Vijayawada Lok Sabha Constituency : జెండా పాతాలని వైసీపీ ప్రయత్నాలు.. ఫ్యాన్‌ పార్టీకి ఝలక్ ఇవ్వాలని టీడీపీ ఎత్తులు.. సెగలు రేపుతోన్న విజయవాడ పార్లమెంట్ రాజకీయం !

ఎన్టీఆర్ జిల్లాలో పొలిటికల్‌గా హైసెన్సిటివ్‌ సెగ్మెంట్‌ జగ్గయ్యపేట. వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను ఎమ్మెల్యేగా ఉన్నారు. టికెట్ విషయంలో ఆయనకు కూడా పెద్దగా పోటీ లేదు. టీడీపీలోనే విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయ్. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ప్రస్తుతం జగ్గయ్యపేట ఇంచార్జిగా కొనసాగుతున్నారు.

Vijayawada Lok Sabha Constituency : బెజవాడ.. ఏపీ పాలిటిక్స్‌కు అసలు సిసలు అడ్డా… ఎక్కడాలేని రాజకీయం అంతా ఉండేది అక్కడే! భానుడికి రగలడం.. బెజవాడకు రాజకీయాన్ని రగిలించడం ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు రాజకీయం ఎలా మొదలుపెడతారో… ఎప్పుడు ముగిస్తారో… కారణాలు ఏమై ఉంటాయో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మిగతా ప్రాంతాల్లో రాజకీయాలు వేరు.. విజయవాడ వేరు ! అలాంటి విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో రాజకీయం రోజుకోమలుపు తిరుగుతోంది. సొంతింట్లో కుంపట్లు.. అసంతృప్తుల అలజడులు.. తిరుగుబాటు నినాదాలు.. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే విజయవాడ రాజకీయం నిప్పులు కురిపిస్తోంది. ఎంపీ స్థానం గెలిచి రికార్డు క్రియేట్‌ చేయాలని వైసీపీ.. అసెంబ్లీ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేయాలని టీడీపీ.. ఎవరికి వారు… ఒకరికి మించి ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. రాజకీయంలో మరిన్ని సెగలు రాజేస్తున్నారు. బెజవాడ పార్లమెంట్‌లో జెండా పాతేందుకు వైసీపీ వేస్తున్నవ్యూహాలేంటి.. కేశినేని ఫ్యామిలీ వార్ సైకిల్‌ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులపై రెండు పార్టీల లెక్కలు కొలిక్కి వచ్చాయా.. మరి.. ఎన్నికల బరిలోకి దిగబోతున్న రేసుగుర్రాలు ఎవరు..?

pvp

ఎప్పుడూ యుద్ధంలానే బెజవాడ రాజకీయం..మలుపులు తిరుగుతున్న రాజకీయ పరిణామాలు

ప్రతీ యుద్ధంలో రాజకీయం ఉంటుంది.. బెజవాడ రాజకీయం మాత్రం ఎప్పుడూ యుద్ధంలానే ఉంటుంది. రాజకీయం పుట్టిందే విజయవాడలోనా అన్నట్లు ఉంటాయ్ పరిస్థితులు. మలుపుల మీద మలుపు, షాకుల మీద షాకులు.. ఒకటి కాదు.. అంతకుమించి అనిపిస్తుంటాయ్ ఇక్కడ పొలిటికల్ పరిణామాలు ! విజయవాడ అంటే రాజకీయం.. రాజకీయం అంటే విజయవాడ. ఈ మాట చాలు.. పొలిటికల్ సెగ ఎలా ఉంటుందో.. అక్కడ రాజుకునే మంట రాష్ట్రమంతా ఎలా అంటుకుంటుందో చెప్పడానికి ! అధికార పక్షం, విపక్షం అని రాజకీయం ఎక్కడైనా రెండువైపుల ఉంటుంది. బెజవాడలో అలాంటి లెక్కలు కనిపించవ్‌. అలాంటి విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే.. రాజకీయం రగులుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య చిన్నపాటి యుద్ధమే కనిపిస్తోంది.

READ ALSO : Machilipatnam Lok Sabha Constituency : రసవత్తరంగా బందరు పాలిటిక్స్…మచిలీపట్నం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు !

nagarjuna

ఎలాగైనా బెజవాడలో జెండా పాతాలన్న పట్టుదలలో వైసీపీ.. నటుడు నాగార్జున పోటీ చేస్తారని ప్రచారం

విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ ఇప్పటివరకు గెలవలేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బెజవాడలో జెండా పాతాలని ఫ్యాన్ పార్టీ ఫిక్స్ అయింది. పార్టీని విజయతీరాలకు చేర్చే బలమైన అభ్యర్థి కోసం ఎదురుచూస్తోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పీవీపీ.. రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో.. కొత్త వ్యక్తిని బరిలోకి దించాలని చూస్తోంది వైసీపీ. నటుడు నాగార్జున పోటీచేస్తారని ప్రచారం జరిగినా.. అది ప్రచారంగానే ముగిసింది. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు పేరు వినిపిస్తోంది. యార్లగడ్డ మాత్రం గన్నవరం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు టాక్. ఆయనతో పాటు వసంతకృష్ణప్రసాద్, వల్లభనేని వంశీ పేర్లు కూడా పార్లమెంట్‌ రేసులో వినిపిస్తున్నా.. వైసీపీ అధిష్టానం నుంచి మాత్రం ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు.

chinni

ఫ్యాన్‌గాలి జోరులోనూ విజయవాడలో టీడీపీ విజయం.. టికెట్ కోసం కేశినేని చిన్ని జోరు ప్రయత్నాలు..

వైసీపీలో సిచ్యుయేషన్ అలా ఉంటే.. టీడీపీ పరిస్థితి అంతకు మించి అన్నట్లుంది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్‌గాలి జోరులోనూ విజయవాడ ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది టీడీపీ. పార్లమెంట్‌ పరిధిలో ఒక్క విజయవాడ తూర్పు మినహా మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ జయకేతనం ఎగరవేసినా.. ఎంపీగా మాత్రం టీడీపీ అభ్యర్థి కేశినేని నానికే పట్టం గట్టారు బెజవాడ ఓటర్లు. అయితే.. పార్టీలో పరిస్థితులు మారడంతో ఈ సారి పోటీకి ఎంపీ కేశినేని నాని సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతోంది. కేశినేని నాని సోదరుడు… చిన్ని ఎంపీ టికెట్‌ కోసం కొన్నాళ్లుగా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో చాప కింద నీరులా పనిచేసుకు పోతున్నారు. పార్టీ ముఖ్యనేతలను గ్రిప్‌లో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. సంక్రాంతికి కేడర్‌కు భారీ బహుమతులు పంపిణీ చేయడంతో పాటు.. ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటున్నారు.

READ ALSO : Nellore Lok Sabha Constituency : సింహపురిలో వైసీపీ పట్టు నిలుపుకుంటుందా ? నెల్లూరు టీడీపీలో కనిపిస్తున్న కొత్త జోష్

Sujana Chowdary

అధిష్టానం కూడా చిన్నివైపే మొగ్గుచూపుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. చాలామంది ఇంచార్జిలు చిన్నికే మద్దతుగా నిలుస్తుండగా.. కేశినేని నాని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాగైనా చిన్నిని అడ్డుకోవాలని నాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం బీజేపీలో ఉన్న సుజనాను మళ్లీ సైకిలెక్కేలా ఒప్పించి.. ఎంపీ బరిలో దింపాలని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. సుజనా లైన్‌లోకి వస్తే ఇంచార్జిల్లోనూ మార్పు వస్తుందన్నది కేశినేని నాని వర్గం వాదన. అన్నీ కుదిరి టీడీపీతో పొత్తు ఉంటే.. బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి.. విజయవాడ పార్లమెంటు రేసులో ఉంటారని తెలుస్తోంది. జనసేనతో మాత్రమే టీడీపీ పొత్తు ఉంటే.. విజయవాడ నుంచి పవన్ కల్యాణ్‌ పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

సామాజిక సమీకరణాలు విజయవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయ్. విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్‌తో పాటు మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాలు ఉన్నాయ్‌. గత ఎన్నికల్లో ఆరు స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఐతే ఈసారి మాత్రం ఎంపీ సీటుతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలనూ క్లీన్‌స్వీప్ చేయాలని వైసీపీ టార్గెట్‌గా పెట్టుకుంటే.. ఫ్యాన్‌ పార్టీకి ఝలక్ ఇవ్వాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.

Gadde Rammohan, swetha

READ ALSO : Kurnool Lok Sabha Constituency : వచ్చే ఎన్నికల్లో కొండారెడ్డి బురుజుపై జెండా పాతేది ఎవరు….ఆసక్తి కరంగా కర్నూలు రాజకీయాలు

విజయవాడ తూర్పు సిట్టింగ్ ఎమ్మెల్యేగా గద్దెరామ్మోహన్ మరోసారి బరిలో.. కూతురు శ్వేతను అభ్యర్థిగా నిలబెట్టాలని కేశినేని నాని ప్రయత్నాలు

పార్లమెంట్ పరిధిలో విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకం. వైసీపీ ఇప్పటివరకు ఇక్కడ విజయం సాధించలేదు. ప్రస్తుతం టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉండగా.. ఈసారి ఎలాగైనా ఇక్కడ గెలవాలని ఫ్యాన్‌పార్టీ కసిమీద కనిపిస్తోంది. బలమైన కమ్మసామాజికవర్గానికి చెందిన దేవినేని అవినాష్‌ను రంగంలోకి దించింది. గద్దె రామ్మోహన్‌ను ఢీ కొట్టాలంటే ఆర్థికంగా, అంగబలం పరంగా అవినాశ్ సరిపోతారని లెక్కలు వేస్తోంది. టీడీపీ నుంచి పోటీ విషయంలో గద్దె రామ్మోహన్‌కు ఎలాంటి ఢోకా లేకపోయినా.. ఇక్కడి నుంచి తన కూతురు శ్వేతను అభ్యర్థిగా నిలబెట్టాలని కేశినేని నాని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈస్ట్ టికెట్‌ తన కూతురుకు ఇస్తే ఎంపీ టికెట్‌ విషయంలో నాని అభ్యంతరం తెలిపే అవకాశాలు ఉండవన్న చర్చ నడుస్తోంది. దీంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

vishnu, uma

విజయవాడ సెంట్రల్‌ నుండి మరోసారి బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు..టిడిపి అభ్యర్ధిగా బరిలో బోండా ఉమా

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం.. వైసీపీ అకౌంట్‌లో ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమాపై మల్లాది విష్ణు విజయం సాధించారు. కేడర్‌ మల్లాదిపై కాస్త అసంతృప్తితో ఉన్నా.. 2024 టికెట్‌ ఆయనకే దాదాపు కన్ఫార్మ్ ! టీడీపీ నుంచి బలమైన నేత బోండా ఉమా బరిలోకి దిగే అవకాశం ఉండడంతో.. ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. చంద్రబాబు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మారిన బోండా ఉమా.. పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతో సెంట్రల్‌ నుంచి టీడీపీ తరఫున మరెవరూ టికెట్ ఆశించే పరిస్థితి కనిపించడం లేదు.

Vellampalli Srinivas, jaleelkhan,mahesh,venkanna

విజయవాడ వెస్ట్‌ నుండి మరోసారి రేసులో వెల్లంపల్లి శ్రీనివాస్‌.. పశ్చిమలో టీడీపీని ఇబ్బంది పెడుతున్న గ్రూప్‌ రాజకీయాలు

విజయవాడ వెస్ట్‌లో మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు.. టికెట్ రేసులో ఎలాంటి పోటీ లేదు. ఆయనకే మళ్లీ వైసీపీ అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీకి ప్రస్తుతం ఇంచార్జి లేరు. కేశినేని నానినే ఆ బాధ్యతలు చూస్తున్నారు. పశ్చిమలో టీడీపీని గ్రూప్‌ రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయ్. పార్టీ కార్యక్రమాలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. బుద్ధా వెంకన్న, నాగూల్ మీరా ఒక వర్గంగా… కేశినేని నాని, జలీల్ ఖాన్ మరో వర్గంగా మారారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జలీల్ ఖాన్ కూతురు షభానా ఖాతూన్ పోటీ చేసి ఓడిపోయారు. ఐతే ఇప్పుడు జలీల్‌ ఖాన్‌ రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బుద్ధా వెంకన్న మాత్రం తానే ఈ సారి అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటున్నారు. బీసీ కార్డును తెరమీదకు తెచ్చి.. చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేనతో పొత్తు ఉన్నా.. తానే పోటీ చేస్తాను అంటూ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అటు.. ఈ నియోజకవర్గాన్ని జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీకి మంచి బలం ఉంది. జనసేన నేత పోతిన మహేష్ ఇక్కడ కూడా యాక్టివ్‌గా ఉన్నారు. వైసీపీకి సవాళ్లు విసరడంలో ముందుంటున్నారు. టీడీపీ, జనసేన పొత్తుగా ఎన్నికల యుద్ధానికి వెళ్తే.. మహేష్‌కు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయ్.

READ ALSO : Eluru Lok Sabha Constituency : ఏలూరులో పాగా వేయాలని టీడీపీ వ్యూహాలు….క్లీన్‌స్వీప్‌ చేయడమే టార్గెట్‌గా అధికార పార్టీ అడుగులు

Krishna Prasad, uma

మైలవరంలో పోటీ చేసేది తానే అంటున్న వసంతకృష్ణప్రసాద్‌..తన కుమారుడుని బరిలో దింపే యోచనలో జోగి రమేష్

విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో మోస్ట్ కాంట్రవర్షియల్ నియోజకవర్గం.. మైలవరం ! ఇక్కడ వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌, మంత్రి జోగి రమేష్‌ వివాదం.. సీఎం ఆఫీస్‌ వరకు చేరాయ్. పార్టీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. మంటలు కొనసాగుతూనే ఉన్నాయ్. మైలవరంలో మంత్రి జోగి రమేష్‌కు భారీ అనుచరవర్గం ఉంది. దీంతో ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి వివాదం.. పార్టీని టెన్షన్ పెడుతోంది. మైలవరం నుంచి పోటీ చేయబోయేది తానే అని వసంతకృష్ణప్రసాద్ చెప్తుంటే.. తను లేదా తన కుమారుడు బరిలో ఉంటారని సన్నిహితుల దగ్గర జోగి రమేష్‌ చెప్తున్నట్లు తెలుస్తోంది. మైలవరం విషయంలో అధిష్టానం నుంచి ఇప్పటికీ క్లారిటీ లేదు. దీంతో ఎవరు పోటీ చేస్తారో తెలియక కేడర్‌ కన్ఫ్యూజన్‌లో పడిపోయింది. మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమాకు పోటీ ఎదురవుతోంది. స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ బొమ్మసాని సుబ్బారావు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. కేశినేని నానినే సుబ్బారావు వెనక ఉండి నడిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దేవినేని ఉమా నిత్యం జనాల్లో తిరుగుతున్నా.. గ్రూపు రాజకీయాలు ఆయనను ఇబ్బంది పెడుతున్నాయ్.

jaganmohanrao,sowmya

నందిగామ నుండి మరోసారి బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మొండితోక జగన్మోహన్ రావు.. టీడీపీ టికెట్ విషయంలో తంగిరాల సౌమ్యకు అండగా అధిష్టానం

నందిగామ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. వైసీపీ నుంచి మొండితోక జగన్మోహన్ రావు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు అరుణ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరికి మరెవరి నుంచీ పోటీ లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇద్దరిలో ఎవరో ఒకరు ఫ్యాన్‌ పార్టీ తరఫున బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయ్. టీడీపీ నుంచి తంగిరాల సౌమ్యకు కూడా టికెట్ విషయంలో ఎలాంటి ఢోకా లేదు. గ్రూప్‌ రాజకీయాలు టీడీపీని టెన్షన్‌ పెడుతున్నా.. అవి ఆధిపత్యం వరకే పరిమితం అయ్యాయ్. గత ఎన్నికల్లో ఓడినా.. అప్పటి నుంచి నిరంతరం నియోజకవర్గంలోనే ఉంటూ వివాదరహితురాలుగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి గట్టి ఫైట్ ఇవ్వలేకపోతున్నారన్న డిస్కషన్‌ మాత్రం పార్టీలో జరుగుతోంది.

READ ALSO : Srikakulam Lok Sabha Constituency : ఉద్యమాల పురిటిగడ్డ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పొలిటికల్ సీన్ ఏంటి ? వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య టఫ్‌ ఫైట్‌ తప్పదా..

udayabhanu, thathaiah

జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత సామినేని ఉదయభాను మరోసారి పోటీలో..టీడీపీ అభ్యర్ధిగా శ్రీరామ్ తాతయ్య పోటీ చేసే అవకాశం

ఎన్టీఆర్ జిల్లాలో పొలిటికల్‌గా హైసెన్సిటివ్‌ సెగ్మెంట్‌ జగ్గయ్యపేట. వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను ఎమ్మెల్యేగా ఉన్నారు. టికెట్ విషయంలో ఆయనకు కూడా పెద్దగా పోటీ లేదు. టీడీపీలోనే విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయ్. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ప్రస్తుతం జగ్గయ్యపేట ఇంచార్జిగా కొనసాగుతున్నారు. టికెట్ ఆయనకే అంటూ పార్టీ క్లియర్‌గా చెబుతున్నా.. కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయంటూ తెలుగు యువత నాయకుడు బొల్లా రామకృష్ణ హడావుడి చేయడం మొదలుపెట్టారు. దీన్ని టీడీపీ అధిష్టానం ఖండించింది కూడా. అయినా.. నియోజకవర్గంలో టీడీపీ నేతలు నెట్టెం రఘురాం, శ్రీరామ్ తాతయ్య వర్గాలుగా విడిపోవడం.. విజయవకాశాలను దెబ్బతీసేలా కనిపిస్తోంది.

rakshana nidhi

తిరువూరు హ్యాట్రిక్‌ కొట్టాలని పట్టుదలలో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి.. ఆర్థికంగా బలవంతుడైన కొత్త అభ్యర్థి కోసం టీడీపీ సెర్చింగ్‌

విజయవాడ పార్లమెంట్ పరిధిలోని చివరి నియోజకవర్గం తిరువూరు. ఇది ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం. వైసీపీ నుంచి రక్షణనిధి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ కూడా ఆయన విషయంలో అనుకూలంగానే ఉండగా.. 2024లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని రక్షణనిధి పట్టుదలతో ఉన్నారు. టీడీపీ నుంచి ఇంచార్జిగా ఉన్న శ్యావల దేవదత్‌ పనితీరుపై పార్టీ అసంతృప్తిగా ఉంది. అందరినీ కలుపుకుపోవడంలో విఫలం అవుతున్నారని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. శ్యావలకు స్థానిక కేడర్‌ కూడా సహకరించడం లేదు. దీంతో ఆర్థికంగా బలవంతుడైన కొత్త అభ్యర్థి కోసం పార్టీ సెర్చింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 2004 నుంచి ఇప్పటి వరకూ ఈ స్థానంలో టీడీపీ గెలవలేదు. ఈసారి ఎలాగైనా ఆ చెత్తరికార్డుకు బ్రేక్ చేయాలని కసిమీద ఉంది.

READ ALSO : Andhra pradesh : రాజమండ్రిపై కన్నేసిన గోరంట్ల..బాబు అంగీకరిస్తారా? మరి సిట్టింగ్ మహిళా ఎమ్మెల్యే పరిస్థితి ఏంటీ?

విజయవాడ పార్లమెంట్‌ యుద్ధం అనేది ఒక ఎంపీ సీటుకు సంబంధించిందో.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిందో కాదు.. అంతకుమించి ! ఇక్కడ పాగా వేస్తే.. ఆ ఎఫెక్ట్‌ రాష్ట్రం అంతా ఉంటుంది. క్లీన్‌స్వీప్ చేయాలని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది అందుకే.. ఫ్యాన్‌ రెక్కలు విరిచేయాలని టీడీపీ కంకణం కట్టుకుంది అందుకే ! బిడ్డా.. ఇదే మా అడ్డా అని సవాళ్లు విసురుకునేది కూడా అందుకే ! ఏడాదిన్నరకు ముందే సీన్ ఇలా ఉంది అంటే.. రాబోయే రాజకీయం మరింత రగలడం ఖాయం. మరి అసంతృప్తులు ఏ పార్టీని ఏ తీరానికి చేర్చుతాయ్‌.. అలకలు ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తాయ్‌. ఏం జరగబోతోందని బెజవాడ వైపు ఆసక్తిగా చూస్తోంది యావత్‌ ఏపీ !

ట్రెండింగ్ వార్తలు