Minister Roja: రోజాకు ఆ ఐదుగురితో విభేదాలు.. వారికి మంత్రి పెద్దిరెడ్డి అండదండలు!

రాష్ట్ర మంత్రి ఆర్‌కే రోజాకు అసమ్మతి సెగ తప్పడం లేదు. ఆమె సొంత నియోజకవర్గంలోని నలుగురు నేతలు రోజాకు పెద్ద తలనొప్పిగా మారారు.

Minister Roja face challenges from own party leaders in nagari

Minister RK Roja : గ్రూపు తగాదాలు అధికార వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయా? సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుంటున్నా అసంతృప్తులు దారికి రాకపోడానికి కారణమేంటి? మరీ ముఖ్యంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే అసమ్మతి ఎందుకు? మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (chelluboina venu gopala krishna), పినిపే విశ్వరూప్‌లకు (pinipe viswaroop) ఎదురవుతున్న అనుభవమే మంత్రి రోజా నియోజకవర్గంలో విస్తరిస్తుందా? ఫైర్‌బ్రాండ్ పొలిటీషియన్ రోజాపై అసంతృప్తి దేనికి?

రాష్ట్ర మంత్రి ఆర్‌కే రోజాకు అసమ్మతి సెగ తప్పడం లేదు. ఆమె సొంత నియోజకవర్గంలోని నలుగురు నేతలు రోజాకు పెద్ద తలనొప్పిగా మారారు. రోజా మంత్రిగా ఉన్నా లెక్కచేయని నేతలు.. ముఖ్యమంత్రి సమక్షంలోనూ తమ పంతం నెగ్గించుకోడానికే ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న రోజాకు తొలి నుంచి ఐదుగురు నేతలతో విభేదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్నీ సమసిపోతాయని.. ఆగస్టు 28న జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్ అందరికీ నచ్చజెప్పి ఓ దారిలో పెడతారని ఆశించారు వైసీపీ కార్యకర్తలు.

ముఖ్యంగా వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు సురేశ్ రెడ్డి, శ్రీశైలం ఆలయ పాలకమండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి, రైతు సంఘం నాయకులు లక్ష్మీపతి రాజు, పుత్తూరు అమ్ములు, ఈడిగ కార్పొరేషన్ అధ్యక్షులు కేజే శాంతితో మంత్రికి పొసగడం లేదు. వీరికి జిల్లాకు చెందిన మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. శ్రీశైలం పాలకమండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈడిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ శాంతికి మంత్రి రోజా ప్రమేయం లేకుండానే పదవులు దక్కాయని చెబుతున్నారు. తన నియోజకవర్గ నేతలకు తనకు తెలియకుండా పదువులు ఇవ్వడంపై రోజా గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, ఆమె వాదన నెగ్గలేదు. వారు ఆ పదవుల్లో ఇప్పటికీ కొనసాగుతున్నారు.

Also Read: నగరిలో ఇన్ని సవాళ్ల మధ్య మంత్రి రోజా ఎలా నెగ్గుకువస్తారో!?

మంత్రి రోజాపై అసమ్మతి వ్యక్తం చేస్తున్న ఈ ఐదుగురు నేతలు గతంలో రోజా విజయానికి పనిచేసిన వారే.. కానీ ఆ తర్వాత ఎక్కడో తేడా కొట్టింది. మంత్రికి తెలియకుండా నియోజకవర్గంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు చేయడంతో గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఇటు మంత్రి.. అటు అసంతృప్త నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకున్నా.. ఇన్నాళ్లు పట్టించుకోలేదు వైసీపీ. కానీ, సీఎం జగన్ జిల్లా పర్యటనలో ఈ విభేదాలకు ముగింపు పలుకుతారని అంతా ఆశించారు. సీఎం కూడా మంత్రి రోజా, ఈడిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ శాంతి మధ్య గ్యాప్ ఎక్కడో తెలుసుకోకుండా.. ఇద్దరి చేతులు కలిపే ప్రయత్నం చేశారు. శాంతి చేతిని మంత్రి రోజా చేతికి అందివ్వడానికి సీఎం ప్రయత్నించినా.. శాంతి అన్యమనస్కంగానే కనిపించారు. రోజాతో అస్సలు రాజీ ప్రసక్తే లేదన్నట్లు సీఎం సమక్షంలోనూ ముఖం చాటేస్తున్న వ్యవహరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ కావడంతో మంత్రి రోజాతో నియోజకవర్గ నేతలకు గ్యాప్ ఉన్నట్లు మరింత విస్తృతంగా ప్రచారం జరిగింది.

Also Read: దాడి వీరభద్రరావు వాడి ఎందుకు తగ్గిపోయింది.. మళ్లీ యాక్టివ్ అవుతారా?

వాస్తవానికి నగరి నియోజకవర్గంలో వైసీపీ వరుసగా రెండుసార్లు గెలిచింది. మంత్రి రోజా, ఇతర నేతలు సమష్టిగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం విపక్షం పాత్రను స్వపక్షంలోనే నేతలు పోషిస్తుండటంతో మంత్రి రోజా టెన్షన్ పడుతున్నారు. పార్టీలో తగాదాలు టీకప్పులో తుఫాన్ వంటిదని పైకి గంభీరం ప్రదర్శిస్తున్నా.. పార్టీలోనే కొందరు పెద్ద నేతలు తనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. సీఎం సమక్షంలోనే ఈడిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ శాంతి ముఖం చేయడాన్ని పార్టీ పెద్దల దృష్టికి మరోసారి తీసుకువెళ్లనున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ వివాదానికి ఇప్పుడే ఫుల్‌స్టాప్ పెట్టకపోతే.. పార్టీకి తీవ్ర నష్టమని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు.

ట్రెండింగ్ వార్తలు