Dharmendra Pradhan: విద్యార్థులు ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు రాయడం తప్పనిసరా? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ఏం చెప్పారు?

ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై విద్యార్థుల నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చాయని తెలిపారు.

Dharmendra Pradhan

Board exams – Inter: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన విద్యా విధానం కింద పది, 12వ తరగతుల విద్యార్థులు ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు రాయడం తప్పనిసరేమీ కాదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

అధిక మార్కులు తెచ్చుకోవడానికి ఒకే ఒక అవకాశం ఉందని ఆందోళన చెందే విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడానికే రెండు సార్లు బోర్డు పరీక్షలు రాసుకునే విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గేలా పాఠ్య ప్రణాళికలనూ రూపొందిస్తున్నామని ఇటీవలే కేంద్ర విద్యాశాఖ వర్గాలు ప్రకటించాయి.

రెండుసార్లు బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులు ఏ పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధిస్తారో వాటినే తుది మార్కులుగా పరిగణిస్తామని తెలిపాయి. అలాగే, జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా కొత్త పాఠ్యాంశ ప్రణాళిక రూపొందించామని, 2024 విద్యా సంవత్సరం నుంచి ఆ పాఠ్యపుస్తకాలను తీసుకొస్తామని విద్యా శాఖ వర్గాలు చెప్పాయి.

దీనిపైనే ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై విద్యార్థుల నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చాయని తెలిపారు. తాను విద్యార్థులను కలిశానని, ఈ కొత్త విధానం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. 2024 విద్యా సంవత్సరం నుంచే ఈ పరీక్షల విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.

కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లతో ఒప్పందం చేసుకునే డమ్మీ స్కూల్స్ వ్యవహారాన్ని ఉపేక్షించబోమని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. వీటిపై తగిన విధంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.

రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ… ఇది చాలా సున్నితమైన అంశమని, ఎవరూ తమ విలువైన జీవితాలను కోల్పోవద్దరి, వారు మన పిల్లలని చెప్పారు. విద్యార్థుల్లో ఒత్తిడి లేకుండా చేయడం మన సమష్టి బాధ్యత అని అన్నారు.
Sunny Leone : సన్నీలియోన్ తెలుగు ఇస్కూల్.. అదిరిపోయిన ప్రోమో.. దేశ విదేశాల నుంచి తెలుగు కోసం..

ట్రెండింగ్ వార్తలు