Suryapet Constituency: హోరాహోరీగా సూర్యాపేట రాజకీయం.. కాంగ్రెస్ తలరాత మారుతుందా?

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే మళ్లీ హోరాహోరీ పోటీ జరిగేలా కనిపిస్తోంది. అయితే అటు బీజేపీ.. ఇటు బీఎస్పీ పార్టీలు చీల్చే ఓట్లే గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నాయి.

Telangana assembly elections 2023 who will win suryapet

Suryapet Assembly constituency సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం సూర్యాపేట.. సంస్థాగతంగా కాంగ్రెస్ బలంగా ఉన్న సూర్యాపేటలో వరుసగా రెండుసార్లు బొటాబొటి మెజార్టీతో గట్టెక్కారు మంత్రి జగదీశ్‌రెడ్డి.. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న జగదీశ్‌రెడ్డికి పార్టీలో అంతర్గత సమస్యలు సవాల్గా మారుతున్నాయి.. అటు కాంగ్రెస్‌లోనూ ఇంచుమించు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ సారి సూర్యాపేటలో ఎగిరేది ఏ జెండా? బీఆర్ఎస్ మరోసారి జోరు చూపనుందా? కాంగ్రెస్ తలరాత మారుతుందా? బీజేపీ ప్రభావం చూపుబోతుందా..? రానున్న ఎన్నికల్లో సూర్యాపేటలో కనిపించబోయే సీనేంటి?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారిధిగా నిలుస్తోంది సూర్యాపేట నియోజకవర్గం.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఉన్న సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోంది. జిల్లా కేంద్రంగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత సూర్యాపేట రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రధాన కేంద్రంగా ఉన్న సూర్యాపేట నుండి ఎందరో ప్రముఖ నేతలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 1952లో సూర్యాపేట నియోజకవర్గం ఏర్పాటు కాగా.. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదటి నాలుగు సార్లు వామపక్ష పార్టీ నేతలు ఎమ్మెల్యేలుగా గెలిస్తే.. ఆ తర్వాత ఐదు సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ గెలుపొందాయి. గత రెండుసార్లు వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించింది.

Guntakandla Jagadish Reddy (photo: facebook)

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉన్న సూర్యాపేట.. 2009లో పునర్విభజన తర్వాత జనరల్‌గా మారింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి బీఆర్ఎస్ హవా మొదలైంది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా, మొత్తం 2 లక్షల 35 వేల 323 మంది ఓటర్లు నమోదయ్యారు. గత రెండు ఎన్నికల్లోనూ మంత్రి స్వల్ప మెజార్టీతోనే గెలిచారు. 2014లో కేవలం రెండు వేల రెండు వందల ఓట్లు, గత ఎన్నికల్లో ఐదు వేల 9 వందల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు జగదీశ్‌రెడ్డి. మంత్రి ప్రధాన అనుచరుడిగా ఉన్న వ్యక్తి ఆగడాలపై ఇటీవల కాలంలో ఫిర్యాదులు పెరిగిపోవడం బీఆర్ఎస్‌కు ప్రతికూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిర్యాదులతో అతడిని మంత్రి దూరం పెట్టగా.. అతను జగదీశ్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో బీసీ నేతలను మంత్రి తొక్కేస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా తాను చేసిన అభివృద్ధే మళ్లీ గెలిపిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు మంత్రి.

Ramreddy Damodar Reddy (photo: google)

మొదట్లో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న సూర్యాపేటలో రానురాను కాంగ్రెస్ బలపడింది. ఇప్పటికీ ఆ పార్టీకి సంస్థాగతంగా మంచి బలం ఉంది. కానీ నేతల్లో ఐక్యత లేక గత రెండుసార్లు ఓటమి మూటగట్టుకుంది. సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి 2009లో సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆయన ఓటమి చవిచూశారు. ఈ సారి దామోదర్రెడ్డికి పోటీగా మరో సీనియర్ నేత పటేల్ రమేశ్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఈ ఇద్దరూ టికెట్ కోసం పోటీపడ్డారు. అయితే అప్పుడు టిక్కెట్ దామోదర్ రెడ్డికే దక్కింది. ఈ ఇద్దరు నేతల మధ్య గ్రూపు తగాదాల వల్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని.. ఈ సారి ఆ పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలని కార్యకర్తలు పార్టీ నేతలను కోరుతున్నారు. కానీ, సీనియర్ నేతగా దామోదర్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో పటేల్ రమేశ్‌రెడ్డి ఎవరికి వారు టికెట్ ప్రయత్నాల్లో ఉండటంతో చివరకు బీ ఫాం ఎవరికి దక్కనుందనే ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే టికెట్ దక్కుతుందంటున్న దామోదర్‌రెడ్డి టికెట్‌కే తనకే దక్కుతుందనే ధీమాలో ఉన్నారు.

Patel Ramesh Reddy (photo: facebook)

ఐతే దామోదర్‌రెడ్డికి పోటీగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పటేల్ రమేశ్ రెడ్డి సైతం తగ్గేదేలే అంటున్నారు. గత ఎన్నికల్లో సీనియర్ల మాట ప్రకారం దామోదర్‌రెడ్డికి సహకరించానని.. ఈసారి తనకు చాన్స్ ఇవ్వాల్సిందేనంటున్నారు రమేశ్‌రెడ్డి. పీసీసీ చీఫ్ రేవంత్ తో ఉన్న సాన్నిహిత్యంతో తనకే టిక్కెట్ ఖాయమనే ధీమాతో ఉన్నారు రమేశ్ రెడ్డి.

Also Read: ప్రజలు ఇక సంబరాలు జరుపుకోవాలి.. దసరాను ఘనంగా..: రేవంత్ రెడ్డి కామెంట్స్

Sankineni Venkateshwar Rao (photo: facebook)

కాంగ్రెస్ లో టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీపడుతుండగా, మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ పరిస్థితి పెద్దగా ఆశాజనకంగా లేదంటున్నారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు చరిష్మాపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే సూర్యాపేట పట్టణంలో తప్ప గ్రామీణ ప్రాంతంలో బీజేపీ ఉనికి కనిపించడం లేదని చెబుతున్నారు పరిశీలకులు.

Also Read: తెలంగాణలో ఓటర్ల వివరాలు ఇలా.. పోలింగ్ కేంద్రాలు ఎన్నిఅంటే..

Vatte Janaiah Yadav (photo: facebook)

మరోవైపు ఇటీవల మంత్రి జగదీశ్ రెడ్డితో విభేదించి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వట్టే జానయ్య బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్దమై పోయారు. బిసీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ జగదీశ్ రెడ్డి అణిచివేస్తున్నారన్న ప్రచారం చేస్తున్నారు జానయ్య. నిన్నమొన్నటి వరకు మంత్రి జగదీశ్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న జానయ్య దందాల వెనుక జగదీశ్ రెడ్డి హస్తం ఉందనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే మళ్లీ హోరాహోరీ పోటీ జరిగేలా కనిపిస్తోంది. అయితే అటు బీజేపీ.. ఇటు బీఎస్పీ పార్టీలు చీల్చే ఓట్లే గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నాయి. అటు కాంగ్రెస్ లో టిక్కెట్ దక్కని నేత తీసుకోబోయే స్టెప్ కూడా సూర్యాపేట ఫలితాన్ని తారుమారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు