Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు చేతికర్రలు.. నడకమార్గంలో పంపిణీ చేస్తున్న టీటీడీ, కర్రలు ఎందుకు ఇస్తున్నారో చెప్పిన భూమన

నడకమార్గం ద్వారా కొండపైకి వెళ్లే భక్తులకు స్వయంగా కర్రలు అందజేశారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. Tirumala - Hand Sticks

Hand Sticks For Tirumala Devotees

Tirumala – Hand Sticks : ఇటీవల తిరుమల నడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత టీటీడీ అలర్ట్ అయ్యింది. భక్తుల భద్రత కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి నడకమార్గంలో వెళ్లే భక్తులకు చేతికర్రలు ఇవ్వడం. ఇవాళ్టి నుంచి భక్తులకు చేతికర్రలు ఇస్తున్నారు.

అలిపిరి దగ్గర భక్తులకు చేతి కర్రలను టీటీడీ పంపిణీ చేసింది. నడకమార్గం మీదుగా కొండపైకి వెళ్లే భక్తులకు స్వయంగా కర్రలు అందజేశారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నడకదారి భక్తుల్లో ఆత్మస్థైర్యం నింపడం కోసమే కర్రలు పంపిణీ చేస్తున్నాము అని చెప్పారు. ఆ కర్రలతో క్రూర మృగాలతో పోట్లాడాలని కాదన్నారు.

చేతి కర్ర ఇచ్చి మా చేతులు దులుపుకోబోము అని అన్నారు. అడుగడుగునా సిబ్బంది పహారా ఉంటారని వెల్లడించారు. భక్తులకు చేతికర్రలు ఇవ్వడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని భూమన అన్నారు. మేము మంచి ఆలోచనతో చేతికర్రలు ఇవ్వడం మొదలుపెట్టామన్నారు. కొండపైకి వెళ్లాక భక్తుల నుంచి కర్రలు వెనక్కి తీసుకుంటాము అని భూమన వెల్లడించారు.

చిన్నారిపై చిరుత దాడి ఘటన తర్వాత రక్షణ చర్యలు చేపట్టింది టీటీడీ. నడకమార్గంలో భద్రత పెంచడంతో పాటు భక్తులకు కర్రలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Also Read: టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు.. గోవిందకోటి రాస్తే వీఐపీ బ్రేక్ దర్శనం.. కేవలం వారికి మాత్రమే.. చేతికర్రలు కూడా..

నడకమార్గం భక్తులకు చేతికర్రలు పంపిణీ చేయాలన్న నిర్ణయాన్ని ఇవాళ్టి(సెప్టెంబర్ 6) నుంచి అమల్లోకి తెచ్చింది. టీటీడీ ఛైర్మన్ భూమన స్వయంగా నడకమార్గం దగ్గరికి వచ్చి నడకమార్గంలో వెళ్లే భక్తులకు చేతికర్రలను అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులకు కర్రలు ఇచ్చారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి ఈ కర్రలను టీటీడీ తెప్పించింది. మొదటి దశలో దాదాపు 10వేల కర్రలను టీటీడీ కొనుగోలు చేసింది. నడకమార్గం మొదటి గోపురం వద్ద భక్తులకు ఈ కర్రలను అందజేస్తున్నారు. భక్తులు కొండపైకి చేరుకున్న తర్వాత వారి నుంచి తిరిగి కర్రలను వెనక్కి తీసుకుంటారు. టీటీడీ సిబ్బంది స్వయంగా భక్తులకు కర్రలు అందజేస్తున్నారు.

తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. అంతేకాదు ఓ చిన్నారిపై చిరుత దాడి చేసి చంపడం భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ ఘటనతో అలర్ట్ అయిన టీటీడీ నడకమార్గంలో చిరుతలు తిరిగే ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసింది. దాంతో నాలుగు చిరుతలు చిక్కాయి. అయినా, ఇంకా చిరుత భయం నడకమార్గం భక్తులను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈ కర్రల పంపిణీకి శ్రీకారం చుట్టింది. భక్తులకు కర్రలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ టీటీడీ లెక్కపెట్టలేదు.

ఈ కర్రల పంపిణీని కొందరు భక్తులు స్వాగతించారు. దీన్ని మంచి నిర్ణయంగా అభివర్ణించారు. కచ్చితంగా కర్రతో జంతువుల నుంచి రక్షణ పొందొచ్చని చెప్పారు. కచ్చితంగా ఈ కర్రలు భక్తులకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయన్నారు. ఆదిమ కాలం నుంచి కూడా మనిషి జీవితంలో ఒక భాగంగా కర్ర ఉందని చెప్పారు. రైతులు పొలానికి వెళ్లేటప్పుడు, పశువులను మేపడానికి వెళ్లే సమయంలో, అడవుల మీదుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు చేతిలో కర్ర అనేది ఉంటుందన్నారు. అడవి జంతువుల నుంచి కర్ర రక్షణ కల్పిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు