Solar Panels : పర్యావరణహిత సౌరపలకల తయారీపై పరిశోధన… కడప జిల్లా వాసికి ఏపీ యంగ్ సైంటిస్ట్ అవార్డు

సౌర విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంలో రోజురోజుకు అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో పర్యావరణ హిత మూలకాల ద్వారా సౌర విద్యుత్‌ ఫలకల సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగం సరికొత్త పరిశోధనలతో ముందుకు సాగుతోంది.

Environmental Friendly Solar Panels : సౌర విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంలో రోజురోజుకు అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో పర్యావరణ హిత మూలకాల ద్వారా సౌర విద్యుత్‌ ఫలకల సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగం సరికొత్త పరిశోధనలతో ముందుకు సాగుతోంది. ఆ విభాగం పరిశోధక విద్యార్థి డాక్టర్‌ గుద్దేటి ఫణీంద్రారెడ్డి ‘కాపర్‌టిన్‌ సల్ఫైడ్‌ మూలకాల ద్వారా సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదకత’ అనే అంశంపై విభాగాచార్యులు కేటీ రామకృష్ణారెడ్డి మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తిచేసి 2019లో డాక్టరేట్‌ను అందుకున్నారు.

ఆ తర్వాత ఇదే పరిశోధనాంశం ఆధారంగా తన రీసెర్చ్‌ను కొనసాగించారు. ఈ నేపథ్యంలో 2020 జూన్‌లో తాను నిర్వహించిన పరిశోధనల్లోని ప్రగతిని నివేదికగా రూపొందించి ప్రతిష్ఠాత్మక ‘ఏపీ యంగ్‌ సైంటిస్ట్‌’ అవార్డుకు దరఖాస్తు చేశారు. నివేదికను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏపీ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సంస్థ భౌతికశాస్త్ర విభాగంలో ‘ఏపీ యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డ్‌-2020’కి ఫణీంద్రారెడ్డిని ఎంపిక చేసింది.

కడప జిల్లా కొర్రపాడు గ్రామం ఫణీంద్రారెడ్డి స్వస్థలం. తల్లిదండ్రులు గుద్దేటి వెంకటసుబ్బమ్మ, నాగిరెడ్ఢి తండ్రి మాజీ సైనికుడు. ప్రాథమిక విద్యను ఏపీఆర్‌ స్కూల్‌ కాల్వబుగ్గలో పూర్తిచేశారు. ప్రొద్దుటూరులో ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత ఎస్వీయూ భౌతికశాస్త్ర విభాగంలో పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేశారు. పీహెచ్‌డీ చేసే సమయంలో ఇంగ్లండ్‌లోని నాత్రుంబ్రియా వర్సిటీలో పరిశోధనలు నిర్వహించారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో 25పరిశోధన పత్రాలను ప్రచురించారు. 2019లో బెస్ట్‌ పోస్టర్‌ అవార్డును ఎస్వీయూ నుంచి అందుకున్నారు.

సోలార్‌ విద్యుత్‌ పలకలు వివిధ దశలలో తయారు చేస్తూ వస్తున్నారు. మొదటి దశలో ఫలకలను సిలికాన్‌ ద్వారా తయారు చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. వీటి ఉత్పాదక వ్యయం అధికం కావడంతో మధ్య తరగతి ప్రజలను చేరలేకపోయాయి. రెండో దశలో థిన్‌ఫిలిం టెక్నాలజీని వినియోగించి తయారు చేశారు. అయితే ఆరంభ దశలో వీటి అభివృద్ధికి వాడిన కాడ్మియం, టెలూరియం లాంటి మూలకాలు ఆరోగ్యానికి హానికరమంటూ నిపుణులు గుర్తించారు. ఆ తర్వాత థిన్‌ఫిలిం సోలార్‌ పలకల పునరుద్ధరణకు పర్యావరణ హిత మూలకాలపై కాపర్‌, టిన్‌, సల్ఫర్‌లతో చేసిన ‘అబ్జార్బర్‌ లేయర్‌’ని ఉపయోగిస్తూ డాక్టర్‌ ఫణీంద్ర రెడ్డి పరిశోధనలు నిర్వహించారు.

పర్యావరణ హిత మూలకాలతో సోలార్‌ పలకలను తయారు చేయడం ద్వారా వాటిని అతితక్కువ ధరలో ప్రజలకు అందించవచ్చునని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని డాక్టర్‌ ఫణీంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తూ ఏపీ యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డుకు దరఖాస్తు చేశారు. ఆయన దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం అవార్డుకు ఎంపిక చేసింది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఏపీ యంగ్‌ సైంటిస్ట్‌-2020’ అవార్డును అందుకోనున్నారు.

ట్రెండింగ్ వార్తలు