Alligator Gar Fish : బాబోయ్ ఎంత భయంకరంగా ఉందో.. వలకు చిక్కిన వింత చేప, అచ్చం మొసలిలా ఉంది

Alligator Gar Fish: ఆ చేప భయంకరమైన రూపం చూసి భయపడ్డారు. ఈ రకం చేప సాధారణంగా ఉత్తర అమెరికాలో కనిపిస్తుందని వివరించారు.

Alligator Gar Fish : అదో చేప. కానీ, దాని ఆకారం చాలా వింతగా, అంతకుమించి ఎంతో భయానకంగా ఉంది. అచ్చు మొసలిలా దాని ఆకారం ఉంది. మొసలిని పోలిన చేప స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఓ మంచి నీటి చెరువులో అనస్ అనే మత్స్యకారుడి వలకు వింత చేప దొరికింది. ఆ చేప చూసేందుకు అచ్చం మొసలిలా ఉంది. దీంతో అనస్ ఆశ్చర్యపోయాడు. దాని రూపం ఎంతో భయంకరంగా ఉండటంతో కొంత షాక్ కి గురయ్యాడు.

Also Read..Lions Escape from Circus : సర్కస్ బోనులోంచి బయటకొచ్చేసిన సింహాలు .. ప్రేక్షకులు పరుగులు,తొక్కిసలాట

ఈ వింత చేపను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. దాని భయంకరమైన రూపం చూసి కాస్త భయపడ్డారు. ఇక, ఈ చేప వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం మత్స్యశాఖ అధికారులకు తెలిసింది. దాంతో వారు వచ్చి చేపను పరిశీలించారు. ఈ చేప పేరు ఎలిగేటర్ గార్ అని తెలిపారు. ఈ రకం చేప సాధారణంగా ఉత్తర అమెరికాలో కనిపిస్తుందని వివరించారు. అయితే, ఆ చేప భోపాల్ చెరువులోకి ఎలా వచ్చిందోనని అధికారులు ఆశ్చర్యపోయారు.

ఉత్తర అమెరికాలో ప్రధానంగా కనిపించే ఎలిగేటర్ గార్ ఫిష్.. భోపాల్‌లోని మంచి నీటి చెరువులోకి ఎలా వచ్చింది అనే దానిపై అటవీ యంత్రాంగం ఆరా తీస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని మార్కెట్ల నుంచి భోపాల్‌కు చేపల పిల్లలను తీసుకొస్తారని, ఈ క్రమంలో ఈ ఎలిగేటర్ గార్ ను తీసుకొని వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఈ రకం చేపలు అక్కడ ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయేమోనని తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అవి ఇతర చేపలకు హాని కలిగిస్తాయట. పర్యావరణ వ్యవస్థకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయట. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎలిగేటర్ గార్ చేపల ఆయుర్దాయం 18-20 సంవత్సరాల మధ్య ఉంటుంది.

ఎలిగేటర్ గార్ చేపలు.. మనుషులపై దాడులు చేసినట్లు ధృవీకరించబడలేదు. అయినప్పటికీ అవంటే భయం ఉంది. ఈ చేపలు మానవులకు ప్రమాదాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వాటిని పట్టుకునే జాలర్లకు ప్రమాదకరమైనవి. ఎందుకంటే, ఈ చేపలు పదునైన దంతాలు కలిగి ఉన్నాయి. దాంతోపాటు పదునైన ఎముక పొలుసులు కూడా ఉంటాయి. జాలర్లు జాగ్రత్తగా ఉండకపోతే గాయాలకు గురి కావడం ఖాయం. చేతులు కోసుకుపోయే ప్రమాదమూ ఉంది. ఈ చేపలు సాధారణంగా 12 అడుగుల పొడవు ఉంటాయి. ఇక, భోపాల్ లో ఈ రకం చేప కనిపించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు