Nellore Lok Sabha Constituency : సింహపురిలో వైసీపీ పట్టు నిలుపుకుంటుందా ? నెల్లూరు టీడీపీలో కనిపిస్తున్న కొత్త జోష్

ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వర్గ విభేదాలు, గ్రూపు తగాదాలు నియోజకవర్గ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయ్. ఎమ్మెల్యేపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు జెండా ఎగరేశారు. పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లను అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయ్.

Nellore Lok Sabha Constituency : ఏపీ రాజకీయం ప్రస్తావన వచ్చిన ప్రతీసారి.. తప్పకుండా వినిపించే పదం నెల్లూరు ! ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాదు.. అన్ని పార్టీల్లోనూ రాజకీయం ఎప్పుడూ హాట్‌టాపిక్కే! ఇక్కడి రాజకీయం కత్తులు కనిపించవ్‌.. అంతకన్నా పదునైన పొలిటికల్ ఎత్తులు కళ్లముందు కదులుతుంటాయ్‌. రాజకీయానికి సిసలైన నిర్వచనం చెప్పేలా ఉంటాయ్ ఇక్కడి పరిణామాలు. రెడ్డి సామాజికవర్గం శాసిస్తున్న నెల్లూరు పార్లమెంట్‌.. వైసీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో ఎంపీ సీటుతో పాటు అసెంబ్లీ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేసిన వైసీపీ.. ఇప్పుడు అదే ట్రెండ్ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది. పాతికేళ్లుగా అందని ద్రాక్షలా మారిన నెల్లూరు పార్లమెంట్‌లో సత్తా చాటాలని టీడీపీ పావులు కదుపుతోంది. వైసీపీని వ్యతిరేకత వెంటాడుతుంటే.. టీడీపీని వర్గపోరు టెన్షన్‌ పెడుతోంది. దీంతో జంపింగ్ జంపాంగ్‌లు భారీగా కనిపించే అవకాశం ఉంది. ఇంతకీ నెల్లూరు రాజకీయం ఎలా ఉంది.. వైసీపీ, టీడీపీ బలాలేంటి.. జనసేన ఎక్కడ పోటీకి సిద్ధం అవుతోంది.. 2024 బరిలో దిగబోయే రేసుగుర్రాలు ఎవరు..

నెల్లూరులో వైసీపీని టెన్షన్ పెడుతున్న వర్గపోరు.. ఫ్యాన్‌ పార్టీని వెంటాడుతోన్న భయాలు
నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటివరకు 17సార్లు ఎన్నికలు జరిగితే.. ఎక్కువసార్లు కాంగ్రెస్, టీడీపీ విజయం సాధించాయ్‌. ఐతే 1999నుంచి ఇప్పటివరకు ఇక్కడ టీడీపీ విజయం సాధించలేదు. 2019 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకున్న వైసీపీ.. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జయకేతనం ఎగురవేసి క్లీన్‌స్వీప్‌ చేసింది. 2024లోనూ విజయం సాధించి పట్టుసాధించాలని వైసీపీ కసితో ఉంటే.. ఎలాగైనా విక్టరీ కొట్టి పాతరికార్డును తిరగరాయాలని టీడీపీ పావులు కదుపుతోంది. రెండు పార్టీలు నెల్లూరు మీద ప్రత్యేక దృష్టిసారించాయ్. వర్గపోరు వైసీపీని టెన్షన్‌ పెడుతుంటే.. చంద్రబాబు టూర్ జిల్లా టీడీపీలో కొత్త జోష్‌ నింపుతోంది. రెండు పార్టీలకు బలాలు, బలహీనతలు ఒకే స్థాయిలో ఉండగా.. 2024 ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

READ ALSO : Bapatla Lok Sabha Constituency : సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ !

adala prabhakar reddy, vemireddy prabhakar reddy

నెల్లూరు ఎంపీ టిక్కెట్ ఆదాలకు లేనట్టేనా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపనున్న వైకాపా..
నెల్లూరు పార్లమెంట్‌కు సిట్టింగ్ ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కొనసాగుతున్నారు. నాలుగేళ్లలో పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడడం తప్ప.. నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదు అనే విమర్శలు ఉన్నాయ్. ఎంపీ గ్రాంట్ నిధుల కింద అరకొర పనులు మాత్రమే చేశారన్న ఆరోపణలు ఉన్నాయ్. కరోనా సమయంలో ప్రజా ప్రతినిధులందరూ తమ నియోజకవర్గాల్లో సేవలు అందిస్తే.. ఆదాల మాత్రం హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. నియోజకవర్గంలో ఆయనపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. ఆదాల కూడా మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖంగా లేరనే ప్రచారం జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆదాలను తప్పించి… అదే సామాజికవర్గానికి చెందిన ఆర్థిక బలమున్న మరో వ్యక్తిని పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బరిలో దింపాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తుండగా.. ఆయన ఆసక్తిగా కనిపించడం లేదు. దీంతో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీ బరిలో దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

chandramohan reddy, srinivasula reddy

టీడీపీ తరఫున ఎంపీగా పోటీకి సోమిరెడ్డి ఆసక్తి.. టీడీపీలో చేరితే మాగుంటకు టికెట్ కన్ఫార్మ్ అయ్యే చాన్స్‌
టీడీపీ తరఫున గత ఎన్నికల్లో బీదమస్తాన్‌ రావు పోటీ చేయగా.. ఆ తర్వాత ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు పార్లమెంట్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్న టీడీపీ.. ఈసారి రెడ్డి సామాజికవర్గం నుంచి అభ్యర్థిని బరిలో దించాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనికతోడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఆయన.. త్వరలో సైకిల్ ఎక్కే అవకాశాలు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అదే జరిగితే.. ఆయనకు టికెట్ దాదాపు కన్ఫార్మ్ అయ్యే చాన్స్ ఉందని నెల్లూరు టాక్. ఏమైనా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో వైసీపీ, టీడీపీ మధ్య ఈసారి నువ్వానేనా అనేలా యుద్ధం కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలో కందుకూరు, కావలి, ఉదయగిరి, ఆత్మ కూరు, కోవూరు, నెల్లూరు సిటీ , నెల్లూరు రూరల్ అ సెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో రాజకీయం రోజుకో రకంగా మారుతోంది. వర్గవిభేదాలు, అసంతృప్తులు, కక్షసాధింపులతో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయ్.

READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు

ravichandra, prathap kumar

ప్రజలకు అందుబాటులో ఉండని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.. టీడీపీ నుంచి టికెట్ రేసులో బీద రవిచంద్ర
నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలో ముఖ్యమైన నియోజకవర్గం కావలి. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. హ్యాట్రిక్ విజయం కన్నేసిన ఆయన.. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో జనాలకు అందుబాటులో ఉండరు అనే విమర్శ ఉంది ఆయన మీద! నియోజకవర్గంలో స్థలాలు, లే అవుట్‌లు, గ్రావెల్ విషయాల్లో ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయ్. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారు. గడప గడపకు కార్యక్రమంలో చాలాచోట్ల ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. దీంతో రామిరెడ్డికి టికెట్ డౌటే అనే చర్చ జరుగుతోంది. ఎంపీ ఆదాల.. ఈసారి కావలి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తుండగా.. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. టీడీపీ నుంచి బీద రవిచంద్ర పేరు టికెట్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. నియోజకవర్గంపై ఆయనకు మంచి పట్టు ఉంది. చంద్రబాబు, లోకేశ్‌ దృష్టిలోనూ ప్రత్యేక స్థానం సంపాదించారు. రవిచంద్రతో పాటు పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి మాలేపాటి సుబ్బానాయుడు బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇద్దరు నేతలు ఆర్థికంగా బలంగా ఉన్నారు. సరైన అభ్యర్థిని బరిలో దింపితే.. ఇక్కడ టీడీపీకి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్.

ravichandra, prathap kumar

ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో వైకాపా.. టీడీపీ నుంచి బొల్లినేని రామారావు టికెట్ ప్రయత్నాలు
ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వర్గ విభేదాలు, గ్రూపు తగాదాలు నియోజకవర్గ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయ్. ఎమ్మెల్యేపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు జెండా ఎగరేశారు. పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లను అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయ్. శివ చరణ్ రెడ్డి అనే యువకుడు.. తాను మేకపాటి కుమారుడినంటూ బహిరంగ లేఖ, వీడియో మీడియా ముందుకు రావడం.. వైసీపీకి ఇబ్బందిగా మారింది. దీంతో 2024లో మేకపాటిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. దీంతో ఉదయగిరి నుంచి పోటీకి పార్టీలో భారీ పోటీ కనిపిస్తోంది. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డితో పాటు.. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీడీపీ నుంచి బొల్లినేని రామారావు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. జనాలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకపోవడం.. బొల్లినేని రామారావుకు మైనస్. పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డి కూడా ఉదయగిరిలోనూ టికెట్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు టీడీపీ సర్కార్‌లో ప్రొటోకాల్ ఆఫీసర్‌గా పనిచేసిన అశోక్ కుమార్ కూడా టికెట్ రేసులో ఉన్నారు.

READ ALSO : Chittoor Lok Sabha Constituency : చిత్తూరులో ఫ్యాన్ పార్టీ పట్టునిలుపుకుంటుందా?..అధికార పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ వ్యూహాలేంటి?

Nallapareddy Prasanna kumar, dinesh kumar

కోవూరు నుండి మరోసారి బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి…టీడీపీ నుంచి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేరు

కోవూరులో ప్రసన్నకుమార్‌ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. టికెట్‌ రేసులో ఈయనకు పెద్దగా పోటీ కనిపించడం లేదు. జనాలకు అందుబాటులో ఉండే నేతగా పేరున్నా.. నియోజకవర్గ అభివృద్ది మాత్రం పెద్దగా జరగలేదు. ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా అంటూ అవినీతి ఆరోపణలు ఉన్నాయ్. గడపగడపకు కార్యక్రమంలో నిరసనకు ఎదురుకాగా.. ఆందోళనకు దిగిన వారిపై ప్రసన్నకుమార్ రెడ్డి కక్షసాధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయ్. ప్రస్తుతానికి టికెట్‌ రేసులో ఆయన ఒక్కరే కనిపిస్తున్నా.. రాబోయే రోజుల్లో పరిణామాలు మారే చాన్స్ ఉంది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డికి టికెట్‌ దాదాపు ఖాయం. కొంతకాలంగా నియోజకవర్గoలో దినేష్ రెడ్డి యాక్టివ్‌గా ఉంటున్నారు. ఐతే కేడర్ సరిగా లేకపోవడం.. రాజకీయ అనుభవం లేకపోవడం దినేష్ రెడ్డికి ప్రతికూలంగా మారే చాన్స్ ఉంది. ప్రసన్నకుమార్‌ రెడ్డిని ఢీకొట్టి ఓడించడం అంత ఈజీ కాదు. దీంతో కోవూరులో ఎన్నికల యుద్ధం రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

mekapati vikram, kaivalyareddy

ఆత్మకూరులో బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డి.. బలమైన అభ్యర్థి బరిలోకి దింపితే టీడీపీ విజయం ఖాయమా?
ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. మేకపాటి కుటుంబం స్వగ్రామం ఈ నియోజకవర్గంలోనే ఉండటంతో పాటు అనుచర వర్గం, బంధువర్గం ఉండటం విక్రమ్ రెడ్డికి కలిసొచ్చే అంశం. గడపగడపకు కార్యక్రమంతో ఇప్పుడిప్పుడే జనాలకు దగ్గర అవుతున్నారు. ఐతే అధికార పార్టీలో నాయకులందరినీ కలుపుకొని వెళ్లడంలో స్లోగా ఉన్నారనే టాక్ ఉంది. అసంతృప్తులు విక్రమ్ రెడ్డికి కొంత మైనస్. సీఎం జగన్‌తో మేకపాటి కుటుంబానికి మంచి సంబంధాలు ఉండడంతో.. వచ్చే ఎన్నికల్లో ఈ ఫ్యామిలీకే టికెట్ కేటాయించే చాన్స్ ఉంది. టీడీపీలో దశాబ్దానికి పైగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఇంచార్జిలే లేరు. 2019లో బొల్లినేని కృష్ణయ్య టీడీపీ తరఫున పోటీ చేశారు. ఈసారి ఆయనతో పాటు.. గూటూరు కన్నబాబు, బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి టికెట్‌ రేసులో కనిపిస్తున్నారు. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి కూతురు కైవల్యా రెడ్డి కూడా టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆనం రాంనారాయణ రెడ్డి టీడీపీలోకి జంప్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో సైకిల్ పార్టీ నుంచి ఆయనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బలమైన అభ్యర్థి బరిలోకి దింపితే.. ఆత్మకూరులో టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.

READ ALSO : Guntur Lok Sabha Constituency : ఆంధ్రా రాజకీయాలకు సెంటర్ పాయింట్…గుంటూరు రాజకీయం మిర్చి కన్నా ఘాటు గురూ…

aziz, prabhakarreddy, sridhar reddy

నెల్లూరు రూరల్‌ లో సొంతపార్టీపైనే తిరుగుబాటు బావుటా ఎగరేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. రాష్ట్రంలో ఆందరి దృష్టి నెల్లూరు రూరల్ రాజకీయాలపైనే..
నెల్లూరు రూరల్ నియోకవర్గంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. హ్యాట్రిక్‌ విజయం మీద కన్నేసిన కోటంరెడ్డి.. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో జనాల్లో ఉంటున్నారు. అదే సమయంలో సొంతపార్టీ పైనే ఇటీవల తిరుగుబాటు బావుటా ఎగురేశారు. శ్రీధర్ రెడ్డి.. టీడీపీ, జనసేన నాయకులతో కూడా టచ్‌లో ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలో వైసీపీ పక్కాగా గెలిచే నియోజకవర్గాల్లో ఒకటైన నెల్లూరు రూరల్ లో ప్రస్తుతం ఆపార్టీ పరిస్ధితి దయనీయంగా మారింది. జనాలతో కలిసిపోయే స్వభావం ఉండటంతో కోటంరెడ్డి ఏపార్టీ నుండి బరిలోకి దిగినా గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కూడా టీడీపీ టిక్కెట్ రేసులో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డిఏ పార్టీలో ఉన్నా.. మళ్లీ తనే గెలిచేలా కోటంరెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఎంపీ అదాల ప్రభాకర రెడ్డిని పార్టీ బాధ్యతలు అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో అదాల ప్రభాకర రెడ్డి నెల్లూరు రూరల్ నుండి వైకాపా అభ్యర్ధిగా బరిలో దిగనున్నారనే టాక్ నడుస్తుంది.

aneel kumar, narayana

నెల్లూరు సిటీ నుండి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్న అనిల్ కుమార్ యాదవ్‌.. టికెట్ ప్రయత్నాలు చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి
నెల్లూరు సిటీ స్థానంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన అనిల్‌ కుమార్‌.. మూడోసారి విజయం కోసం పావులు కదుపుతున్నారు. సీఎం జగన్‌కు విధేయుడిగా పేరు ఉండడంతో.. అనిల్‌కే మళ్లీ టికెట్‌ దక్కడం ఖాయం. ఐతే నియోజకవర్గ వైసీపీలో పరిణామాలు అనిల్‌కుమార్‌ను టెన్షన్‌ పెడుతున్నాయ్. కొందరు నెల్లూరు కార్పొరేటర్లు అనిల్‌ను వీడటం… బాబాయ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌తో విభేదాలు.. ఆయనకు పెద్ద మైనస్‌గా మారనున్నాయ్. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకా నాథ్ కూడా ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ద్వారకనాథ్‌కు వైశ్య కమ్యూనిటీలో మంచి పట్టుoది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. టీడీపీలో ఈ టికెట్ కోసం భారీ పోటీ కనిపిస్తోంది. మాజీ మంత్రి నారాయణతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రేసులో ఉన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు సుబ్బారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. జనసేన నుంచి కేతంరెడ్డి వినోద్ రెడ్డి, మనుక్రాంత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయ్.

READ ALSO : Kakinada Lok Sabha Constituency : కాకినాడలో ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో తిరగనుందా?….ఈసారి ఎన్నికల్లో బలమైన కాపు సామాజిక వర్గం మద్దతు ఏపార్టీకి?

mahidhar reddy

కందుకూరులో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహీధర్ రెడ్డి.. పార్టీ మారేఆలోచన
కందుకూరు నియోజకవర్గంలో మానుగుంట మహీధర్ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహీధర్ రెడ్డి కి.. మంచి మాస్‌ ఫాలోయింగ్ ఉంది. పోల్ మేనేజ్‌మెంట్‌లో దిట్ట. మహీధర్ రెడ్డి కే టికెట్ దాదాపు కన్ఫార్మ్‌. ఎప్పుడూ జనాల్లో ఉండే నేతలగా పేరున్న మహీధర్ రెడ్డి .. పార్టీలతో ప్రమేయం లేకుండా గెలవగల సత్తా ఉన్న నాయకుడు. వైసీపీలో ఆయనకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయ్‌. కొంతకాలంగా అసంతృప్తితో కనిపిస్తుండడంతో .. పార్టీ మారతారన్న ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఆప్తుడుగా ఉండే మహీధర్ రెడ్డి .. ఆయన బాటలోనే నడుస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు… ఇక్కడి నుంచి వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీ కేడర్ తప్ప సొంతగా బలం లేకపోవడం తూమాటికి మైనస్‌. టీడీపీని అంతర్గత పోరు ఇబ్బంది పెడుతోంది. పార్టీ నుంచి ఇంటూరు నాగేశ్వర రావు, ఇంటూరు రాజేష్ పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నా.. ఈ ఇద్దరు నేతలు ఎవరికివారే అన్నట్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీ రెండుగా చీలిపోయింది. ఇద్దరిని ఒక్కతాటి మీదకు తెచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోంది. ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజం అయితే.. ఆయనకే టికెట్‌ దక్కడం ఖాయం.

జనాల్లో వ్యతిరేకత, ఎమ్మెల్యేల్లో అసంతృప్తితో మారుతున్న రాజకీయ పరిణామాలు వైసీపీని ఇబ్బందిపెడుతుంటే.. వర్గవిభేదాలు టీడీపీని తలపోటుగా మారాయ్‌. కొందరు ఆశావహులు.. ఒక నియోజకవర్గానికి పరిమితం కాకుండా.. రెండు మూడు నియోజకవర్గాలలో టికెట్ల కోసం ట్రై చేస్తున్నారు. ఎన్నికల నాటికి నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలో కీలక పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయం.

ట్రెండింగ్ వార్తలు