూపు విజయం సాధించి విగ్రహాలను దక్కించుకున్నా రెండు గ్రూపుల ప్రజల ఒళ్ళు హూనం అయ్యేలా దెబ్బలు మాత్రం కామన్.

ట్రెండింగ్ వార్తలు