Kapu Leaders : కాపు నేతలు హర్ట్ అయ్యారా? పవన్ కల్యాణ్‌తో కటీఫేనా?

కాపు నేతలను ఒప్పించడంలో పవన్ విఫలం అయ్యారా? కాపు నేతలకు, జనసేనానికి మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయినట్లేనా?

Kapu Leaders Vs Pawan Kalyan

Kapu Leaders On Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కాపు ఉద్యమ నేతలకు కటీఫేనా? తమ సలహాలు, సూచనలను జనసేనాని పవన్ పాటించడం లేదని కాపు నేతలు హర్ట్ అవుతున్నారా? ఇకపై పవన్ తో ఎలాంటి మాటలు ఉండవా? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, కాపు సంక్షేమ సంఘం నేత హరిరామజోగయ్య లేఖలు చెబుతున్న సందేశం ఏంటి? కాపు నేతలను ఒప్పించడంలో పవన్ విఫలం అయ్యారా? కాపు నేతలకు, జనసేనానికి మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయినట్లేనా?

హరిరామజోగయ్య లేఖలకు ముద్రగడ లేఖలకు కొంత వ్యత్యాసం ఉండేది..
జనసేనాని పవన్‌కు వరసగా లేఖలు రాసే కాపు సంక్షేమ సంఘం నేత హరిరామజోగయ్య, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నొచ్చుకున్నట్లు కనిపిస్తోంది. జనసేన పార్టీకి అనధికార సలహాదారుగా పనిచేస్తున్న మాజీ ఎంపీ హరిరామజోగయ్య ఎప్పటికప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్‌కు లేఖలు రాస్తుంటారు. అదే విధంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ కూడా పవన్‌కు లేఖలు రాసేవారు. ఐతే హరిరామజోగయ్య లేఖలకు ముద్రగడ లేఖలకు కొంత వ్యత్యాసం ఉండేది. హరిరామజోగయ్య కాపు సంక్షేమ నేతగా తొలి నుంచి పవన్‌ శ్రేయస్సు కోరుతూ లేఖలు రాసేవారు. పవన్‌ను సీఎంగా చూడాలని ఆకాంక్ష వ్యక్తం చేసే వారు.

పవన్ తో ఇక సంబంధాలు ఉండవనే సంకేతాలు..
ఇదే సమయంలో ముద్రగడ రాసే లేఖలు పవన్‌ను టార్గెట్‌ చేసేవిగా ఉండేవి. అధికార పార్టీతో సత్ససంబంధాలు కోరుకోవడం వల్లే ముద్రగడ పవన్‌కు వ్యతిరేకంగా లేఖలు రాసేవారని విమర్శలు ఎదుర్కొనేవారు. కానీ, ఏమైందో కాని పవన్‌తో ఈ మధ్య ముద్రగడకు గ్యాప్‌ తగ్గింది. ముద్రగడతో పవన్‌ టచ్‌లోకి వెళ్లడమే కాకుండా ఆయనను పార్టీలోకి తీసుకుంటారనే టాక్‌ నడిచింది. ఈ ప్రచారం ఇలా ఉండగానే, సడన్‌గా పవన్‌తో ఇక ఎలాంటి సంబంధాలు ఉండవనే సంకేతాలిస్తూ చివరి లేఖ సంధించారు ముద్రగడ. ఆయన బాటలోనే పవన్‌ శ్రేయోభిలాషిగా వ్యవహరించిన హరిరామజోగయ్య కూడా అదే అభిప్రాయం కలిగేలా లేఖ రాశారు.

టీడీపీతో పొత్తుపై ముద్రగడ వ్యతిరేకత..!
ఉన్నట్టుండి.. ఇద్దరు కాపు నేతలూ ఒకేసారి లేఖలు రాయడంతో కలకలం రేగింది. టీడీపీ-జనసేన కూటమి సీట్ల సర్దుబాటుపైనే ఈ ఇద్దరూ అసంతృప్తి వ్యక్తం చేయడం.. అదే కారణంతో జనసేనాని వైఖరిని తప్పుపడుతూ లేఖలు సంధించడం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. తనను రెండుసార్లు కలుస్తానని కలవని జనసేనాని పవన్‌.. ఇంకెవరో డైరక్షన్‌లో నడుస్తున్నారని.. తనను పనికిరాని తుక్కుపట్టిన ఇనుప ముక్కలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడం ద్వారా చంద్రబాబు చెప్పినట్లు పవన్‌ నడుచుకుంటున్నారనే అభిప్రాయం కలిగేలా విమర్శలు గుప్పించారు ముద్రగడ. ఇక జనసేన 80 సీట్లలో పోటీ చేస్తుందని ఆశిస్తే కేవలం 24 సీట్లకే పరిమితమవడం తనను బాధించిందని చెప్పడం ద్వారా టీడీపీతో పొత్తుపై తన వ్యతిరేకత తెలియజేశారు ముద్రగడ.

వారి లేఖలను లైట్ తీసుకున్న పవన్..!
ఇక పవన్‌కు తొలినుంచి శ్రేయోభిలాషిగా వ్యవహరిస్తున్న హరిరామజోగయ్య.. తాడేపల్లిగూడెం సభకు రెండు రోజుల ముందు ఓ లేఖ రాశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పవన్‌ వ్యవహరించాలని.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్‌ తొలి రెండేళ్లు సీఎంగా పనిచేయాలని కోరారు హరిరామజోగయ్య. కూటమిలో పవన్‌ స్థానం ఏమిటో? చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఐతే హరిరామజోగయ్య లేఖలను జనసేనాని పవన్‌ లైట్‌గా తీసుకున్నారు. చంద్రబాబు కూడా పవన్‌, కాపు నేతల మధ్య జరుగుతున్న సంవాదంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు.

ఇక నీ కర్మ అంటూ నిష్టూరాలతో లేఖ..
దీంతో ఇటు హరిరామజోగయ్య, అటు ముద్రగడ ఒకేసారి లేఖలతో విమర్శలు గుప్పించారు. తన అవసరం ఉంటుందని పవన్‌కు సహకరిద్దామని తాను భావించానని.. కానీ, 24 సీట్లు తీసుకున్న పవన్‌కు ఎలాంటి అవసరం లేదని తేలిపోయిందని తన లేఖలో స్పష్టం చేశారు ముద్రగడ. అదే సమయంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లో ఏ ఒక్కరూ తన సూచనలు, సలహాలు పాటించలేదని ఆరోపిస్తూ.. ఇక వారి కర్మకు తాను చేయగలిగిందేమీ లేదని నిష్టూరాలతో మరో లేఖ సంధించారు హరిరామజోగయ్య.

హరిరామజోగయ్య తీసుకునే నిర్ణయంతో పవన్‌కు నష్టమే..
ఇలా ఇద్దరు ప్రముఖ కాపు నేతలు ఒకేసారి లేఖలు రాయడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీకి కాపుల మద్దతు ఎక్కువనే ప్రచారం ఉంది. జనసేనాని పవన్‌ కూడా తరచూ తన అభిమానులతోపాటు తన సొంత సామాజికవర్గం అండగా నిలవాలని కోరేవారు. జనసేనాని పవన్‌ ప్రచార కార్యక్రమాల్లో కూడా ఈ రెండు వర్గాలే ఎక్కువగా కనిపించేవి. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన ఎన్నికల సమయంలో కాపు సామాజికవర్గం అసంతృప్తితో ఉన్నట్లు ఇద్దరు బడా కాపు నేతలు లేఖల ద్వారా తెలియజేయడంతో జనసేన వర్గీయుల్లో ఆందోళన రేకెత్తుతోంది. ముద్రగడతో జనసేనానికి పెద్దగా సంబంధాలు లేకపోయినా, హరిరామజోగయ్య తీసుకునే నిర్ణయం మాత్రం పవన్‌కు నష్టం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ పరిస్థితిని పవన్‌ ఎలా అధిగమిస్తారనేదే ప్రశ్నార్థకంగా మారింది.

Also Read : వైసీపీ జోరు, విపక్షం బేజారు.. ఏపీ రాజకీయాల్లో ఏం జరగనుంది..?

 

పూర్తి వివరాలు..

 

ట్రెండింగ్ వార్తలు