ఆ ఆరుగురు అదృష్టవంతులు వీరేనా? త్వరలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..!

సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా? కొత్త వాళ్లను మంత్రి వర్గంలోకి తీసుకుంటారా?

Telangana Cabinet Expansion : ఎంపీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. దీంతో క్యాబినెట్ విస్తరణ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. సీఎం రేవంత్ టీమ్ లో స్థానం దక్కేదెవరికి? ఏయే సామాజికవర్గాలకు ఛాన్స్ దక్కనుంది? సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా? కొత్త వాళ్లను మంత్రి వర్గంలోకి తీసుకుంటారా? సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఉన్న ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు?

కేబినెట్ లో మరో ఆరుగురికి చోటు..
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళైంది. సీఎం రేవంత్ రెడ్డి టీమ్ లో త్వరలో ఆరుగురు కొత్త వాళ్లు చేరబోతున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో 11మంది ఉన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం 15శాతం మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన సీఎంతో పాటు 17మంది మంత్రులు ఉండాలి. ప్రస్తుతం కేబినెట్ లో ముఖ్యమంత్రితో పాటు 11మంది మంత్రులే ఉన్నారు. దీంతో మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

మక్తల్ ఎమ్మెల్యేకి బెర్త్ కన్ ఫర్మ్?
మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. కేబినెట్ లో చోటు కోసం సీనియర్లు, కొత్త వాళ్లు తెగ ఆరాట పడుతున్నారు. అయితే, సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎవరికి వారే తమకు బెర్తు కన్ ఫర్మ్ అని ధీమాగా ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజ్ లకు మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయం అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

వెంకట్ కు మంత్రి పదవి పక్కా?
అయితే ముదిరాజ్ సామాజికవర్గాన్ని లీడ్ చేయగల వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అటు ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ ను క్యాబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ వాయిస్ ను వెంకట్ జనంలోకి బలంగా తీసుకెళ్లారు. దీంతో పాటు వెంకట్ కు సీఎం రేవంత్ రెడ్డితో, పార్టీ అధిష్టానం దగ్గర గుడ్ విల్ ఉంది. ఈ క్రమంలో ఆయనకు మినిస్టర్ పోస్ట్ పక్కా అంటున్నారు.

మున్నూరు కాపు, కురుమ సామాజికవర్గాలకు పెద్ద పీట..!
మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ కు కూడా మినిస్టర్ హోదా దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కురుమ సామాజికవర్గం ఓట్లు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కురుమ సామాజికవర్గానికి చెందిన బీర్ల ఐలయ్యకు మంత్రిపదవి ఇస్తారని జోరుగా చర్చ జరుగుతోంది.

లంబాడ ఎమ్మెల్యేకు మినిస్టర్ పోస్ట్?
మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎస్టీ సామాజికవర్గానికి మినిస్టర్ పోస్ట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. ముఖ్యంగా లంబాడ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అదే జరిగితే దేవరకొండ ఎమ్మెల్యే భాను నాయక్ ని మినిస్టర్ పదవి వరించొచ్చు. లేదా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాకు చెందిన లంబాడ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు దక్కొచ్చు. మరోవైపు మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు మినిస్టర్ పోస్ట్ దక్కే ఛాన్స్ ఉంది. సీఎం రేవంత్ దృష్టిలో వెడ్మ బొజ్జుకు మంచి గుడ్ విల్ ఉండటంతో ఆయనకు మినిస్టర్ పోస్ట్ పక్కా అన్న ప్రచారం జరుగుతోంది.

సుదర్శన్ లేదా షకీల్ కు మంత్రి పదవి?
అటు ఉమ్మడి నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లేదా ముస్లిం మైనారిటీ కోణంలో షబ్బీర్ అలీకి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ గెలిస్తే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు.

మంత్రి పదవుల విషయంలో సీఎం రేవంత్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారా?
ఇదిలా ఉంటే కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆరు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా సమాచారం. ఈ ఆరుగురిని తన కిచెన్ కేబినెట్ గా మార్చుకునేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో నలుగురు ఐదుగురు మినహా మిగతా వారు పార్టీ లైన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ ప్రభుత్వ నిర్ణయాలను, కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో పెద్దగా చొరవ చూపడం లేదనే నిర్ణయానికి రేవంత్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త మంత్రులతో ఈ అంశాలన్నింటిని భర్తీ చేయాలని రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి క్యాబినెట్ బెర్తుల అంశం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రివర్గంలో ఏ సామాజికవర్గానికి? ఏ వ్యక్తికి స్థానం దక్కుతుందో? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : కౌంట్ డౌన్ మొదలైంది..! కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా కేటీఆర్ ఫైర్..

 

 

ట్రెండింగ్ వార్తలు