Adulterated milk : కల్తీ పాలను గుర్తించడం ఎలా..? కల్తీ పాల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..?

కల్తీ పాలను గుర్తించడం ఎలా..? కల్తీ పాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకోవటం చాలా చాలా అవసరముంది. లేదంటే ప్రాణాంతకం కావచ్చు.

Adulterated milk : చూడటానికి రియల్ పాలలాగే ఉంటాయి.. అస్సలు తేడాగా అనిపించవు. కానీ.. కడుపులో పడితేనే పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. అసలు కల్తీ పాలను ఎలా తయారు చేస్తారు..?
కల్తీ పాలను గుర్తించడం ఎలా..? కల్తీ పాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..?

100 లీటర్ల నీటిలో 5 కిలోల యూరియాను బాగా కలుపుతారు. దీంతో అది పాలలా తెల్లగా మారిపోతుంది. దానికి 250 గ్రాముల డిటర్జెంట్, కొంచెం రిఫైన్డ్ ఆయిల్ కలుపుతారు. పాలలా వాసన వచ్చేందుకు కెమికల్‌తో తయారు చేసిన తెల్లని పౌడర్ కూడా మిక్స్ చేస్తారు. 40 లీటర్ల ఈ ద్రవాన్ని 60 లీటర్ల పాలతో కలిపి 100 లీటర్ల కల్తీ పాలు సిద్ధం చేస్తారు. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. దీంతోనే కోవా, పన్నీర్ తయారు చేసి స్వీట్లు తయారుచేసే షాపులకు సప్లై చేస్తుంటారు. ఈ కల్తీ పాలను, అసలు పాలను గుర్తించడం సామాన్యులకు అసాధ్యమనే చెప్పాలి.

10 లీటర్ల పాలలో సగం పాలు తీసేస్తారు. నీళ్లు, యూరియా, సన్ ఫ్లవర్ ఆయిల్ కలుపుతారు. ఆ తర్వాత మిక్సీలో గ్రైండ్ చేస్తారు. నీళ్ల పాలు చిక్కగా తయారవుతాయి. ఇలా తయారు చేసిన కల్తీ పాలను సిటీవ్యాప్తంగా సప్లై చేస్తున్నారు. ఇలా చేయడంతో పాల చిక్కదనం పెరిగి.. వినియోగదారులు చిక్కటి పాలని అపోహ పడుతుంటారు. అసలు నిజమైన పాలకు ఏం తీసిపోకుండా ఉండడంతో.. జనం పట్టించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇవి తాగితే సాధారణ ఆరోగ్య సమస్యల నుంచి క్యాన్సర్ వరకు తీవ్ర స్థాయిలో ఆరోగ్య ముప్పు తప్పదంటున్నారు వైద్య నిపుణులు.

కల్తీ చేస్తున్నారు కదా అని ఆహారపదార్థాలను తినకుండా మీరు వదిలేయలేరు. అందుకే కొనేప్పుడే కాస్త అప్రమత్తంగా ఉండటం మేలు. అయితే చాలా వరకు కల్తీని గుర్తించడం కష్టం. కానీ కొన్ని పద్ధతుల్లో కల్తీని కనిపెట్టొచ్చు. తాగేవి కల్తీ పాలా..? అసలు పాలేనా..? అన్న విషయం సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం పెద్దపెద్ద పరికరాలేవీ అవసరం లేదు. ఇంట్లో చదునైన బండపై రెండు చుక్కలు పాలను వేస్తే అది మెల్లగా ఏదో ఓ వైపు పారుతుంది. అలా పాలు పారిన దారిలో తెల్లగా కనిపిస్తే అవి స్వచ్ఛమైన పాలే. కల్తీ పాలు అయితే వేగంగా పారి.. తెల్లగా ఏమీ కనిపించదు. అటు పాలల్లో నీళ్లు కలిపారో లేదో తెలుసుకునేందుకు మార్కెట్లో లాక్టోమీటర్ దొరుకుతుంది. ఇది మార్కెట్‌లో 100 నుంచి 300 మధ్య దొరికే ఈ పరికరంతో.. పాల కల్తీని వెంటనే తెలుసుకోవచ్చు. పీహెచ్ స్ట్రిప్‌తోనూ పాల కల్తీని గుర్తించొచ్చు. పీహెచ్ స్ట్రిప్‌పై చుక్క పాలను వేస్తే.. పీహెచ్ రేషియో 6.4 నుంచి 6.6 మధ్య ఉంటుంది. అంతకన్నా ఎక్కువ, తక్కువ ఉంటే.. పాలు కల్తీ అయినట్టే లెక్క.

పాలు అధిక సమయం నిల్వ ఉండేందుకు సోడా, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌లను ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు. వీటివల్ల మెదడు, నరాలు దెబ్బతింటాయని, జీర్ణకోశ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక యూరియా కారణంగా కళ్లు, మెదడుకు హానికరమని.. ఇకోలీ బ్యాక్టీరియా కారణంగా జీర్ణకోశ వ్యాధులు.. సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా టైఫాయిడ్‌ సమస్యలు వస్తాయంటున్నారు. పలు డెయిరీల నిర్వాహకులు పాలు తయారు చేసేందుకు నాణ్యత లేని పాలపొడిని వినియోగిస్తున్నారు. అది కూడా అపరిశుభ్ర పరిసరాల్లో పాల తయారీ సాగుతోంది. దీని వల్ల వివిధ రకాల వైరస్, బ్యాక్టీరియాలు సంక్రమించి రోగాల పాలు కావాల్సి వస్తుందని వైద్యులు చెప్తున్నారు.

కల్తీ పాలపై అప్రమత్తంగా లేకపోతే.. అంతే సంగతులంటున్నారు వైద్య నిపుణులు. కల్తీ పాలు తాగిన పిల్లలు ఎంట్రిక్‌ ఫీవర్, టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కడుపునొప్పి, వాంతులు అవుతాయంటున్నారు. ఇకోలీ బ్యాక్టీరియాతో వాంతులు, డయేరియా, జీర్ణకోశ వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. పాలను 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే అధిక వేడి మీద కొంతసేపు మరిగించినపుడే బ్యాక్టీరియా చనిపోతుంది. ఇక పాలల్లో కల్తీ చేసే పదార్థాలతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుండగా.. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు వైద్య నిపుణులు.

ట్రెండింగ్ వార్తలు