Narendra Modi: సనాతన సంస్కృతిని అంతమొందించాలని ఇండియా నేతలు..: మోదీ కామెంట్స్

ప్రతిపక్షాల ఇండియా కూటమికి నాయకుడు లేరని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల వేళ..

PM Modi

Narendra Modi – Sanatan Dharma: ప్రతిపక్షాల ఇండియా (INDIA) కూటమికి రహస్య అజెండా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ సంస్కృతి, సనాతన ధర్మంపై దాడి చేయడమే ఆ అజెండా ఉద్దేశమని ఆరోపించారు. సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని ఇటీవల తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఎన్నికళ వేళ మధ్యప్రదేశ్‌లోని బీనాలో ఇవాళ బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ప్రతిపక్షాల ఇండియా కూటమికి నాయకుడు లేరని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల వేళ కూటమి నేతలను ముందుండి నడిపించే నాయకుడు ఎవరన్న విషయంపై చాలా ఉత్కంఠ నెలకొందని ఎద్దేవా చేశారు.

సనాతన సంస్కృతిని అంతమొందించాలని అజెండాగా పెట్టుకుని ఆ కూటమి పనిచేస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ నాయకత్వం వహించే స్థాయికి వెళ్తుంటే కొన్ని పార్టీలు మాత్రం దేశాన్ని, ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. ఆ పార్టీలన్నీ ఇప్పుడు ఇండియా కూటమి పేరుతో కలిశాయని అన్నారు. కాగా, ఇప్పటికే విపక్షాల కూటమి పలుసార్లు సమావేశాలు నిర్వహించి లోక్ సభ ఎన్నికల విషయంపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

Tamilnadu: అంబేద్కర్, దళితుల మీద కులదూషణలు.. వీహెచ్‌పీ మాజీ నేత అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు